చినుకుల్లో చకచకా!

20-07-2017: వర్షంలో చెప్పులు తడిస్తే చికాకు అనిపిస్తుంది. అలాగని చెప్పులు లేకుండా అడుగు బయట పెట్టలేం. మనకు ఇష్టమైన చెప్పుల్నీ ఈ వర్షాల్లో వేసుకోలేము. ఈ సీజన్‌లో ఎలాంటి చెప్పులు వేసుకోవాలి? పాదాల సంరక్షణ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 
జెల్లీషూస్‌: ఒకప్పటి స్టయిలే ఇది! జెల్లీషూ్‌సను కాలేజీ అమ్మాయిలు మొదలుకొని గృహిణుల వరకు అందరూ ఇష్టపడేవారు. అయితే అప్పట్లో భిన్నమైన రంగుల్లో, స్టయిల్స్‌లో దొరికేవి కావు. ఇప్పుడు మార్కెట్‌లో రోజుకొక డిజైన్‌తో దర్శనమిస్తున్నాయివి. జెల్లీషూస్‌ వర్షాకాలంలో భలే సౌఖ్యం. ఒకవేళ నీళ్లలో తడిచినా ఫర్లేదు. క్షణాల్లో తేమ ఆరిపోతుంది. షూస్‌కు పైన రంధ్రాలు ఉంటాయి కాబట్టి కాళ్లకు గాలిసోకి.. తేమతో వచ్చే ఇన్‌ఫెక్షన్లు రావు. నీళ్లలో నడిచినా షూస్‌ పాడవ్వవు.
 
గమ్‌బూట్స్‌: ఈ సీజన్‌లో ఎప్పుడు వర్షం వస్తుందో ఊహించలేము. ఏ లెదర్‌ చెప్పులో వేసుకుంటే పాడైపోతాయి. స్లిప్పర్స్‌ అయితే జారే ప్రమాదం ఉంది. అందుకే గమ్‌బూట్స్‌ తొడిగితే ఏ సమస్యా ఉండదు. ఇవి మెత్తటి ప్లాస్టిక్‌, పైబర్‌లతో తయారవుతాయి. కాబట్టి నీళ్లలో గంటలకొద్దీ నానినా ఏ ఢోకా ఉండదు. రబ్బరుకు నీటిని పీల్చుకునే గుణం ఉండదు. తెగిపోవడమూ అరుదు. ఇంట్లో ఒక జత గమ్‌బూట్స్‌ ఉంటే మంచిది. వరుసగా వానలు పట్టుకున్నప్పుడు.. ఇవెంతో ఉపకరిస్తాయి. అందులోను వీటి ధర కూడా చాలా చౌక.
 
ఫ్లోటర్స్‌: వర్షాకాలంలో కాలేజీ అమ్మాయిలు.. తమకు ఇష్టమైన చెప్పులు వేసుకునే అవకాశం ఉండదు. అలాగని వర్షాకాలంలో రబ్బరు చెప్పులు వేసుకోవడమూ ఇష్టం ఉండదు. అందుకే ట్రెండీ, స్టయిల్స్‌ను కోరుకునే వారు ఫ్లోటర్స్‌ను ఎంచుకోవచ్చు. పాదానికి బెల్టు బిగుతుగా ఉంటుంది కాబట్టి.. వేగంగా నడిచేందుకూ ఇబ్బంది ఉండదు.
 
యొ జెలో శాండిల్స్‌: ఒక ప్రత్యేకమైన సింథటిక్‌తో తయారుచేసిన చెప్పల్స్‌ ఇవి. చూసేందుకు అద్భుతమైన షైనింగ్‌తో కనిపిస్తాయి. వీటిని ఎంచక్కా వర్షాకాలంలో వాడుకోవచ్చు. జెలోశాండిల్స్‌ను వీలైనంత వరకు వేడి తగిలే ప్రాంతంలో ఉంచకూడదు. బ్రష్‌తో పాలిష్‌ చేయొద్దు. పొడిబట్టతోనే తుడవాలి. వీటిలో హైహీల్స్‌ చెప్పులు కొనకపోవడమే మేలు. ఒక్కోసారి జారే ప్రమాదం ఉంది. సల్వార్‌కమీజ్‌, పంజాబ్‌డ్రెస్‌, జీన్స్‌ప్యాంట్లలోకి జెలో శాండిల్స్‌ అదుర్స్‌!
 
ఆక్వావేవ్‌ వాటర్‌ షూస్‌: తొడుక్కోవడం, వదలడం బహు తేలిక. వర్షాకాలంలో సముద్రతీర ప్రాంతాల్లోని బీచ్‌లు లేదంటే నదుల వద్దకు వెళ్లినప్పుడు, స్విమ్మింగ్‌పూల్స్‌ దగ్గరా ఎంతో ఉపకరిస్తాయి. ఈ షూస్‌తో మెత్తటి ఇసుకలోను, తడిమట్టిలోను నడవడం సులభం. షూస్‌ అడుగుభాగంలోని రబ్బర్‌ టెక్చర్‌ వల్ల నడకకు పట్టు లభిస్తుంది. జారిపడే అవకాశమే ఉండదు.
 
ఫ్లిప్‌పాప్‌: మనం రోజు వేసుకునే స్లిప్పర్స్‌లాంటివే ఇవి. మన చెప్పుల స్టాండ్‌లో.. ఫ్లిప్‌పాప్‌ చెప్పులు సైతం ఒక జత తప్పనిసరి. వర్షంలో టక్కున బయటికి వెళ్లాల్సి వస్తే.. వీటిని వేసుకోవచ్చు. ఇంట్లోనూ వాడుకోవచ్చు. కేవలం వర్షాకాలంలోనే కాకుండా అన్ని సీజన్లలోను ఆల్‌ఇన్‌వన్‌లా పనికొస్తాయి.
 
ఎలాంటివి వేసుకోకూడదు?
వర్షాకాలంలో కాన్వాస్‌ షూస్‌ జోలికి వెళ్లకండి. తడి పట్టుకుంటే ఒక పట్టాన వదలవు. మూడునాలుగుసార్లు వర్షంలో తడిస్తే ఇక పనికిరావు. పడేయాల్సిందే!
ఫార్మల్‌ షూస్‌, లెదర్‌ షూస్‌లను కూడా వాడకపోవడం మేలు. తోలుతో తయారైనవి కాబట్టి నీళ్లకు తడిస్తే త్వరగా దెబ్బతింటాయి. అందులోను దుర్వాసనను వెదజల్లుతాయి. తద్వార ఇన్ఫెక్షన్లు రావొచ్చు.
సాక్స్‌లు లేని షూకు ప్రాధాన్యం ఇవ్వాలి. వర్షంలో సాక్సులు నానిపోయి.. చికాకు తెప్పిస్తాయి. తడి వల్ల కాళ్లు నవ్వలుపెట్టి.. ఎర్రటి నీటి బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది.
హైహీల్స్‌ అస్సలు వేసుకోవద్దు. వర్షంలో రోడ్లు తడిచిపోతాయి. సహజంగానే హైహీల్స్‌ చెప్పులతో నడకే ఇబ్బంది. అలాంటిది వర్షాల్లో జారే ప్రమాదం లేకపోలేదు.