వడదెబ్బ నుంచి ఉపశమనం

ఆంధ్రజ్యోతి, 28-04-2017: ధనియాలు, జిలకరను నేతితో వేయించి, ఆ తర్వాత మెత్తగా దంచి, కొంచెం ఉప్పు కలిపి ఒకటి రెండు చెంచాల మజ్జిగలో మిళితం చేసి తాగుతుంటే వడదెబ్బ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. దీని వల్ల అతి దాహం అదుపులోకి వస్తుంది. ఇలా రోజూ ఐదారు చెంచాల మిశ్రమాన్ని మజ్జిగతో తీసుకుంటే ఎండలో తిరిగే వారికి ఏ ప్రమాదమూ రాదు. ఈ పొడిని అన్నంలో వేసుకుని తింటే ఎంతో రుచిగా కూడా అనిపిస్తుంది. 

వడదెబ్బకు గురైన వారిలో కొందరికి విరేచనాలు కూడా అవుతాయి. ఇలాంటి సమస్యల ముందస్తు నివారణకు, మర్రి ఊడల చివర్లను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి, ఆ చూర్ణాన్ని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు ఈ పొడిని కొంచెంగా తీసుకుని, బియ్యం కడిగిన నీళ్లల్లో వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దానిలో కొంచెం పంచదార కలుపుకుని తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మజ్జిగ తాగేస్తే విరేచనాలు ఆగిపోతాయి. విరేచనాలు అలా పూర్తిగా ఆగిపోయేదాకా రోజుకు మూడు నాలుగుసార్లు తీసుకోవాలి.