వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఆహారంలో..

ఎండలు పెరిగిపోతున్నాయి. అలసిపోకుండా, వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఆహారంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- రజని, విశాఖపట్నం
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల శరీరంలోని నీరు ఆవిరైపోతుంది. తగినంత నీటిని తీసుకోకపోతే చాలా నీరసంగా ఉంటుంది. దాహమనిపించక పోయినా గుర్తు పెట్టుకొని మరీ ప్రతి గంటకూ నీళ్లు తాగాలి. బయట ఎక్కువ తిరిగే వాళ్ళు కొబ్బరిబొండం, మజ్జిగ లాంటివి విరివిగా తీసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగడం కష్టంగా అనిపించినప్పుడు, ముఖ్యంగా పిల్లలకు నిమ్మరసం, మజ్జిగ, నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చ, బొప్పాయి, ద్రాక్ష వంటి పళ్ళను ఇవ్వాలి. వాతావరణంలోని వేడి కారణంగా ఉదయం వండిన కూరలు సాయంత్రానికే పాడయ్యే ఆస్కారం ఉంది. అందువల్ల తాజాగా వండుకోవడం ఉత్తమం. అలా కుదరకపోతే, వండిన కూరలు చల్లారగానే ఫ్రిజ్‌లో పెట్టి, తినే ముందు వేడిచేసుకోవాలి. సలాడ్లు కూడా తాజాగానే తయారు చేసుకోవాలి. నడక అలవాటు ఉన్నవారు సూర్యోదయానికి ముందో, సూర్యాస్తమయం తరువాతో వెళ్లడం మంచిది. ఎక్కడికెళ్లినా వెంట ఓ మంచి నీళ్ల సీసా తప్పనిసరి. వ్యాయామం సమయంలో అయితే, కనీసం అరలీటరు నీళ్లు తాగాలి.