చల్లబడాలంటే...

ఆంధ్రజ్యోతి, 15-04-2017: వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఫుడ్స్‌ చాలా అవసరం. టొమాటో, ఉల్లిపాయలు, క్యాబేజీ, కీర, గుమ్మడి, క్యారెట్‌, ఉసిరి వంటివి తింటే శరీరం కూల్‌గా ఉంటుంది. అంతేకాదు వీటి ద్వారా కావాల్సినన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. రోజూ మాంసం తినేవారు ఈ సీజన్‌లో చేపలను హాయిగా ఆరగించవచ్చు. రెడ్‌మీట్‌, చికెన్‌ల కన్నా ఫిష్‌ ఎంతో చల్లదనాన్ని శరీరానికి పంచుతుంది. ఉసిరి తింటే... వేసవిలో వ్యాయామాలు చేయడానికి కావాల్సిన అదనపు ఎనర్జీని లభిస్తుంది. ఉసిరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మరీ మంచిది. వేసవిలో చర్మం చిట్లకుండా, యాక్నే బారిన పడకుండా నేరేడు కాపాడుతుంది. వ్యాయామానికి ముందుగాని, తర్వాత గాని వీటిని స్నాక్స్‌లాగ తినొచ్చు. రోజూ గ్లాసుడు మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్‌ బాధ ఉండదు. అంతేకాదు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.
 
ఉడకబెట్టిన మొక్కజొన్నను స్నాక్‌గా తినడం వల్ల శరీరంలోని కొలెసా్ట్రల్‌ పరిమాణం తగ్గుతుంది. ఇక మామిడికాయల్లో ప్రొటీన్లు బాగా ఉంటాయి. మామిడికాయను జీలకర్ర, ఉప్పు వేసి ఉడకబెట్టి జ్యూసులా తాగితే వడదెబ్బ తగలదు. సోయాబీన్లు సహజసిద్ధమైన కూలెంట్స్‌. వీటిలో పోషకాలు పుష్కలం. వేసవిలో వచ్చే జలుబును ఇవి నియంత్రిస్తాయి. శరీరంలోని చెడు కొలెసా్ట్రల్‌ పోవడానికి వీటితో పాయసం చేసుకుని తాగేస్తే సరి. సలాడ్స్‌లో కొత్తిమీర, పుదీనా వాడటం మంచిది. టొమాటోలు, మిక్స్‌డు కర్రీలతో చేసిన సూప్స్‌ శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. పెరుగులో బి-విటమిన్‌ ఉంటుంది. ఇది వేసవిలో అల్సర్లు, ఎలర్జీలు, వేడిని నివారించడంలో బాగా పనిచేస్తుంది.