ఎండలు... బాబోయ్‌ ఎండలు!

ఆంధ్రజ్యోతి, 25-04-2017: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నేల నుంచి ఎగిసే సెగ, పైనుంచి కాల్చేసే ఎండ వేడిమితో ప్రాణాలు అతలాకుతలమైపోతున్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే ఉభయ రాష్ట్రా‌ల్లో ఎండదెబ్బకు కొన్ని పదుల మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికే భయమేస్తోంది. కానీ ఈ వేసవిని సునాయాసంగా దాటేయాలంటే ‘వడదెబ్బ’కు గురికాకుండా చూసుకుంటే చాలంటున్నారు వైద్యులు. ఇందుకోసం ఏం చేయాలి? ఏలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? 


ఎండ దెబ్బ లక్షణాలు ఇవే! 

వేడికి చల్లదనమే విరుగుడు. శరీరంలో పెరిగే వేడికి చెమటే విరుగుడు. వేసవి వేడికి ఒళ్లంతా వేడెక్కినప్పుడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ చెమట వెలువడేలా చేసి, శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇదొక సహజసిద్ధమైన ప్రక్రియ. కానీ అందుకు శరీరంలో తగినంత నీరు ఉండాలి. అలాగే చమటతో కోల్పోయే ఒంట్లోని నీటిని తిరిగి ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. ఈ రెండూ జరగకపోతే ఒంట్లోని నీటి శాతం తగ్గి, మొదట ‘డీ హైడ్రేషన్‌’కు, అప్పటికీ జాగ్రత్త పడకపోతే ‘వడ దెబ్బ’కూ గురవుతాం. ఈ దశలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.

ఒళ్లు వేడిగా ఉంటుంది. కానీ చెమట పట్టదు.
చర్మం వేడిగా, పొడిగా మారి ఎర్రబడుతుంది.
శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది, తల తిరుగుడు లక్షణాలు కనిపిస్తాయి.
తల, కండరాల నొప్పులు బాధిస్తాయి.
వాంతులు
అలసట, నిస్సత్తువ ఆవరిస్తుంది.
గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
సత్వర చికిత్స అవసరం 
ఎండదెబ్బకు చికిత్స ఆలస్యమైతే అంతర్గత అవయవాలు దెబ్బ తినటంతోపాటు, కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వడ దెబ్బ లక్షణాలు కనిపించగానే వైద్యుల్ని కలిసేలోగా సత్వర చికిత్స మొదలుపెట్టాలి. 
ఎండ దెబ్బ తగిలిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను తగ్గించటం కోసం వెంటనే నీడకు చేర్చాలి.
దుస్తులు విప్పి, చల్లటి నీళ్లు చల్లాలి.
చల్లని గాలి తగిలేలా చేయాలి.
శరీర ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించటం కోసం ఐస్‌ ప్యాక్‌ కూడా వేయొచ్చు.
ఇలా చేస్తే ఎండ దెబ్బ తగిలిన వ్యక్తి కొంత తేరుకుంటాడు. ఆ తర్వాత వైద్య చికిత్స ఇప్పించాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి 

వేసవిలో ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి. 
వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.
జీన్స్‌ లాంటి మందంగా, బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం మానేయాలి.
ఎండలో వెళ్లిన ప్రతిసారీ తలకు టోపీ తప్పనిసరి.
హెల్మెట్‌ పెట్టుకునే వాళ్లు ముందు నీళ్లతో తడిపిన రుమాలు తలకు, ముఖానికి కట్టుకుని తర్వాత హెల్మెట్‌ పెట్టుకోవాలి.
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పనిసరిగా గొడుగు వాడాలి.
ఎండలో పనిచేసేవాళ్లు గంటకు లీటరు చొప్పున నీరు తాగాలి.
ఇంటిపట్టున ఉండేవారు రోజుకి 4 లీటర్ల నీరు తీసుకోవాలి.
నీరు ఉండే పుచ్చ, ద్రాక్ష, దోసకాయలను తినాలి.
చెమట ద్వారా కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేయడం కోసం ఎలకా్ట్రల్‌, కొబ్బరి నీరు తాగాలి.
ఉప్పు, పంచదార కలిపిన నీరు కూడా మేలు చేస్తుంది.
ఎండలో ఎక్కువ సమయం ప్రయాణం చేయవలసివస్తే రెండు గంటలకోసారి ఆగి, నీడ పట్టున విశ్రాంతి తీసుకోవాలి.
నల్ల దుస్తులు, హ్యాండ్‌ బ్యాగులు, చెప్పులు ఈ కాలంలో వాడకపోవటమే మంచిది.
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువ. కాబట్టి ఆ సమయంలో బయటికి రాకుండా ఉంటే మంచిది.
నీడలో పార్క్‌ చేసి ఉన్నా సరే... కార్లలో మాత్రం పిల్లల్ని వదలకూడదు.

పిల్లలు, వృద్ధులు పదిలం! 

మిగతావారితో పోలిస్తే వేసవి బాధలు పసి పిల్లలు, వృద్ధులకే అధికం. వృద్ధుల్లో ఎండ తీవ్రతను తట్టుకునేంత శక్తి ఉండదు. పసిపిల్లల చర్మపు విస్తీర్ణం తక్కువ. కాబట్టి వీళ్లు ఎండ దెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి. 
కూలర్లు, ఏసీలు వాడటం మేలు.
అవి ఉపయోగించే వీలు లేకపోతే, కిటికీలకు దుప్పట్లు కట్టి తడపొచ్చు. వట్టి వేళ్ల చాపలు వేలాడదీయొచ్చు.
వెడల్పాటి గిన్నెల్లో నీళ్లు నింపి, ఫ్యాన్‌ వేసి ఉంచితే గది చల్లబడుతుంది. పసిపిల్లలను పడుకోబెట్టే గదిలో ఇలా చేయాలి.
ఎట్టి పరిస్థితుల్లోనే పగటి వేళల్లో పసి పిల్లలను, వృద్ధులను బయటికి వెళ్లనివ్వకూడదు.
నీళ్లు తరచుగా తాగిస్తూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.
పదే పదే నీళ్లు తాగటానికి పిల్లలు ఇష్టపడకపోతే నీళ్లతోపాటు పళ్ల రసాలు, నిమ్మరసం, వెజిటబుల్‌ జ్యూస్‌ ఇవ్వొచ్చు.

ఎండ దెబ్బ వీళ్లకే ఎక్కువ! 

ఎవరికైనా ఎండదెబ్బ తగలొచ్చు. అయితే కొంతమందికి ఎండదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్లు ఎవరంటే? 
ఎండలో పనిచేసే ట్రాఫిక్‌ పోలీసులు.
వేడితో కూడిన ఫ్యాక్టరీలు, వాహనాల వర్క్‌షా్‌ప్సలో పనిచేసే వాళ్లు.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచే ‘సెంట్రల్‌ నెర్వస్‌ సిస్టమ్‌’(కేంద్ర నాడీ వ్యవస్థ) పసికందుల్లో పూర్తిగా వృద్ధి చెందదు. 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఈ వ్యవస్థ సామర్ధ్యం తగ్గుతుంది. కాబట్టి వీళ్లు ఎండదెబ్బకు తేలిగ్గా గురవుతారు.
కొన్ని రకాల మందులు వేడికి శరీరం స్పందించే తీరును ప్రభావితం చేస్తాయి. వాటిలో రక్తపోటు మందులు, ఉప్పు, నీటిని శరీరం నుంచి బయటకు పంపే ‘డయూరిటిక్స్‌’, యాంటీ డిప్రెసెంట్‌ మందులు కొన్ని.
చల్లగా ఉండే ఊరి నుంచి కొత్తగా వేడి ప్రదేశానికి వెళ్లినవారు.
నిద్రలేమికి గురయినవారు.
ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులున్నవారు, స్థూలకాయులు, క్రమబద్ధమైన జీవనశైలి లేనివారు, జీర్ణసంబంధ సమస్యలున్నవారు, ఎండదెబ్బకు గురయినవారు తేలికగా హీట్‌స్ట్రో‌క్‌కు గురవుతారు.

నీడలో ఉన్నా ఎండ దెబ్బే! 

ఎండలో తిరిగితేనే ఎండ దెబ్బ తగులుందనుకుంటే అది అపోహే! ఇంటి పట్టున ఉండేవాళ్లూ ఎండ దెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వేడి వాతావరణానికి గురైనా ఎండదెబ్బ తగులుతుంది. వంటగదిలో పొయ్యి దగ్గర ఎక్కువ సమయం గడిపే స్త్రీ‌లు, కొలిమి దగ్గర పనిచేసేవాళ్లు, రేకుల ఇంట్లో నివసించేవాళ్లు, వేడి గాలికి గురయ్యేవాళ్లకు కూడా ఎండ దెబ్బ తగులుతుంది. అలాగే విపరీతంగా వ్యాయామం చేసేవాళ్లు కూడా వేసవిలో ఎండదెబ్బకు గురవుతారు.
 
వడ దెబ్బ వాస్తవాలు 
ఎండదెబ్బ ప్రమాదకరం. సత్వర చికిత్స లోపిస్తే ప్రాణాంతకం కూడా!
శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుని చల్లబడకుండా ఉండిపోతే ఎండదెబ్బ తగిలినట్టు భావించాలి.
పసిపిల్లలు, వృద్ధులు, స్థూలకాయులకు ఎండదెబ్బ ప్రమాదం ఎక్కువ.
తల తిరుగుడు, వాంతులు, చిత్తభ్రమ... ఎండదెబ్బ ప్రధాన లక్షణాలు.
ఎండదెబ్బకు తక్షణ చికిత్స శరీర ఉష్ణోగ్రతను తగ్గించటమే!
 
డాక్టర్‌ ఎమ్‌.గోవర్థన్‌ 
సీనియర్‌ కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజీషియన్‌, 
కేర్‌ హాస్పిటల్స్‌, 
నాంపల్లి, హైదరాబాద్‌.