150 ఏళ్లు బతకాలంటే.. లైంగికంగా దూరం కావాలా?

సృష్టిలో ప్రతి ప్రాణీ జీవం పోసుకోవాలన్నా... ఈ ప్రపంచం అంతం కాకుండా ఉండాలన్నా స్త్రీ, పురుష సంయోగం తప్పనిసరి. ‘తల్లిదండ్రి ఒకరినొకరు తాకనిచో...నీవు లేవు...నేను లేను...లోకమే లేదులే...’ అని సృష్టి రహస్యాన్ని వివరించాడో కవి. అయితే ఈ సృష్టి అందాలను ఎక్కువ కాలం ఆస్వాదించాలంటే స్త్రీ, పురుషులు తమ ‘కలయిక’ను కట్టిపెట్టాలంటున్నారు అమెరికన్‌ శాస్త్రవేత్త అలెక్స్‌ జావోరోన్కోవ్‌. శృంగారానికి దూరంగా ఉంటే మనిషి దాదాపు 150 సంవత్సరాలు బతుకుతాడని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ శాస్త్రవేత్త చెప్పింది ఎంతవరకు నిజం? ఆయన చెబుతున్నట్లు ప్రతి ఒక్కరూ పాటిస్తే ఏం జరుగుతుంది? అసలు మనిషికి శృంగారం అవసరమా? లేదా? శృంగారానికి సంబంధించి ఇంతవరకూ వచ్చిన సర్వేలు ఏమి చెబుతున్నాయి? వంటి విషయాలను తెలుసుకుందాం.

డాక్టర్‌ మెడిసిన్‌ కంటే శృంగారం కిక్కే బెస్టు 
శృంగారం గురించి చాలా సర్వేలే వచ్చాయి. అన్ని సర్వేలూ రతిక్రీడ వల్ల మనిషికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియజేసినవే! దంపతుల మధ్య అన్యోన్యతకు పడకగది ఎంత ఉపకరిస్తుందో ఈ సర్వేలన్నీ కుండబద్దలు కొట్టాయి. మనిషి ఆరోగ్యానికి శృంగారం ఎంతగా సహకరిస్తుందో తేటతెల్లం చేశాయి. ఈ పడక గదిలో చేసే ‘సెక్సర్సైజ్‌’ ముందు గంటలకొద్దీ చేసే వ్యాయామం కూడా దిగదుడుపే! ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే 300 కేలరీలు ఖర్చు అవుతాయని ఓ సర్వేలో వెల్లడించింది. మానసిక ఉల్లాసానికి సాధనం శృంగారం. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీనివల్ల మనిషి జీవితకాలం పెరుగుతుంది. వారానికి అయిదుసార్లు శృంగారంలో పాల్గొంటే హార్ట్‌ఎటాక్‌, కేన్సర్‌, రక్తపోటు వంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు బ్రెస్ట్‌ కేన్సర్‌, రక్తస్రావం వంటి వాటి గురించి మహిళలు చింతించనవసరం లేదు.
 
చాలా వరకూ రోగాలు నిద్రలేమితోనే వస్తాయి. శృంగారంలో పాల్గొన్నప్పుడు సెరటోనిన్‌, ఆక్సిటోసిన్‌, వాసోప్రెస్సిన్‌, ప్రొలాక్టిన్‌ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు శృంగారంలో పాల్గొన్న తర్వాత గాఢ నిద్రలోకి జారుకునేలా ప్రేరేపిస్తాయి. నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలను మటుమాయం చేస్తాయీ హార్మోన్లు. భార్యాభర్తలు పగటిపూట ఎంత కలహించుకున్నా రాత్రిపూట శృంగారకేళి వారిని ఐక్యపరిచి, ఉల్లాసపరుస్తుంది.
 
తీరని శృంగార కోరికలతో సతమతం 
కారణమేదైనప్పటికీ ప్రస్తుతం తరచు శృంగారంలో పాల్గొనేవారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అమెరికా, సింగపూర్‌, జపాన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో శృంగారంలో పాల్గొనేందుకు పురుషులు ఆసక్తి చూపడంలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పురుషులు ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ ‘అసలు’కే ఎసరు తెచ్చుకుంటున్నారని సర్వేల్లో తేలింది. ఆఫీసు పనివేళల్లో పోర్న్‌ సైట్స్‌ చూస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. పురుషులు శృంగారానికి దూరంగా ఉండటం వల్లే ఆయా దేశాల్లో కామ ఉద్దీపనలు కలిగించే పరికరాల అమ్మకాలు పెరిగాయని సర్వే తేల్చి చెప్పింది. విదేశాల్లో ఇలా ఉంటే మన దేశంలో పరిస్థితులు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. ప్రపంచానికి కామసూత్రాలను నేర్పిన భారతదేశం కూడా శృంగారంలో వెనక బడు తోంది. నగర ప్రజలు ఉరుకులుపరుగుల జీవితం గడుపుతూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిలో శారీరక సుఖాన్ని తీర్చుకునే సమయమే దొరకడం లేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఎక్కువమంది పట్టణ ప్రజలకు శృంగారం తీరని కోరికగా మారింది. ఆసక్తి ఉన్నా శృంగార కోరికలు తీరక తీవ్ర మనోవ్యధకు గురై చావును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే పట్టణ ప్రజలతో పోల్చితే పల్లెల్లో పరిస్థితి చాలావరకూ మెరుగు.
 
స్త్రీలకే ఎక్కువ 
పురుషులకు సగటున ప్రతి ఏడు సెకన్లకు ఒకసారి శృంగారపరమైన ఆలోచనలు వస్తాయని ఇటీవల ఓ సర్వే తెలిపింది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అందమైన స్త్రీ కనిపిస్తే తక్షణం వారు ఊహాలోకంలో విహరిస్తారని సర్వే వెల్లడించింది. ‘శృంగార ఆలోచనలు ఎవరిలో ఎక్కువ’ అనే అంశంపై బ్రిటన్‌లో ఓ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 1300 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న స్త్రీలలో 42 శాతం మంది తాము పురుషుల కంటే ఎక్కువగా సెక్స్‌ గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. తమ సెక్స్‌ కోరికలు భర్తలతో తీర్చుకోలేక ఊహాజనిత లోకంలో గడుపుతున్నామని వారు తెలిపారు. రతిక్రీడ పట్ల స్త్రీలకు ఆలోచనలు తక్కువేమీ కాదని ఈ సర్వే తేల్చిచెప్పింది
 
వృద్ధులేమీ తక్కువ కాదు 
వృద్ధుల్లో శారీరక కాంక్ష చాలా ఎక్కువగా ఉంటోంది. వయసు ముదిరినంత మాత్రాన తమలో సెక్స్‌ సామర్థ్యం తగ్గిపోలేదని కొందరు వృద్ధులు నిరూపిస్తున్నారు కూడా. లేటు వయస్సులో తండ్రులయిన వారు కూడా ఉన్నారు. ఢిల్లీలోని రామ్‌జిత్‌ రాఘవ్‌ అనే ఓ వృద్ధుడు తన తొంభై ఆరవ యేట తండ్రిగా మారి చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తండ్రిగా రికార్డులకెక్కాడు. అప్పటికి అతడి భార్య వయస్సు 52 సంవత్సరాలే! ఇప్పటివరకూ తాను ఆసుపత్రి మెట్లు ఎక్కలేదని ఆరోగ్యంగా ఉన్నాననీ రామ్‌జిత్‌ గర్వంగా చెప్పుకున్నాడు. వృద్ధులకు శృంగారం పట్ల ఆసక్తి ఉన్నా ఇంట్లో తమ పెద్దరికాన్ని కాపాడుకోవడానికి రతిక్రీడ పట్ల వెనకడుగు వేస్తున్నారు. కొందరయితే శృంగార వాంఛలు తీర్చుకోవడానికి కుటుం బానికి దూరంగా ఉంటున్నారు. ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూస్తున్న వృద్ధుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
 
మితిమీరితే ప్రమాదమే! 
యుక్త వయస్సులో సెక్స్‌ కోరికలు ఎక్కువ. వాటిని అదుపులో పెట్టుకోగలిగిన వారే విజయతీరాలు చేరతారు. అలా చేయలేని వారు చెడు అలవాట్లకు బానిసలవుతారు. ఈ వయస్సులో ఆ కోరికలను తీర్చుకోలేక వారు మానసికంగా కుంగిపోతుంటారు. తీరని మనోవ్యథ వారిని వేధిస్తుంటుంది. అమితమైన శృంగార కాంక్ష వల్ల సైకోలుగా మారిన యువకులెందరో! అత్యాచారాలు పెరగడానికి ఇదీ ఒక కారణమే! యువతీయువకులే కాక శృంగారానికి దూరమయిన దంపతుల్లో కూడా మానసిక అస్థిరత కనిపిస్తోంది. ఇంటర్నెట్‌ ప్రభావం వల్ల చిన్న పిల్లలకు కూడా సెక్స్‌ పట్ల అవగాహన కలుగుతోంది. పెద్దలు వారిని ప్రతినిత్యం కనిపెట్టి ఉండాలి. వారి నడవడిక గమనించి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
 
నేను అర్థాయుష్షుతో చావను
శృంగారానికి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాలపాటు జీవించవచ్చని అమెరికాలోని ప్రముఖ శాస్త్రవేత్త అలెక్స్‌ జావోరోన్కోవ్‌ వ్యాఖ్యా నించారు. ఆయన వృద్ధాప్యానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుంటారు. పెళ్లి, శృంగారం అనేవి జీవితకాలాన్ని నిర్దేశించే ప్రధాన అంశాలనీ, వీటి గురించి కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాను అప్పుడప్పుడూ శృంగారంలో పాల్గొంటుంటాననీ, దాన్నీ శాశ్వతం చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టే పెళ్లి చేసుకోలేదని అలెక్స్‌ అన్నారు. ఆహార నియమాలు పాటిస్తూ గుంజీలు తీయడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే ఆయుష్షును పెంచుకోవచ్చనీ సూచించారు. తాను రోజుకు 1600 నుంచి 1700 కేలరీల ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాననీ, అది కూడా పండ్లు, రసాల ద్వారానేననీ అలెక్స్‌ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో సగటు జీవితకాలం పురుషులకు 48, స్త్రీలకు 56 సంవత్సరాలుగా ఉంది. అందరిలా తానూ అర్దాయుష్షుతో చావాలనుకోవడం లేదనీ, మీ నిర్ణయం ఏమిటో తేల్చుకోండంటున్నారు అలెక్స్‌.
 
విరుద్ధమైన సర్వేలు 
రోజు రోజుకీ టెక్నాలజీ వృద్ధి చెందుతోంది. గ్రహాల గమనాన్ని, వాటి లక్షణాలను పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అయినా నేటికీ తమ పుట్టుకకు కారణమైన శృంగారంపైన మనుషులు స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. శృంగారం మనిషికి మేలు చేస్తుందని ఒకరంటే మనిషి జీవితకాలం తగ్గుతుందని మరొకరంటారు. సృష్టిలో ప్రతీప్రాణి స్త్రీ, పురుష కలయిక వల్ల జీవం పోసుకోవాల్సిందే! జీవం పోసుకున్న ప్రతిప్రాణీ ‘సృష్టికార్యం’లో పాల్గొనాల్సిందే! శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు ఆయుష్షు కోసం శృంగారాన్ని త్యజిస్తే ఈ భూమిపై మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. పురోగమనం కోసం పరితపిస్తున్న మానవజాతి తిరోగమనం పాలవ్వాల్సి వస్తుంది.
 
పసలేని సర్వేలతో పనేంటి 
శృంగారంలో పాల్గొంటే మంచిదా? కాదా? అనే వృథా ప్రశ్నలను కట్టిపెట్టడమే మేలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ‘‘మనిషికి కోరికలుండటం సహజం. ఏ వయసులో తీర్చుకోవాల్సిన కోరికలను ఆ వయస్సులో తీర్చుకోవాలి. మనిషి జీవితాన్నీ, శృంగారాన్నీ వేరు చేసి చూడకూడదు. స్త్రీ, పురుషుల సంపర్కం లేకుంటే సృష్టే లేదు. కోరికలు చంపుకుని ఎన్ని సంవత్సరాలు జీవిస్తే మాత్రం తృప్తి ఏముంటుంది? ఆ జీవితానికి సార్థకత ఏముంటుంది?’’ అంటున్నారు మానసిక నిపుణులు.