వడదెబ్బ నుంచి ఉపశమనానికి...

19-04-2019: వేసవిలో ముంజలను తినడం వల్ల ఒంటికి చలువచేస్తుంది. ముంజల్లో ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు దోహదపడే పోషక గుణాలు మెండుగా ఉంటాయి. చల్లచల్లగా ఉండే ముంజలతో వేసవి తాపం నుంచి బయటపడొచ్చు. ముంజల్లో దాగిన మరిన్ని ఆరోగ్య గుణాలేంటో తెలుసుకుందాం.
ముంజల్లో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. దాంతో వీటిని తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు పెరుగుతామనే ఆందోళన అవసరం లేదు.
వీటిలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, కాల్షియం వంటి మినరల్స్‌ మోతాదు ఎక్కువ. కాబట్టి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి పొందుతుంది. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. డీహైడ్రేషన్‌, అలసట వంటి సమస్యలు ఎదురవవు.
ముంజలు తినడం వల్ల వాంతి, వికారం వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.
గర్భం దాల్చిన మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో అజీర్తి, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటివి సాధారణం. ముంజలు తింటే ఈ సమస్యల నుంచి తొందరగా
ఉపశమనం లభిస్తుంది.
ముంజలను తింటే శరీరానికి తగినంత నీరు అందుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా వడదెబ్బకు గురయ్యే అవకాశమూ తక్కువ. అంతేకాదు వేడికి ఏర్పడే సెగగడ్డలు కూడా తగ్గిపోతాయి.
అమ్మవారు సోకినప్పుడు ముంజలు తింటే తొందరగా తగ్గిపోతుంది.
ముంజల్లో ఉండే ఆంథోసయనిన్‌ అనే రసాయనం రొమ్ము భాగంలో కేన్సర్‌ కణాల వృద్ధిని అరికడుతుంది. వీటిలోని పొటాషియం విషపదార్థాలను బయటకు పంపించి, కాలేయాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది.
వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. గుండె సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి. అంతేకాదు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి.
విటమిన్‌ కె, బయోటిన్‌ వంటి విటమిన్లు, ఫోలేట్‌, పీచు లభిస్తాయి. వీటిలో కొవ్వు అస్సలుండదు. డైట్‌ పాటించేవారికి ఇవి మంచి ఫుడ్‌.
ముంజల్లో క్యాలరీలు తక్కువ. గ్లూకోజ్‌ ఎక్కువ ఉండడంతో శరీరానికి తొందరగా శక్తి అందుతుంది.
వంద గ్రాముల ముంజల్లో 43 క్యాలరీలు, 11 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 27 శాతం కాల్షియం, పీచుపదార్థం, ఐరన్‌, ఎ, ఇ విటమిన్లు లభిస్తాయి.
ముంజలకు కొబ్బరి నీళ్లు కలిపి, ఫ్రిజ్‌లో ఉంచితే వీటి చల్లదనం మరింత పెరుగుతుంది. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తింటే తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
యాలకులు లేదా దాల్చినచెక్క పొడిని ముంజల మీద చల్లుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. వీటితో నోరూరించే ఖీర్‌ తయారుచేసుకోవచ్చు.