కలుస్తున్నా.. కలగకపోతే?

1-08-2017:దంపతులిద్దరూ నిండు ఆరోగ్యంతో ఉంటారు. ఇద్దరిలోనూ ఎలాంటి లోపాలూ ఉండవు. అయినా ఏళ్లు గడిచినా వారికి పిల్లలు పుట్టరు. అలాంటప్పుడు ఇక ఈ జన్మలో తల్లితండ్రులమయ్యే భాగ్యం మాకు లేదనుకుని కుంగిపోనవసరం లేదంటున్నారు వైద్యులు. అకారణ వంధ్యత్వమైన ‘ఈడియోపతిక్‌ ఇన్‌ఫెర్టిలిటీ’కి మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటున్నారు. వాటితో పండంటి బిడ్డను కనే వీలుందని భరోసా కూడా ఇస్తున్నారు.

  
పిల్లల కోసం ఎంతకాలం ఆగొచ్చు?
ఎలాంటి గర్భనిరోధక విధానం అవలంబించకుండా సంవత్సరంపాటు కాపురం చేసినా గర్భం దాల్చకపోతే దంపతుల్లో లోపం ఉందని అర్థం. ఇలాంటప్పుడు లోపం ఏ ఒకరిలోనో ఉండొచ్చు. లేదా ఇద్దరికీ ఉండొచ్చు. కాబట్టి ఇద్దరూ వైద్యులను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలతో పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య, వాటి కదలికలు, మార్ఫాలజీల గురించి తెలుస్తుంది. ఒకవేళ వీర్య కణాల సంఖ్య తగినంత లేకపోయినా, వాటి వేగం తక్కువగా ఉన్నా మందులతో సరిదిద్దవచ్చు.
 
వివరణకందని సమస్య!
స్త్రీలలో ‘అండాల విడుదల ఎలా ఉంది? ఫాలోపియన్‌ ట్యూబ్స్‌ క్లియర్‌గా ఉన్నాయా, లేవా? ఎండోమెట్రియాసిస్‌ ఉందా? లేదా? ...అనేవి పరీక్షలతో తెలుసుకుని ఆ సమస్యలను కూడా చికిత్సతో వైద్యులు సరిదిద్దుతారు. ఒక్కోసారి ఈ పరీక్షల్లో కూడా దంపతులిద్దరికీ ఎలాంటి సమస్యా లేదని తేలుతుంది. మరి సమస్య లేనప్పుడు సహజంగానే గర్భం దాల్చాలి. అయినా అలా జరగలేదంటే ఆ దంపతుల విషయంలో వైద్యులు ఓ నిర్ధారణకు వస్తారు. ఆ దంపతుల్లో ఎవరికి వారికి పిల్లల్ని కనే సామర్ధ్యం ఉంటుంది కానీ ఇద్దరూ కలిసి పిల్లల్ని కనలేరు. ఈ కోవకు చెందిన వారు ‘అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌ ఇన్‌ఫెర్టిలిటీ’ కిందకు వస్తారు. వీళ్లిద్దరూ కలిసి ఎందుకు పిల్లల్ని కనలేపోతున్నారు అనే దానికి కచ్చితమైన కారణం ఉండదు. ఇప్పటివరకూ జరిపిన వైద్య పరిశోధనల ద్వారా శుక్ర కణాలలోని ‘డిఎన్‌ఎ డ్యామేజ్‌’ ఓ కారణం అయి ఉండవచ్చని పరిశోధకులు ఓ అంచనాకొచ్చారు.
 
పురుషుల్లోనే ఎక్కువ
పూర్వం పిల్లలు పుట్టకపోతే దానికి స్త్రీలనే బాధ్యులను చేసేవాళ్లు. కానీ వంధత్వానికి కారణం ఇద్దర్లోనూ ఉండొచ్చు. ఒక్కోసారి స్త్రీలలో కాకుండా పురుషుల్లోనే ఆ లోపం ఉండొచ్చు. ప్రస్తుతం పురుషుల వీర్య కణాల్లో లోపాలనేవి సర్వసాధరణమైపోయాయి. ఒక స్ఖలనంలో కనీసం 20 మిలియన్ల వీర్య కణాలుండాలి. వీటిలో సగం వీర్య కణాల మార్ఫాలజీ సహజంగా ఉండాలి. కానీ అలా ఉండట్లేదు. వీర్య కణం ఆకారంలో లోపాలు ఎక్కువవుతున్నాయి. వీర్య కణంలో తల, మధ్యభాగం, తోక ఉంటుంది. ఈ మూడింట్లో ఏ ఒక్కదాన్లో లోపం ఉన్నా పిల్లలు పుట్టడం కష్టం. తల భాగంలో డిఫెక్ట్‌ ఉంటే అండంలోకి చురుగ్గా చొరబడలేదు. మధ్యభాగంలో లోపముంటే అండంలోకి పూర్తిగా చేరుకోలేదు. ఒకవేళ తోకలోనే లోపం ఉంటే అండం దాకా వీర్య కణం ఈదలేదు. ఇలాంటి వీర్య కణాలు 20 మిలియన్లు ఉన్నా ఉపయోగం ఉండదు. అలాగే వీర్య కణం కదలికలు కూడా చురుగ్గా ఉండాలి. ఈ లోపాలన్నిటినీ కొంతమేరకు సరిదిద్దే చికిత్సలున్నాయి. నోటి మాత్రలు, హెల్త్‌ సప్లిమెంట్ల ద్వారా వీర్య కణాల కదలికలు, వాటి సంఖ్యను పెంచవచ్చు.
 
స్త్రీలలోనూ వంధ్యత్వం
వాతావరణ కాలుష్యం, మరీ ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే కార్బన్‌ మోనాక్సైడ్‌ స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్‌ కూడా పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయి. పోషకాహార లోపం, ఒత్తిడి, నిద్రలేమి, అస్తవ్యస్త జీవనశైలి వల్ల అండాల విడుదల ఆలస్యమవటం లేదా నిలిచిపోవటం జరుగుతుంది. అలాగే అండాశయంలో ఫాలికల్‌ రిజర్వ్‌ ఉన్నా అవి తగినంత పరిణతి చెందవు, విడుదల కావు. ఈ సమస్యలన్నిటినీ సరిదిద్దే చికిత్సలున్నాయి.
 
ఇద్దరిలోనూ లోపం లేకున్నా..
కొన్నిసార్లు దంపతులిద్దరిలో ఎలాంటి లోపమూ ఉండదు. పురుషుడిలో వీర్య కణాల సంఖ్య, కదలికలు మెరుగ్గానే ఉంటాయి. అలాగే స్త్రీలలోనూ అండాల విడుదల, రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. ఇలా ఇద్దరికీ పిల్లల్ని కనే సామర్థ్యం ఉన్నా, పిల్లల్ని కొందరు కనలేరు. ఇలాంటి ‘ఈడియోపతిక్‌ ఇన్‌ఫర్టిలిటీ’ కోవకు చెందిన దంపతులు సాధారణ లైంగిక కలయిక ద్వారా పిల్లల్ని కనలేరు. కాబట్టి ఇందుకోసం వైద్యులు కొన్ని ప్రత్యేక వైద్య విధానాలను అనుసరిస్తారు. అవేంటంటే..
అండాశయాన్ని ప్రేరేపించే మందులు, ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌ (ఐయుఐ), ఇంట్రా సర్వికల్‌ ఇన్‌సెమినేషన్‌ (ఐసిఐ), ఇంట్రా ఇన్‌విట్రో ఫర్టిలేషన్‌ (ఐఐఎఫ్‌), ఇక్సీ.... చికిత్సలతో గర్భం దాల్చేలా చేయవచ్చు.
 
ప్రత్యేక వైద్య విధానాలు
ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌: అండంలోకి వీర్య కణాలను నేరుగా గర్భాశయంలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. దాంతో అండం ఫలదీకరణం చెంది, పిండంగా మారుతుంది.
ఇంట్రా సర్వికల్‌ ఇన్‌సెమినేషన్‌: వీర్య కణాలను సర్విక్స్‌ (గర్భాశయ ద్వారం) లోకి ఇంజెక్ట్‌ చేస్తారు.
 
ఇంట్రా ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌: ఒకవేళ ఐయుఐ ఫెయిల్‌ అయితే ఈ పద్ధతి ద్వారా గర్భం దాల్చే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధానంలో అండాన్నీ, వీర్య కణాన్నీ ప్రయోగశాలలో ఫలదీకరింపజేసి గర్భాశయంలో ప్రవేశపెడతారు.
ఇట్సీ: ఇంట్రా సైకోప్లాజమిక్‌ ఇంజెక్షన్‌ అనే ‘ఇక్సీ’లో అండాన్నీ, వీర్య కణాన్నీ ల్యాబ్‌లో ఫలదీకరణం చేయకుండా నేరుగా అండ కణంలోకే వీర్య కణాన్ని ఇంజెక్ట్‌ చేస్తారు. ఇది ఎంతో ఆధునిక ప్రక్రియ. గర్భం దాల్చే అవకాశాలు కూడా ఈ విధానంలో మరింత మెరుగ్గా ఉంటాయి.
 
ఈ చికిత్సా విధానాల వల్ల గర్భం దాల్చే అవకాశాలు మెరుగైనా కూడా వైద్యులు సూచించిన కొన్ని జాగ్రత్తలను పాటించకపోతే ఫలితం ఉండదు. జీవనశైలి మెరుగు పరుచుకోవటం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం, పోషకాహారం తీసుకోవటం, శరీర శుభ్రత పాటించటం, తగినంత నిద్ర పోవడం, దురలవాట్లకు దూరంగా ఉండడం లాంటివి గర్భధారణకు ఎంతో అవసరం.
 
దత్తత ఎప్పుడు?
పైన చెప్పిన పద్ధతులన్నీ అనుసరించినా ఒక్కోసారి గర్భం నిలవకపోవచ్చు. పిండాన్ని శరీరం రిజెక్ట్‌ చేయొచ్చు. అంతమాత్రాన మరోసారి ప్రయత్నం చేయకూడదనేమీ లేదు. ఇయుఐ, ఐఐఎఫ్‌, ఐసిఐ, ఇట్సీ చికిత్సా విధానాలను ఐదేళ్లపాటు ప్రయత్నించవచ్చు. అప్పటికీ గర్భం నిలవకపోతే దత్తత తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు.
 
దత్తత తర్వాత గర్భం
కొంతమంది ఇడియోపతిక్‌ ఇన్‌ఫెర్టిలిటీ కోవకు చెందిన దంపతులు ఐదేళ్లపాటు ఆధునిక చికిత్సలన్నీ ప్రయత్నించి విఫలమై చివరకు పిల్లల్ని దత్తత తీసుకుంటారు. అయితే చిత్రంగా దత్తత తీసుకున్న కొంతకాలానికి ఆ స్త్రీలు గర్భం దాలుస్తారు. ఇలా జరగటానికి కారణం మానసిక ప్రశాంతతే! గర్భం దాల్చలేకపోతున్నామనే మానసిక ఒత్తిడి కూడా గర్భధారణను అడ్డుకుంటుంది. ఇదే ఒత్తిడి ఐయుఐ, ఐవిఎ్‌ఫ...మొదలైన చికిత్సలు తీసుకుంటున్నప్పుడూ కొనసాగి గర్భం దాల్చలేకపోతారు. అయితే ఎప్పుడైతే పిల్లల్ని దత్తత తీసుకుంటారో వారికి పిల్లలు లేని లోటు తీరి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఫలితంగా శరీరంలో గర్భం దాల్చటానికి అనుకూలమైన మార్పులు మొదలై గర్భధారణ జరుగుతుంది.
 
చికిత్స మానసికం, శారీరకం
ఎటువంటి గర్భ నిరోధక సాధనాలూ వాడకుండా దంపతులు లైంగికంగా కలిస్తే చాలు పిల్లలు పుట్టేస్తారని సాధారణంగా అనుకుంటారు. కానీ లైంగిక కలయికతోపాటు మరెన్నో అంశాలు కూడా అనుకూలించాలి. అవేంటంటే...
పోషకాహారం: స్త్రీపురుషులిద్దరూ ఆరోగ్యాన్నందించే పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారం వల్ల స్త్రీలలో అండాల ఉత్పత్తి పెరిగితే, పురుషుల్లో వీర్య కణాల నాణ్యత మెరుగవుతుంది. డ్రై ఫ్రూట్స్‌, ఆకుకూరలు, పళ్లు, ప్రొటీన్లు తీసుకోవాలి. రెడ్‌ మీట్‌ మానేయాలి.
దురలవాట్లు: ధూమపానం, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పొగతాగటం వల్ల పురుషుల వీర్య కణాలలోని డిఎన్‌ఎ దెబ్బ తింటుంది. మద్యం, ఖైనీ, గుట్కాలాంటి వ్యసనాల వల్ల ఈ సమస్య వస్తుంది.
డ్రగ్స్‌: కొకెయిన్‌, హ్యాషిష్‌, వీడ్‌, మారిజువానా వంటి డ్రగ్స్‌ ప్రభావం కూడా వీర్య కణాల మీద ఉంటుంది. 20 ఏళ్ల వయసులో ఇలాంటి అలవాట్లు ఉండి తర్వాత మానేసినా వీర్య కణాలకు జరిగిన నష్టం భర్తీ కాదు.
జీవనశైలి: సమయానికి తిండి, నిద్ర ఎంతో అవసరం.
ఒత్తిడి: మానసిక ఒత్తిడి శరీరం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు కలగరేమోనని దిగులు పడుతూ, పిల్లలు లేని భవిష్యత్తుని ఊహించుకుంటూ మానసికంగా కుంగిపోతుంటే ఆ ప్రభావం వల్ల కూడా గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లుతాయి.
కాలుష్యం: వాతావరణ కాలుష్యం కూడా గర్భధారణ అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుంది. వాయు కాలుష్యం నుంచి తప్పించుకోవటం కోసం ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకోవాలి. కూరగాయలను ఎక్కువ నీటితో కడిగి వండాలి. తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలి.
గర్భం దాల్చినా.. అబార్షన్‌.. ఎంబ్రియో అలర్జీ
ఈమధ్య కాలంలో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ‘ఎంబ్రియో అలర్జీ’. ఈ సమస్య ఉన్నవాళ్ల శరీరం పిండాన్ని రిజెక్ట్‌ చేస్తుంది. దాంతో గర్భం దాల్చినా వాళ్లకు తెలియకుండానే అది అబార్షన్‌ అయిపోతుంది. గర్భం దాల్చినప్పుడు ఆగిపోవలసిన నెలసరి ఆగిపోదు... గర్భం దాల్చినా, శరీరం ఆ పిండాన్ని రిజెక్ట్‌ చేయటంతో గర్భంలో పిండం నాటుకోలేక సాధారణ నెలసరి రూపంలో బయటికి వచ్చేస్తుంది. తమ శరీరంలో ఇలా జరుగుతోందని స్త్రీలు కూడా కనిపెట్టలేరు. ఎంతకాలమైనా పిల్లలు కలగక వైద్యులను సంప్రదించినప్పుడు అక్కడ చేసిన పరీక్షలో అసలు సమస్య తెలుస్తుంది. అయితే ఈ సమస్యను చక్కదిద్దే వైద్య చికిత్సలు కూడా ఉన్నాయి.
30 లోపే మేలు!
స్త్రీల గర్భధారణకు అనువైన వయసు 24 నుంచి 30 ఏళ్లు. 35 ఏళ్ల వరకూ గర్భం దాల్చే వీలున్నా, 30వ సంవత్సరంలో పెళ్లైతే ఆరు నెలలలోపే గర్భం దాల్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ 30 ఏళ్ల వయసులో పెళ్లై 6 నెలలైనా గర్భం దాల్చకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని కలవాలి. అంతకంటే ముందు పెళ్లైతే సాధ్యమైనంత త్వరగా పిల్లల్ని కనే ప్రయత్నం చేయటం మంచిది. చదువు, కెరీర్‌పరంగా గర్భధారణను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయటం వల్ల గర్భం దాల్చే అవకాశాలను చేతులారా నాశనం చేసుకున్న వాళ్లమవుతాం. పూర్వం 35, 40 ఏళ్ల వయసులో కూడా పండంటి బిడ్డను ప్రసవించగలిగేవాళ్లు. కానీ కాలక్రమేణా పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లటం మొదలుపెట్టాయి. 30 దాటిన తర్వాత గర్భం దాల్చగలిగినా పుట్టే పిల్లల్లో అవకరాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ వయసులోగానే పిల్లల్ని కనే ప్రయత్నం చేయటం మేలు. పురుషుల్లో కూడా 35 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత నుంచి వీర్య కణాల నాణ్యత తగ్గుతూ పోతుంది.