వానల్లో ఒళ్లు కాలే జ్వరాలు

ఆంధ్రజ్యోతి, 25-07-2017:వానలు దంచి కొట్టేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఎక్కడ చూసినా చిత్తడి, బురద నీళ్లు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు. వీటన్నిటితో తెగ చిరాకేస్తోంది కదూ! కానీ ఈ వాతావరణాన్ని ఇష్టపడే జీవులున్నాయి. ఇవి వర్షాకాలంలో విపరీతంగా విజృంభించేసి మొండి జ్వరాలతో ఒంటిని, ఇంటినీ హూనం చేసేస్తాయి. కాబట్టి ఈ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
 
వానాకాలం జ్వరాలకు కారణం... వాతావరణంలో విస్తరించి ఉండే బ్యాక్టీరియా, వైర్‌సలే! ఇవి ఈగలు, దోమలు, సూక్ష్మక్రిముల ద్వారా మన శరీరంలోకి చేరుకుని జ్వరాలను కలిగిస్తాయి. చల్లని వాతావరణం, అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం, నీరు కారణంగా జ్వరాలు వ్యాపిస్తాయి. అయితే ఎక్కువ శాతం జ్వరాలు దోమల నుంచే సంక్రమిస్తాయి. దోమల్లో రకాలను బట్టి జ్వరాల్లోనూ తేడాలుంటాయి.
 
మలేరియా
మలేరియా కారక దోమలు రాత్రివేళే కుడతాయి. వైవాక్స్‌, ఫాల్సిఫారం, ఓవేల్‌, మలేరియా మలేరియే...ఈ నాలుగు రకాల మలేరియాల్లో వైవాక్స్‌, ఫాల్సిఫారం అనే రెండు రకాలే మన ప్రాంతంలో ఎక్కువ. ఈ రెండు రకాల జ్వరాలు దోమల వల్లే వచ్చినా వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో తేడాలుంటాయి. అలాగే వాటికి చికిత్సలూ వేర్వేరుగా ఉంటాయి.
 
ఫాల్సిఫారం మలేరియా: దీన్లో కాంప్లికేషన్స్‌ ఎక్కువ. కాబట్టి వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే వేగంగా చికిత్స మొదలుపెట్టాలి. లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్‌, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పరీక్షల్లో ఫాల్సిఫారం అని తేలగానే సత్వరం సమర్థమైన చికిత్స అందించాలి.
వైవాక్స్‌: జ్వరం మొదలయినప్పటి నుంచి ఇన్‌ఫెక్షన్‌ రోగి శరీరంలో 12 నుంచి 18 వారాలుంటుంది. వైవాక్స్‌ ప్యారసైట్‌ శరీరంలో చేరటం వల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాలు వేగంగా నశించటం మొదలు పెడతాయి. కాబట్టి సత్వర చికిత్స అందించాల్సి ఉంటుంది.
 
లక్షణాలు ఇవే!
చలి జ్వరం
తలనొప్పి
నీరసం
వాంతులు
సమర్ధమైన చికిత్సలున్నాయి
రక్త పరీక్షలో మలేరియా అని తేలితే ‘క్లోరోక్విన్‌’ మందులతో శరీరంలో చేరిన ప్యారసైట్‌ను అంతం చేయొచ్చు. శరీరంలో చేరుకున్న ప్యారసైట్‌ శాతాన్ని బట్టి నోటి మాత్రలు, ఇంజెక్షన్లను వైద్యులు సూచిస్తారు. ఈ ప్యారసైట్‌తో రక్తంలోని ఎర్ర రక్త కణాలు 5 శాతానికి మించి వ్యాధి బారిన పడితే నోటి ద్వారా కాకుండా ఇంజెక్షన్ల రూపంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. సమర్ధమైన చికిత్స అందించగలిగితే 36 నుంచి 48 గంటల్లోగా జ్వరం అదుపులోకొస్తుంది. శరీరంలో చేరుకున్న మలేరియా కారక ప్యారసైట్లన్నీ 2 నుంచి 3 రోజుల్లోగా అంతమవుతాయి.
 
డెంగ్యు
డెంగ్యు వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వైరస్ ని కలిగి ఉండే దోమలు పగటి వేళే కుడతాయి. మొదట విపరీతమైన జ్వరం వచ్చి మూడు రోజులకు తగ్గుతుంది. దీంతో వచ్చింది సాధారణ జ్వరమే అనుకుని క్రోసిన్‌ లాంటి మందులు వాడేసి ఊరుకుంటాం. కానీ డెంగ్యు జ్వరాన్ని గుర్తించకుండా సొంత వైద్యం చేసుకోవటం ప్రమాదకరం.
 
లక్షణాలు ఇవే!
విపరీతమైన జ్వరం
ఒళ్లు నొప్పులు
తలనొప్పి
కళ్లు లాగటం
కడుపు నొప్పి
ఆయాసం
ఒంటి మీద దద్దుర్లు
జ్వరం విపరీతంగా పెరిగి ఒక్కసారిగా తగ్గిందంటే...శరీరంలో ప్లేట్‌లెట్ల శాతం తగ్గుతున్నట్టు అర్థం. ఈ స్థితిలో పరీక్షలో డెంగ్యు అని నిర్ధారణ అయితే సపోర్టివ్‌ కేర్‌తో వ్యాధిని అదుపులోకి తేవొచ్చు. ఒకవేళ ప్లేట్‌లెట్స్‌ తగ్గినా జ్వరం తగ్గింది కదా! అని వైద్యుల్ని కలవకుండా ఉండిపోతే రక్తంలోని ద్రవాలు బయటికి స్రవించి రక్తం చిక్కబడుతుంది. ఇది ఎంతో ప్రమాదకరం. ప్లేట్‌లెట్స్‌ తగ్గితే వాటిని అందించి సులభంగా చికిత్స చేయవచ్చు. కానీ రక్తం చిక్కబడే ‘డెంగ్యు హెమరేజిక్‌ ఫీవర్‌’తో అంతర్గత అవయవాలు దెబ్బతినటం మొదలు పెడతాయి.
 
ప్రధాన అవయవాలైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. ఈ దశలో ఆయాసం, చర్మం మీద దద్దుర్లు, కడుపులో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే డెంగ్యు బారిన పడిన రోగులందరూ ఈ స్థితికి కచ్చితంగా చేరుకుంటారని చెప్పలేం. సాధారణంగా డెంగ్యు సోకిన 90 శాతం మందిలో జ్వరం మాత్రలు వాడుతూ, విశ్రాంతి తీసుకుంటే తేలికగానే తగ్గిపోతుంది. వంద మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ‘డెంగ్యు హెమరేజిక్‌ ఫీవర్‌’ దశకు చేరుకుంటారు. ఈ దశకు చేరుకోకుండా ఉండాలంటే జ్వరం కనిపించిన వెంటనే వైద్యుల్ని కలవాలి.
 
పరీక్షలు, జాగ్రత్తలు
‘డెంగ్యు సిరాలజీ’ పరీక్షతో ఈ జ్వరాన్ని నిర్ధారించవచ్చు. ఎలీజా, ఎల్‌ఎస్‌1 పద్ధతులు కూడా ఈ జ్వరాన్ని నిర్ధారిస్తాయు. ఈ కిట్‌ల సహాయంతో ఇంటి దగ్గరే డెంగ్యుని గుర్తించవచ్చు. డెంగ్యు అని నిర్ధారణ అవగానే కంగారు పడిపోకుండా సమర్ధమైన వైద్యం తీసుకుంటే ఎక్కువ నష్టం జరగకుండానే జ్వరాన్ని తగ్గించుకునే వీలుంది. డెంగ్యు ప్రభావంతో రక్తం చిక్కబడుతుంది కాబట్టి అలా జరగకుండా వీలైనన్ని ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. విశ్రాంతి తీసుకుంటూ ప్యారాసిటమాల్‌ లాంటి మాత్రలు వాడటం మొదలుపెట్టాలి. డెంగ్యుకు ఎలాంటి స్టిరాయిడ్స్‌, యాంటిబయాటిక్స్‌ మందులు వాడాల్సిన అవసరం లేదు. అయితే డెంగ్యు వైరస్‌ వ్లల కొందరిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్లు మొదలవుతూ ఉంటాయి.
 
టైఫాయిడ్‌
సాల్మొనెల్లా టైఫై, సాల్మొనెల్లా పారాటైఫై బ్యాక్టీరియాల వల్ల టైఫాయిడ్‌ వస్తుంది. ఈ బ్యాక్టీరియా కలిగి ఉండే కలుషిత ఆహారం, నీరు తాగటం వల్ల జ్వరంతో ఈ వ్యాధి మొదలవుతుంది. 104 డిగ్రీలకు మించిన జ్వరంతో తల నొప్పి, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించటం లాంటి లక్షణాలు ఉంటాయి. ఆహారంతోపాటు శరీరంలోకి చేరే ఈ బ్యాక్టీరియా రక్తప్రవాహం ద్వారా కాలేయం, పిత్తాశయం, ఎముక మజ్జలోని తెల్ల రక్తకణాల్లోకి చేరుతుంది. ఈ సమయంలో విపరీతమైన జ్వరం కనిపిస్తుంది. మలం లేదా రక్త పరీక్షతో ఈ వ్యాధిని గుర్తించి యాంటీబయాటిక్స్‌తో చికిత్సనందిస్తే టైఫాయిడ్‌ అదుపులోకొస్తుంది.
 
ఈ రుగ్మతలతోనూ జ్వరాలు
వర్షాకాలంలో జ్వరం సాధారణం అనుకుంటాం. కానీ ఆ జ్వరాలకు కారకాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి చేతికందిన జ్వరం మాత్ర వేసుకుని ఊరుకోకుండా వైద్యుల్ని కలిసి, పరీక్షలు చేయించుకుని, జ్వరానికి కారణమైన ఇన్‌ఫెక్షన్‌ గురించి తెలుసుకోవాలి. జ్వరం కనిపించగానే వైద్యుల్ని కలవగలిగితే వ్యాధిని సకాలంలో గుర్తించే వీలుంటుంది. ఆ వ్యాధులేవంటే....
 
అతిసారం: ఈ కాలంలో అతిసారం సర్వసాధారణం. పసిపిల్లల్లో, వృద్ధుల్లో అతిసారంతోపాటు జ్వరం కనిపిస్తుంది. మధుమేహులకు కలరాతోపాటు జ్వరం కూడా ఉంటుంది. ఇలాంటి జ్వరంతోకూడిన వైరల్‌ డయేరియాలకు వీలైనంత త్వరగా చికిత్సనందిస్తే రోగులు త్వరగా కోలుకుంటారు. వాంతులు, విరేచనాలతో బాధపడే పిల్లలు, వృద్ధులకు జ్వరం కూడా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. 
హంటా వైరస్‌: ఎలుకల మలం ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్‌ ప్రధాన లక్షణం జ్వరం. గాలితోపాటు ఊపిరిత్తుల్లోకి చేరే ఈ వైరస్‌ వల్ల జ్వరంతోపాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు కూడా ఉంటాయి.
జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌: పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధిని మెదడు వాపు అని అంటారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌, అరుదుగా ఫిట్స్‌ కూడా ఈ వ్యాధిలో కనిపిస్తాయి. సరైన చికిత్స అందించకపోతే రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ‘కోమా స్కేల్‌’ ఆధారంగా వ్యాధి మెదడుకు చేరిందో లేదో తెలుసుకుని దానికి తగ్గట్టు చికిత్సనందించాలి.
 
నియంత్రణ సులువే!
వర్షాకాలం జ్వరాలకు ప్రధాన కారణం...అపరిశుభ్రత, నిల్వ నీరు, దోమలు, ఈగలు, పెంపుడు జంతువులు, పురుగులే! కాబట్టి ఇవి దరిచేరకుండా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటి నివాసానికి వీలులేని వాతావరణాన్ని కల్పించాలి.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
టైర్లు, కొబ్బరి చిప్పలు, తొట్లు...ఇలా వాన నీరు నిల్వ ఉండే వస్తువులను పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి.
ఆహారం తినేముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
ఆహార పదార్థాల మీద మూతలు ఉంచాలి.
నీళ్లు కాచి, వడపోసి తాగాలి.
పెంపుడు జంతువులు ఉండే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి.
దోమలు కుట్టకుండా శరీరం మొత్తాన్నీ కప్పే దుస్తులు ధరించాలి.
దోమ తెరలు వాడాలి. మస్క్యుటో రిపెల్లెంట్స్‌ వాడాలి.
  
 
 
 
డాక్టర్ సుదర్శన్ రెడ్డి,
సీనియర్ కన్సల్టెంట్ అండ్
జనరల్ ఫిజీషియన్,
కాంటినెంటల్ హాస్పిటల్స్,
హైదరాబాద్.