వడదెబ్బ తగ్గినా వైద్యం అవసరం

ఆంధ్రజ్యోతి, 25-04-2017: మానవ శరీరం ఒక కుండ లాంటిది. కుండ రంద్రాల్లోంచి వేడి బయటికి వెళ్లిపోయినప్పుడే కుండలోని నీరు చల్లబడుతుంది. అలాగే స్వేద రంధ్రాలోంచి వేడి బయటికి వెళ్లిపోయినప్పుడే శరీరం చల్లగా ఉంటుంది. ఒకవేళ అలా శరీరంలోని వేడి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే శరీరం వేడెక్కిపోతుంది. దీన్నే వడదెబ్బ అంటాం. శరీరం వేడెక్కినప్పుడు ఒక దశలో చెమట కూడా రాదు. దీనివల్ల శరీరం మరీ వేడెక్కుతుంది. ఆ తర్వాత హఠాత్తుగా విపరీతమైన చెమట వస్తుంది. ఇది వడదెబ్బ నుంచి తనను తాను కాపాడుకునేందుకు శరీరం చేసుకునే స్వయం చికిత్స.
 
శరీరం వడదెబ్బకు గురికాబోతోందని చెప్పే లక్షణం కూడా ఇదే. ఈ లక్షణాన్ని చూసి వెంటనే చికిత్స అందించకపోతే గుండెపోటు రావడం, శరీరంలోని కీలక అవయవాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. నిజానికి, వడదెబ్బకు అసలు చికిత్స మందులు ఇవ్వడం కాదు. శరీరాన్ని చల్లబరచడం. అంటే శరీరమనే కుండను నీళ్లతో నింపేయడం. మౌలికంగా, వడదెబ్బకు నీళ్లే అసలైన ఔషధం.
 
వడదెబ్బ లక్షణాలు కనిపించగానే ఆ వ్యక్తి చల్లని చోటికి చేర్చడంతోపాటు గంటకు ఒక గ్లాసు చొప్పు నీరు తాగించాలి. బాగా ఎండలో పనిచేసే వారైతే గంటకు రెండు గ్లాసుల నీరు తాగించాలి. ఆ వ్యక్తిఉన్న గదిని చల్లబరిచే ప్రయత్నం చేయాలి. శరీరాన్ని చల్లబరిచే ధర్మం ఉన్న పుచ్చకాయలు, కొబ్బరి నీరు, తాటి ముంజల వంటివి ఇవ్వాలి. వీటితో పాటు శరీరాన్ని చల్లబరిచే కొన్ని ఔషధాలు కూడా ఇవ్వాలి. బ్రాహ్మి, మండూకపర్ణి, అతి మధురం, శంకపుష్టి, బూడిద గుమ్మడికాయ, నన్నారివేళ్లు (సారివ) చందనం, వట్టివేరు వీటన్నింటినీ పొడి చేసి రెండు చెంచాల పొడిని నీళ్లల్లో కలపి తాగాలి. లేదా వాటిలో ఏదో ఒకదాని పొడి మాత్రమే అయితే ఒక చెంచా పొడిని నీళ్లల్లో కలిపి తాగాలి. అవసరమనుకుంటే రెండు చెంచాల పంచదార, రెండు చిటికెల ఉప్పు కూడా కలిపి తీసుకోవచ్చు.
 
మెదడును చల్లబరిచేందుకు.... 
వడదెబ్బ చికిత్సలో శరీరాన్నే కాదు మెదడును చల్లగా ఉంచడం చాలా ముఖ్యం. ఇందుకు చందనం గంధం తీసి మెడకు ఇరువైపులా రాయాలి. నీళ్లల్లో ముంచి పిండిన తడి వస్త్రాన్ని మెడ, ఛాతీ పొట్ట భాగాలకు చుట్ట వచ్చు. అయితే అది కొంత పొడిబారగానే దాన్ని తీసివేసి వేరే వస్త్రం చుట్టాలి. అంతే తప్ప వేసిన వస్త్రాన్ని అలాగే ఉంచేయకూడదు. 
వడదెబ్బకు గురైన వాళ్లల్లో చాలా మంది నీళ్లుతాగే స్థితిలో ఉండరు అలాంటప్పుడు ఐవి ద్వారా ద్రవాలను ఎక్కించాలి.
 
కోలుకున్నాక 
కోలుకున్న తర్వాత కూడా కొంతమంది మెదడు మీద, గుండె మీద వడదెబ్బ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఆ తర్వాత కొంత కాలం దాకా చికిత్సలు కొనసాగించాలి. చందనం, వట్టివేరు, గులాబిరేకుల పొడి, ధనియాలు, కొంచెంగా యాలకులు వీటన్నింటినీ మిశ్రమంగా చేసుకుని రోజూ చెంచా నీళ్లల్లో కలపి తాగాలి. అలా దాదాపు రెండు నెలల పాటు తాగితే వడదెబ్బ దుష్ప్రభావాలన్నీ తొలగిపోతాయి. వీటితోపాటు శడంగ పానీయపు పొడిని కూడా రోజూ ఒక చెంచా చొప్పున నీళ్లల్లో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్‌ డి. వి. ప్రశాంత్ కుమార్‌ 
ఆయుర్వేద వైద్యులు, హైదరాబాద్‌