ఎండలోనూ చలాకీగా...

19-03-2019:వేసవిలో చర్మం కందిపోవడం, వడదెబ్బ తగలడం వంటివి సాధారణం. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే శరీరం, మనసూ రెండూ చురుగ్గా ఉంటాయంటున్నారు డాక్టర్‌ చండిల్‌ గుణశేఖర్‌. ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్న సూచనలివి...

వేసవిలో కాచి చల్లార్చిన నీటిని తాగడం, నిల్వచేసిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దాహం తీర్చుకునేందుకు కూల్‌డ్రింక్స్‌, సోడా తాగడం, ఐస్‌క్రీమ్స్‌ ఎక్కువగా తినడం వల్ల గొంతుకు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. పండ్ల రసాలు, పండ్ల ముక్కలు తినడం వల్ల శరీరానికి నీరు అందుతుంది. దాంతో చర్మం తాజాగా ఉంటుంది.
రోజులో నీళ్లు ఎక్కువగా తాగాలి. ఈ సీజన్‌లో కనీసం అరలీటరు నీళ్లు ఎక్కువ తాగాలి. కొబ్బరి నీళ్లు కూడా తప్పనిసరి. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు లోనవదు.
గొంతుపరమైన సమస్యలున్నవారు పండ్ల ముక్కల మీద కొద్దిగా వేడినీళ్లు లేదా ఉప్పునీళ్లు చిలకరించుకొని తింటే మంచిది. ఈ సీజన్‌లో పానీపూరీ తినకపోవడమే మంచిది.వేడి కారణంగా ఒక్కోసారి ముక్కు నుంచి రక్తం కారే అవకాశముంది. ముక్కు మొదట్లో కొద్దిగా వాజిలేన్‌ రాసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. దుమ్మూధూళీ నుంచి రక్షణ పొందేందుకు ముఖానికి పలుచని వస్త్రం చుట్టుకోవాలి.