వడదెబ్బను నివారించలేమా?

ఆంధ్రజ్యోతి, 25-04-2017:సహజంగా శరీరంలోంచి చెమట ద్వారా, శ్వాస ద్వారా మూత్రం ద్వారా రోజుకు మూడున్నర నుంచి నాలుగు లీటర్ల నీరు ఆవిరి అవుతూ ఉంటుంది. వేసవి కాలంలో అయితే అది ఆరు లీటర్ల వరకు ఉంటుంది. ఆ మేర నీటిని ఎప్పటి కప్పుడు శరీరంలో నింపాల్సి ఉంటుంది. అలా అందనప్పుడు మెదడు, గుండెకు జరగాల్సిన రక్తప్రసరణ కుంటుపడుతుంది. ఇదంతా వడదెబ్బ ఫలితమే. ఈ స్థితిలో స్పృహ కోల్పోవడమో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడమో జరగవచ్చు. అందుకే వేసవి కాలంలో మూడున్నర నుంచి ఆరు లీటర్ల దాకా నీరు తాగడం తప్పనిసరి.
 
వీటితో పాటు పుచ్చకాయ, పైన్‌ యాపిల్‌, మామిడి పండ్ల్ల రసాలుగానీ కొబ్బరి నీళ్లు గానీ విరివిగా తాగాలి. బార్లీగంజిలో తేనె, నిమ్మరసాన్ని కలిపి తాగొచ్చు. తేనె నిమ్మరసం కలిపిన నీళ్లను తాగినా ఫలితం ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టిన పానీయాలేవీ తీసుకోకూడదు. బాగా ఎండలో తిరిగి వచ్చిన వాళ్లు బాగా చల్లని నీటిని, కూల్‌ డ్రింక్స్‌ తాగాలనుకుంటారు. కానీ, అతి వేడి లేదా అతి శీతలంగా ఉండే ఆహార పానీయాలేవీ శరీరం స్వీకరించదు. శరీరంలోకి వెళ్లి అవి మళ్లీ మామూలు స్థితికి వచ్చాకే కణజాలం వాటిని స్వీకరిస్తుంది. చల్లటి నీటిని ఎంత తాగినా వెంటనే దాహం తీరకపోవడానికి ఇదే కారణం.
 
అందుకే వేడిగా గానీ, చల్లగా గానీ లేని సాధారణ నీటినే తాగాలి. వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలే తీసుకోవాలి. నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసాహారం తీసుకోకపోవడం శ్రేయస్కరం. వేసవి వాతావరణంలో దుమ్మూధూళి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మాస్క్‌ ధరించడం మేలు. ఎండలో వెళుతున్నప్పుడు తెల్లని లేదా నీలి రంగు టోపీలను లేదా గొడుగు విధిగా వాడాలి. ఎండలో వెళుతున్నప్పుడు రెండు లీటర్ల నీటిని వెంట తీసుకుపోవడం కూడా తప్పనిసరి. మలబద్ధకం శరీర ఉష్ణోగ్రతను పెంచే ప్రమాదం ఉంది కాబట్టి పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే కీరా, క్యారట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, సలాడ్స్‌ తరుచూ తీసుకుంటే మంచిది. రోజుకు రెండుసార్లు చన్నీళ్లతో స్నానం చేయాలి. పాదాలు, తల వేడెక్కినా, కళ్లు ఎర్రబారినా పాదాలను కళ్లను తలను, ముఖాన్ని చన్నీటితో తడపాలి.
 
వడదెబ్బ తగిలాక.... 
తలనొప్పి, కళ్లు తిరగడం, నీళ్ల విరే చనాలు, వాంతులు, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటి లక్షణాలు క నిపించాయీ అంటే, అది వడడెబ్బ ఫలితమేనని గుర్తించాలి.
వడదెబ్బ తగలిన వ్యక్తి ఎండలో ఉంటే వెంటనే నీడలోకి తీసుకురావాలి. దుస్తులను వదులు చేయాలి. గ్లాసుతో కాకుండా చెంచాతో కొంచెం కొంచెంగా నీరు తాగించాలి. ఇలా మెల్లమెల్లగా తాగించడం వల్ల నీటితో లాలాజలం కలిసి అవి త్వరగా శరీరంలో ఇంకే అవకాశం ఏర్పడుతుంది.
నీళ్లల్లో ముంచి పిండిన వస్త్రాన్ని తలమీద, నుదుటి మీద, వెన్నెపాము మీద 30 నిమిషాల పాటు ఉంచాలి. అలా రోజుకు రెండు మూడుసార్లు వేయాలి. లేదా గొంతు నుంచి శరీరంలోని కింది భాగాన్నంతా నీటిలో ముంచి పిండిన వస్త్రంతో చుట్టేయాలి. దాని మీద పొడివస్త్రాన్ని కప్పాలి. శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను చల్లని వస్త్రం లాగేస్తే, దానిపైన కప్పిన పొడి వస్త్రం బయట ఉన్న వేడిని లోనికి ప్రవేశించకుండా చూస్తుంది. ఒకవేళ అక్కడికీ ఫలితం కనిపించకపోతే ఐ.వి. ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలి.
 
డాక్టర్‌ టి. కృష్ణమూర్తి 
సూపరింటెండెంట్‌ 
రెడ్‌క్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా అండ్‌ నేచర్‌క్యూర్‌ , హైదరాబాద్‌