సెక్స్‌ను ఎంజాయ్ చేయడం చాలా మందికి తెలియదు: సమరం

దెబ్బతీస్తున్న ఉద్యోగ ఒత్తిడి, జీవనశైలి లోపాలు..

30 ఏళ్లకే తగ్గుతున్న లైంగిక పటుత్వం

06-08-2017:మిస్టర్‌ ఎ.. చాకులాంటి కుర్రాడు. పాతికేళ్లకే మంచి ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి కూడా చేసుకున్నాడు. కొత్త జంట ఆర్నెల్లపాటు రోజూ హనీమూన్‌లా గడిపింది. ఇంతలో.. అతడి ప్రతిభకు ఆఫీసులో మంచి గుర్తింపు వచ్చింది. పని కూడా పెరిగింది. అంతకుముందు ఆడుతూపాడుతూ పని చేసేవాడు కాస్తా.. బాధ్యతలు పెరిగేసరికి ఒత్తిడికి గురయ్యాడు. ఆ ప్రభావం పడగ్గదిపైనా పడింది. దీంతో, మానసికంగా మరింత కుంగిపోయాడు. అటు పని ఒత్తిడి.. ఇటు ఎవరికీ చెప్పుకోలేని సమస్య. భార్యకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఉదాహరణ కోసం చెప్పింది కాదు.. నిజంగా జరిగిన ఘటన.

 
మిస్టర్‌ బి.. బీటెక్‌ చదివాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగాడు. 29 ఏళ్లకు తన సహోద్యోగినితోనే పెళ్లయింది. కానీ ఏం లాభం? ఇద్దరివీ ఉన్నత ఉద్యోగాలు. ఊపిరి సలపనంత బిజీ. వారంలో ఒకరోజు మాత్రమే తీరిగ్గా కలుసుకునే అవకాశం దొరికేది. టూర్‌లు వెళ్లాల్సి వస్తే ఫోన్‌లోనో, ఆన్‌లైన్‌లోనో చాటింగ్‌తో సరి. పిల్లలు పుడితే కెరీర్‌ కుంటుపడుతుందనే ఉద్దేశంతో కొన్నాళ్లు ఆగుదాం అనుకున్నారు. అతడికి ఇప్పుడు 35 ఏళ్లు. కొంతకాలంగా పిల్లల కోసం సీరియ్‌సగా ప్రయత్నిస్తున్నారు. తీరా వైద్య పరీక్షలు చేయిస్తే.. అతడిలో వీర్యకణాల లోపం ఉన్నదని తేలింది. ఆఫీసులో పని ఒత్తిడి పేరుతో అదే పనిగా సిగరెట్లు ఊదేసే అలవాటే తన లోపానికి కారణమని అతడికి తెలిసొచ్చింది.

కోరికలేవీ?

ఫాస్ట్‌ఫుడ్స్‌ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, కంప్యూటర్‌ ముందు గంటల తరబడి గడపడం వల్ల యువతలో శృంగారేచ్చ తగ్గుతున్నది. యువకుల్లో వీర్యకణాల లోపం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నది. సంతానం లేని నవదంపతుల సంఖ్య పెరుగిపోతున్నది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆహారపుటలవాట్లు మార్చుకోవాలి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరచుకోవాలి. అప్పుడు ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు.

- డాక్టర్‌ నందకుమార్‌, సీనియర్‌ ఆండ్రాలజిస్ట్‌, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
 
...చిన్న వయసులోనే విపరీతమైన ఒత్తిళ్లు, జీవన శైలి యువతలో లైంగిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఆరంకెల జీతాలతో యువత ఆర్థికంగా పటిష్ఠంగా ఉంటున్నా సంసారం మాత్రం బీటలు వారుతోంది. ఇద్దరూ కష్టపడుతున్నారు. కానీ, వారికి సుఖం కరువవుతోంది. వెరసి, లైంగిక పటుత్వం తగ్గుతున్న వాళ్లు కొందరు అయితే, లైంగిక ఆసక్తి లేనివాళ్లు మరికొందరు. లైంగికాసక్తి ఉన్నప్పటికీ వీర్యకణాలు లోపించినవాళ్లు ఇంకొందరు. నిజానికి, లైంగిక పటుత్వం తగ్గడం వేరు. అసలు లైంగిక కోరికలే తగ్గడం వేరు. రెండోది మరీ ప్రమాదకరం. ఇటీవలి కాలంలో యువతీ యువకుల్లో శృంగారేచ్ఛ గణనీయంగా తగ్గుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని పలువురు సెక్సాలజిస్టులు పేర్కొన్నారు. గతంలో స్తంభన సమస్యతో వచ్చే మగవారి వయసు సగటున 40 ఏళ్లుగా ఉండేదని.. ఇప్పుడు పాతికేళ్ల నుంచి 35 ఏళ్ల లోపువారు కూడా ఆ సమస్యతో తమను సంప్రదిస్తున్నారని తెలిపారు. ఒకవైపు ఆఫీసులో పని.. ఇంటికి వచ్చాక ఇంటి పని రెండింటినీ సమతుల్యం చేయలేక తీవ్ర అలసటకు గురవుతున్న మహిళల్లో కూడా లైంగికాసక్తి తగ్గుతోందని వివరిస్తున్నారు.
 
ఐటీఉద్యోగుల్లో ఎక్కువ
ఐటీ ఉద్యోగాలు దేశ ఆర్థిక ముఖచిత్రంతోపాటు లక్షలాది కుటుంబాల జీవన స్థితిగతుల్నీ మార్చేశాయి. కాసులు కురిపించే ఐటీ ఉద్యోగాలు కొండంత ఒత్తిడిని కూడా భారతీయ యువతపై మోపుతున్నాయి.
 
విపరీతమైన పోటీ, ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి రావడం, భిన్న స్వభావాలున్న క్లయింట్లను మెప్పించాల్సి రావడం, వేళాపాళా లేకుండా పని చేయడం, గంటలు, రోజుల తరబడి ఆఫీసులోనే అతుక్కుపోవడం వంటి సమస్యలు ఈ రంగంలో చాలా ఎక్కువ. ఉద్యోగంలో టార్గెట్లకు తోడు, చిన్న వయసులోనే కొనుక్కొని అందరికీ గర్వంగా చూపించుకున్న ఇంటి ఈఎంఐ కొండలా కూర్చుని ఆందోళనకు గురి చేస్తుంటుంది.
 
మానసిక సమస్యలకు తోడు వ్యాయామం లేకపోవడం, మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు ఉంటే, అటువంటి వారి పరిస్థితి మరీ దుర్భరంగా మారుతోందని సెక్సాలజిస్టులు వివరిస్తున్నారు. ఫలితంగా, ఉద్యోగుల్లో జీవనశైలి జబ్బులు పెరిగిపోతున్నాయని, యువతుల్లో ఊబకాయం, హార్మోన్‌ సమస్యలు, యువకుల్లో వీర్యకణాల లోపం సంతాన లేమి సమస్య పెరగడానికి ప్రధాన కారణాలని చెబుతున్నారు. లాప్‌టా్‌పను గంటల తరబడి ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల ఆ వేడికి వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి.
 
ఇద్దరూ ఉద్యోగులైతే..
సాఫ్ట్‌వేర్‌ కావచ్చు.. మరో రంగం కావచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయితే సైకోటిక్‌ ఇంపోటెన్సీ ఎక్కువగా కనిపిస్తోంది. అలసట, ఒత్తిడి వారి కోరికలను చంపేస్తున్నాయి. ‘వారానికి ఐదు రోజులే ఆఫీసు. రెండు రోజులు ఎంజాయ్‌’ అని వాళ్ల గురించి ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ, ఆ ఐదు రోజులూ ఉదయాన్నే పోయి రాత్రికి రావడం. మిగిలిన రెండు రోజులూ దుస్తులు ఉతుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, షాపింగ్‌లతో బిజీ. వెరసి, ఆ రెండు రోజులూ రాత్రయ్యేసరికి అలిసిపోవడమే. ‘‘ప్రకృతి ఏమంటుంది? పొద్దున తినాలి.
 
రాత్రి పడుకోవాలి. కానీ, మనం రాత్రీపగలు తేడా లేకుండా చేసేశాం. దీనికితోడు, సరైన డైట్‌ కూడా ఉండటం లేదు. దీర్ఘకాలంలో స్పెర్మ్‌ క్వాలిటీ తగ్గడానికి, లైంగిక పటుత్వం కోల్పోవడానికి ఇవి కారణాలు. భార్యాభర్తలిరువురూ ఉద్యోగులైతే ఈ సమస్యలు ఇంకాస్త ఎక్కువ. ఒకే ఇంట్లో ఉన్నా కమ్యూనికేషన్‌ ఉండడం లేదు. లైంగిక వాంఛలకు కమ్యూనికేషన్‌ ముఖ్యం’’ అని జూబ్లీహిల్స్‌లోని అవీస్‌ ఆస్పత్రిలో సెక్సాలజిస్టు డాక్టర్‌ షర్మిలా మజుందార్‌ వివరించారు. ఇక, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం కూడా లైంగిక పటుత్వం తగ్గడానికి కారణాల్లో ఒకటని డాక్టర్లు వివరిస్తున్నారు.
 
ఐటీ రంగం విస్తరించకముందు ఈ లైంగిక పటుత్వం పెద్ద సమస్యగా కనిపించేది కాదని, ఇప్పుడు అది జడలు విప్పి కరాళ నృత్యం చేయడానికి ఇది కూడా కారణమేనని స్పష్టం చేస్తున్నారు. ‘‘పెళ్లయిన రెండో ఏడాది నుంచే సంతానలేమి సమస్యతో ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగడం ఇటీవల పెరిగింది. అసలు సంసారమే చేయకుండా పిల్లలు కావాలనుకుని వస్తుండడం కూడా ఇటీవల పెరిగింది’’ అని మరో డాక్టర్‌ తెలిపారు.
 
మనదేశంలో..
2015లో మన దేశంలో 22 కోట్ల మంది సంతానలేమితో బాధపడుతున్నారు. 2020 నాటికి అది 25 కోట్లకు పెరుగుతుందని అంచనా. మన దేశంలో 2.2 నుంచి 3.3 కోట్ల మంది దంపతులు శాశ్వత సంతాన లేమితో బాధపడుతున్నారు. ప్రపంచంలో మరేదేశంలో లేని విధంగా శాశ్వత సంతానలేమితో బాధపడే దంపతుల సంఖ్య భారతదేశంలో నానాటికీ పెరిగిపోడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతానలేమికి 40 నుంచి 50 శాతం మహిళల్లో ఉన్న లోపాలు కారణం కాగా, 30 నుంచి 40 శాతం మగవారిలో ఉన్న లోపాలు ప్రధాన కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చితే ఇటీవల కాలంలో యువకుల్లో ఈ లోపాలు పెరిగిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
పల్చనవుతున్న వీర్యపుష్టి
ప్రపంచవ్యాప్తంగా యువత ‘నిర్వీర్య’మవుతోంది. గతంతో పోలిస్తే.. యువకుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పునరుత్పాదక శక్తి సన్నగిల్లుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. అమెరిన్‌ సొసైటీ ఆఫ్‌ ఆండ్రాలజీ ఉత్తర అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా ఖండాల్లో యువకుల్లో వీర్యకణాల స్థితిగతులపై పరిశోధనలు జరిపింది. 4 దశాబ్దాల క్రితంతో పోలిస్తే వీర్యకణాల వృద్ధి 52 శాతం తగ్గిందని వెల్లడించింది.
 
ఇది ఆందోళన కలిగించే విషయమని పరిశోధనకు సారథ్యం వహించిన షన్నా స్వాన్‌ తెలిపారు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో కూడా ఈ సమస్య ఉంది. ఇక వీర్యకణాల సాంద్రత తగ్గడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1973లో ఒక మిల్లీలీటరు వీర్యంలో సగటున 99 మిలియన్ల వీర్యకణాలు ఉండేవి. 2011నాటికి అవి 47 మిలియన్లకు పడిపోయాయి. మిల్లీలీటరు వీర్యంలో 40 మిలియన్ల కణాల కంటే తక్కువ ఉంటే సంతానం కలిగే అవకాశాలు తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 15 మిలియన్ల కంటే తక్కువుంటే సంతాన భాగ్యం ఉండదని ఆ సంస్థ తెలిపింది.


ఇలా చేస్తే మేలు..

ఒత్తిళ్లను దూరంగా ఉంచడం
నిత్యం వ్యాయామం
ఆరోగ్యకరమైన ఆహారం
ధూమపానం, మద్యపానానికి గుడ్‌బై
రోజూ సూర్యోదయ వేళలో జీవిత భాగస్వామితో కలిసి కాసేపు వ్యాహ్యాళికి వెళ్లడం..
వ్యాయామం కుదరకపోతే కనీసం లిఫ్ట్‌ వాడకం మానేసి మెట్లు ఎక్కడం.
కుదిరితే ధ్యానం, యోగా వంటివి చేయడం.


స్ట్రెస్‌.. ఏం చేస్తుంది?

యువతలో లైంగిక వాంఛలు తగ్గడానికి, అంగస్తంభనవంటి సమస్యలకు.. ఒత్తిడికి సంబంధమేంటి? ఆఫీసులో పని ఒత్తిడి వీటికి ఎందుకు దారి తీస్తుంది? చూద్దాం..! ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్‌ తగ్గుతూ.. క్రిటికల్‌ స్టేజ్‌కు అంటే ఏ 15 శాతానికో 10 శాతానికో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? స్ర్కీన్‌ బ్రైట్‌నెస్‌ (కాంతి)ని తగ్గించేస్తాం. లొకేషన్‌ ఎనేబుల్‌ చేసి ఉంటే దాన్ని ఆఫ్‌ చేసేస్తాం. అవసరాన్ని బట్టి.. వైఫై, మొబైల్‌ డేటాలనూ ఆపేస్తాం. ఫోన్‌కాల్స్‌ చేసుకునే ఆప్షన్‌ తప్ప మిగతా ఆప్షన్లన్నిటినీ డిజేబుల్‌ చేస్తాం కదూ? శరీరం కూడా అదే పని చేస్తుంది. మనిషి ఒత్తిడికి గురి కాగానే.. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన రక్తసరఫరా, హృదయ స్పందనల వంటివాటిపైనే దృష్టి సారిస్తుంది. జీవక్రియల లెక్కలో శృంగారం లగ్జరీ. నిత్యావసరం కాదు. కాబట్టి.. కార్టిసాల్‌ను భారీగా పెంచేసి టెస్టోస్టీరాన్‌ స్థాయుల్ని తగ్గించి అంగస్తంభనను డి..జే..బు..ల్‌ చేసేస్తుంది!
 
కదలకుండా కూర్చుంటే..
సెక్స్‌ను ఎంజాయ్‌ చేయడం చాలా మందికి తెలియదు. ఉదాహరణకు కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లనే తీసుకుందాం. వారిలో చాలామంది ఒత్తిడిలో ఉంటారు. వారి బుర్రల్లో బాస్‌లు, క్లయింట్లూ తిరుగుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చేవారిలో ఇలాంటివారే ఎక్కువ. అంతేకాదు.. 80 శాతం సాఫ్ట్‌వేర్‌ వారే విడాకులు తీసుకుంటున్నారు. హార్మోన్లు సరిగా పని చేయాలంటే శరీర కదలిక ముఖ్యం. వ్యాయామం లేకుండా ఎక్కువసేపు కూర్చుంటే స్పెర్మ్‌ కౌంట్‌, లైంగిక పటుత్వం తగ్గిపోతాయి. స్ట్రెస్‌ హార్మోన్లు పెరిగితే వీర్య కణాలు తగ్గిపోవడమే కాదు.. హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ కూడా వస్తాయి. మహిళల్లో అయితే పీరియడ్స్‌ సరిగా ఉండవు. పీసీఓడీ, ఒబేసిటీ లాంటి సమస్యలు వస్తాయి. ఒబేసిటీ వస్తే సెక్స్‌ సరిగా చేయలేరు.
- డాక్టర్‌ సమరం