ఈ పులిపిరులు ఎందుకు?

21-05-2018: డాక్టర్‌! ఆరు నెలల క్రితం నేనొక వ్యక్తితో శారీరకంగా కలిశాను. అప్పటి నుంచీ నాకు జననాంగాల దగ్గర ఎక్కువగా, మిగతా శరీరం మీద అక్కడక్కడా పులిపిరులు పెరిగాయి. ఈ సమస్య నాకు గత ఆరు నెలలుగా ఉంది. ఇవి క్రమంగా పెరుగుతున్నట్టు కూడా గ్రహించాను. ఈ సమస్య ఎందుకు?

ఒక సోదరి, కర్నూలు.
 
లక్షణాలనుబట్టి మీకు హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ (హెచ్‌.పి.వి) సోకినట్టు అర్ధమవుతోంది. దీన్లో 200 రకాలున్నాయి. వీటిలో 40 రకాల ఇన్‌ఫెక్షన్లు మాత్రమే జననాంగాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఇవి లైంగిక సంబంధాల ద్వారానే సంక్రమిస్తాయి. మీకూ అలానే సంక్రమించి ఉండవచ్చనిపిస్తోంది. జననావయాల మీద పులిపిర్లు ఏర్పడేలా చేసే ఇన్‌ఫెక్షన్‌ కారక వైరస్‌లు అంతగా ప్రమాదకరమైనవి కావు. అయితే మిగతా శరీరం మొత్తం పులిపుర్లు వచ్చేలా చేసే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కేన్సర్‌లకూ దారితీస్తాయి. కాబట్టి మీకొచ్చింది ఏ రకమైన ఇన్‌ఫెక్షన్‌ అనేది ముందుగా తెలుసుకోవాలి. హెచ్‌.పి.వి ఇన్‌ఫెక్షన్లు ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల సంక్రమిస్తుంది. అలాగని ఒక్కరితో కలవడం వల్ల రాదనీ అనుకోలేం! కలిసిన వ్యక్తికి ఈ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే ఒక్కసారి సెక్స్‌లో పాల్గొనా సోకుతుంది. అయితే ఈ ఇన్‌ఫెక్షన్లను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే కేన్సర్‌కు దారితీయకుండా ఒకటి లేదా రెండేళ్లలో తగ్గిపోతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా ఉండాలంటే పాలీ యుథెరీన్‌ కండోమ్‌ వాడాలి. అవి కూడా అన్ని వేళలా సురక్షితం కాకపోవచ్చు. కాబట్టి పెళ్లికి ముందు అపరిచితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడమే మేలు. మీ విషయంలో హెచ్‌.పి.వి ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆలస్యం చేయకుండా వెంటనే సెక్సాలజిస్ట్‌ను సంప్రదించండి.