పెళ్ళికి ముందు శృంగారం గురించి డా.సమరాన్ని అడిగితే..

ఆంధ్రజ్యోతి: డాక్టర్‌ సమరం హాస్పిటల్‌ అనగానే కార్పోరేట్‌ స్టయిల్లో ఉంటుందని ఊహించుకుని వెళ్ళినవాళ్ళు ఆశ్చర్యపోవాల్సిందే. ప్రసిద్ధ సైంటిస్టుల ఫొటోలు తప్ప.. ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించరు ఆ హాస్పిటల్‌ గేట్‌ దగ్గర. సెక్సాలజీ అనే పేరు కూడా తెలియని కాలం నుండీ నేటి ఇంటెర్నెట్‌ యుగం దాకా... దాదాపుగా 50 ఏళ్ళుగా.. ఆయన సెక్స్‌ విషయాల్లో తీసుకొస్తున్న చైతన్యం, అవగాహన గురించే తెలుసు కానీ.. మూఢనమ్మకాల మీద ఆయన చేస్తున్న పోరాటం, అసలు సిసలు ప్రజల డాక్టర్‌గా ఆయన అందిస్తున్న వైద్య సేవలు చాలా మందికి తెలీవు. సమరం మాటల్లో ఆయన నేపథ్యం, అభిప్రాయాలు, చేసే కార్యక్రమాల సంగతులు వింటున్నంతసేపూ... ఒక ఉత్సాహం తన్నుకొస్తున్నట్టు ఉంటుంది. గంటన్నరపాటు దేని గురించి అడిగినా.. క్షణం కూడా తడుముకోకుండా మాట్లాడారు.
 
గోరా పేరు గుర్తు చేయగానే, సమరం మొహంలో ఒక ఉద్వేగం తొణికిసలాడుతుంది. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే... ఆయన జీవితంలో గోరా గారు ఎలాంటి ముద్ర వేశారో వివరించి చెప్పక్కర్లేదు. కళ్ళు నేలకి వాల్చి, వేళ్ళు చూసుకుంటూ, నాకు చెప్తున్నారో, తనలో తను తల్చుకుంటూన్నారో అర్థం కాకుండా.. గోరా గారి గురించి మాట్లాడారు.
నాన్న గోరా గారు మన దేశ స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు. సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడుతున్న కాలంలో పుట్టిన నాకు ‘సమరం’ అని పేరు పెట్టారు. మేము తొమ్మిది మందిమి సంతానం. మా అందరివీ కులాంతర, మతాంతర వివాహాలే. మా నాన్నగారి సంతానం, మనవలు, మునిమనవలు కలిపి.. మొత్తం అయిదు తరాల్లో దాదాపు ఎనభై మంది ఉన్నారు. అందరివి ప్రేమ వివాహాలే. నాన్నగారు నాస్తికులు. ఎద్దు, పంది మాంసాలతో విందులు ఇచ్చేవారు. అప్పట్లో ఉన్న అంటరానితనం మీద పోరాటం చేసేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఉద్యమ వాతావరణమే ఉండేది. ఆయన నాస్తికులు. ప్రతీది సైంటిఫిక్‌గా ఆలోచించటం, ప్రశ్నించటం... నాకు చిన్నప్పటి నుండి ఆయన ప్రభావం వల్లే అలవాటయ్యాయి. శాస్త్రీయంగా ఆలోచించే క్రమంలోనే నాకు చిన్నప్పుడే డాక్టర్‌ అవ్వాలని అనిపించింది.
 
జనరల్‌ డాక్టర్‌ అయినప్పటికీ, సెక్సాలజిస్ట్‌గా ఎందుకు మారారు? అని అడిగితే... ఆయన సమాధానం... ఒక పెద్ద నిట్టూర్పుతో మొదలయ్యింది.
అవి 1950, 60ల నాటి విషయాలు. అప్పట్లో సెక్సాలజీ పట్ల అవగాహన ఎవరికీ లేదు, నాకూ లేదు. ఒకసారి గుడివాడ ఏ.ఎన్‌.ఆర్‌ కాలేజిలో చదువుతున్న ఒక కుర్రాడిని అతని లెక్చరర్స్‌ నాన్న దగ్గరకి తీసుకువచ్చారు. అతనికి పెళ్ళికి ముందు హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉండేదట. మొదటి రాత్రి రోజున అతను, భార్య కాళ్ళ మీద పడిపోయి, ‘నన్ను క్షమించు, నాకు హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉంది. నేను పెళ్ళికి పనికిరాను’ అని ఆమెకి చెప్పేసి, రెండెకరాలు పొలం రాసిచ్చి, విడాకులు తీసుకున్నాడట. పైగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఆ కాలేజ్‌ ముందు సైకిల్‌ షాప్‌ పెట్టి పంక్చర్లు వేయటం, గాలి కొట్టడం మొదలుపెడితే... లెక్చరర్లు నాన్న దగ్గరకి అతన్ని తీసుకొచ్చారు. నాన్న అప్పుడు హ్యావెలాక్‌ ఎల్లిస్‌ రాసిన పుస్తకం తీసి, అతనికి చూపించి, తొంభై శాతం మగవాళ్ళు హస్తప్రయోగం చేసుకుంటారనీ, అదేమీ తప్పు కాదనీ వివరించారు. తర్వాత అతనికి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు. అదంతా వేరే సంగతి అనుకోండి. నాకు ఆ సంఘటన అలా గుర్తుండిపోయింది. ఆ తర్వాత నేను మెడిసిన్‌ జాయిన్‌ అయ్యాను.
 
మరో సంఘటన నేను మెడిసిన్‌ ఫైనల్‌ ఇయర్లో ఉండగా జరిగింది. మా ప్రొఫెసర్‌ సత్యనారాయణగారు ఒకసారి క్లాస్‌కి లేట్‌గా వచ్చారు. ‘నేనెందుకు లేట్‌గా వచ్చానో తెలుసా? నా దగ్గరకి ఒక ఐ.ఏ.ఎస్‌. ఆఫీసర్‌ వచ్చాడు. త్వరలో పెళ్ళి కాబోతోందట. రాగానే నా కాళ్ళు పట్టేసుకుని, ... నన్ను మీరే కాపాడాలి, నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది, చాలా వీర్యం పోయింది... అని ఏడ్చేశాడు. ఐ.ఏ.ఎస్‌ చదువుకున్నాడు కానీ, వాడి గురించి వాడేం చదువుకోలేదు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు రేపు చదువు చెప్పాలి’ అన్నారు. జనాలు కనీస విజ్ఞానం లేక జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఇలాంటి విషయాల వల్ల అనిపించింది. జనరల్‌ ఫిజీషియన్‌ అయినప్పటికీ, సెక్సాలజిస్ట్‌గా మారటానికి ఈ రెండు ఘటనలు ఒక రకంగా కారణం.
 
పత్రికల్లో సెక్స్‌కాలం గురించి అడగ్గానే ఆయనకి వచ్చే ఉత్తరాల సంఖ్య తల్చుకుని.. నోటికి చేతులు అడ్డుపెట్టుకుని ‘బాబోయ్‌, బాబోయ్‌’ అంటూ చెప్పారు.
1970 మార్చి 4న నేను ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. మొదట్లో నా స్నేహితులు, పరిచయం ఉన్న కుర్రాళ్ళు అంగం సైజ్‌, స్వప్న స్ఖలనాలు, హస్తప్రయోగం తాలూకు అనుమానాలు అడిగేవారు. అప్పటిదాకా నాకు ప్రజలకి ఇంత అవగాహన లోపం ఉందని కానీ.. ఇవి సీరియస్‌గా చెప్పాల్సిన అంశాలు అని కానీ అనిపించలేదు. నా దగ్గరకి సెక్స్‌ సంబంధించిన అపోహలతో వచ్చేవారి వారి సంఖ్య బాగా పెరిగింది. దానితో 1974 ఫిబ్రవరి, మార్చి ప్రాంతంలో ఒకసారి విజయవాడ ఆలిండియా రేడియోలో.. ‘సెక్స్‌ గురించి కొన్ని అపోహలు’ అని ఒక టాక్‌ షో చేశాను.
 
అప్పుడు రేడియో వారికి ఏకంగా పదివేల ఉత్తరాలు వచ్చాయి. అది ఇప్పటికీ ఒక రికార్డే! ఆ టాక్‌ షోను రామోజీరావు గారు కూడా విన్నారు. అప్పటికే ‘ఈనాడు’ పెట్టాలి అనే ఆలోచనలో ఉండటంతో, తమ పత్రికలో సెక్స్‌ సమస్యల మీద నా ‘కాలమ్‌’ ఉండాలి అని పట్టుబట్టారు. నిజానికి నాకు అవగాహన కొద్దిగా ఉందే తప్ప నేనేం ఈ సబ్జెక్టులో నిష్ణాతుడిని కాదు. ఆయనకి నేను అదే చెప్పాను. ‘లేదండి, ఈ మాత్రం చేప్పేవారు కూడా లేరు. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్‌. మీరు రాయల్సిందే. రీసెర్చ్‌కి ఏది కావాలన్నా నేను ఇస్తాను’ అనటంతో నేను డేర్‌ చేశాను. నా ఆర్టికల్‌కి స్పందన అలా ఉంటుంది అనేది అసలు నేనే ఊహించలేదు. ’ఈనాడు‘ వాళ్ళు పాఠకుల ఉత్తరాలు హైదరాబాద్‌ నుండి విజయవాడకి యూరియా సంచుల్లో పంపించేవారు. నేను అన్నేసి ఉత్తరాలు చదవలేకపోయేవాడిని. వారానికి ఒకసారి అనుకున్న నా ఆర్టికల్‌ వారానికి రెండుసార్లు అయింది. అయినా అదే స్థాయిలో ఉత్తరాలు! ఈనాడులో దాదాపు ఏడేళ్ళు రాశాక, ఆంధ్రజ్యోతిలో రాశాను. మరో అయిదేళ్ళు అయ్యాక, ‘స్వాతి’ పత్రికలో 20 ఏళ్ళు రాశాను. నేను ఏ పత్రికలో రాసినా... నాకు రోజుకి సుమారు 1000 ఉత్తరాలు దాకా వచ్చేవి.
 
తన మీద దుమ్మెత్తి పోసినవాళ్ళని, కరపత్రాలు వేసినవాళ్ళని తలుచుకోగానే.. రిలాక్స్డ్‌గా కుర్చీలో వెనక్కి వాలి నవ్వారు. ఆ నవ్వులో ఒక హుందాతనం, ఒక విజయగర్వం స్పష్టంగా కనిపించాయి.
మతం విషయంలో సనాతనులు ఎలా ఉన్నారో, సెక్స్‌ విషయంలో కూడా సనాతనులు అప్పుడూ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. మన శరీరం గురించి మనకి కచ్చితంగా అవగాహన ఉండాలి. అందుకే సెక్స్‌, కుటుంబ నియంత్రణ, ఎస్‌.టి.డీలు.. వీటి గురించి నేను అవగాహన తరగతులు చెప్పేవాడిని. నేను ఎక్కడకి వెళ్తే అక్కడకి ‘వీళ్లూ’ వచ్చేసేవారు. ‘షార్‌’లో ఒకసారి క్లాస్‌ తీస్కోటానికి వెళ్తే, బయట కాపలా కాసి నన్ను అడ్డుకున్నారు. నా మీద పెద్ద పెద్ద పుస్తకాలు, కరపత్రాలు వేశారు. ‘సమరంకి పిచ్చి ఎక్కింది. నెలసరి రక్తం ఏమీ చెడు రక్తం కాదంటాడా? నెలసరిలో కూడా రతిలో పాల్గొనచ్చు అంటాడా? హస్తప్రయోగం తప్పు కాదంటాడా? ఇతనికి మతిపోయింది’ అని పత్రికల్లో రాసేవారు. బెదిరిస్తూ ఉత్తరాలు రాసేవారు. నా క్లాసుల్ని అడ్డుకునేవారు. అయినాసరే.. నేను కానీ, నన్ను ఆహ్వానించిన వారు కానీ ఏనాడూ ఆగిపోలేదు. ‘ఐ డిడింట్‌ కేర్‌ ఎనిబడీ’. ఈ రోజుకి కూడా నేను కేర్‌ చేయను. చదువుతాను, సైంటిఫిక్‌గా చెబుతాను. కొన్ని వేల క్లాసులు తీసుకున్నాను. లక్షలమందికి ఉత్తరాల ద్వారా విఙ్ఞానం అందిస్తూనే ఉన్నాను. ఇదంతా ఒక ఉద్యమం లాగానే చేశాను.
 
పెళ్ళికి ముందు సెక్స్‌, వివాహేతర సంబంధాల విషయాలు అడిగితే.. సమరం మొహంలో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. ఆ గొంతులో ఏ మాత్రం మొహమాటం ఉండదు. సూటిగా తన అభిప్రాయం చెప్పారు.
ఒకసారి ఒకతను తన భార్యతో నా దగ్గరకి వచ్చాడు. అతను సిఫిలిస్‌ వ్యాధిని భార్యకి కూడా అంటించాడు. అందరూ మామూలుగా చెప్పేటట్టే, నేను కూడా ‘ఏమయ్యా ఇంత చక్కని భార్య ఉంటే, నీకా పాడు బుద్ధి ఏంటయ్యా?’ అన్నాను. అతను వెంటనే ‘డాక్టర్‌ గారూ నేను మీ దగ్గరకి నీతులు చెప్పించుకోటానికి రాలేదు. ట్రీట్‌మెంట్‌ కోసం వచ్చాను’ అన్నాడు. నాకు లాగి లెంపకాయ కొట్టినట్టు అనిపించింది. అతను చెప్పింది నిజం. నేను మళ్ళీ జీవితంలో ఆ తప్పు ఎప్పుడూ చేయలేదు. నైతికత, ఉద్బోధలు చేయటానికి మత బోధకులు, సనాతనులు ఉన్నారు. డాక్టర్‌ పని అది కాదు. ఇక వివాహేతర సంబంధాలు అనుకోండి.. ఉండండి, ఉండకండి అని చెప్పటానికి నేను ఎవర్ని? ఏదన్నా సమస్య వస్తే ట్రీట్‌ చేస్తాను. భార్యాభర్తల బంధం అనేది ఫిజికల్‌, మెంటల్‌ అండ్‌ ఎమోషనల్‌ విషయం. ‘సెక్స్‌ ఈజ్‌ ఎన్‌ ఎమోషన్‌’ అని నమ్ముతా కాబట్టే ఇద్దరి ఇండివిడ్యువల్‌ బంధం మీద నేనేం జడ్జ్‌ చేయలేను. ఇంతమంది సెక్సాలజిస్టులు వచ్చిన తర్వాత కూడా నేను సక్సెస్‌ అవుతున్నానంటే దానికి కారణం... నేను సెక్స్‌ సమస్యలు ఉన్నవారి పట్ల సింపతతీతో ఉంటా తప్పితే, నైతికత జోలికి పోకపోవడమే.
 
మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఫోన్‌ మోగింది. అప్పటిదాకా ఉన్న సీరియస్‌నెస్‌ అంతా మాయమైపోయింది. కొత్త హుషారుతో ‘మా అమ్మయి’ అంటూ ఆ ఫోన్‌ మాట్లాడి, సడన్‌గా సైలెంట్‌ అయిపోయారు. మళ్ళీ ఆయనే మాటలు మొదలుపెట్టారు.
నాకు ఇద్దరు ఆడపిల్లలు. నా కూతుళ్ళకి అయినా నేను ఇదే చెబుతా. నేను వాళ్ళకి చెప్పనిది ఏదీ.. వేరే వాళ్ళకి చెప్పను. నేను కోరుకునే సమాజం ఎలా ఉండాలీ అంటే.. స్త్రీ, పురుషులిద్దరికీ సమానమైన గౌరవం ఉండాలి. వాళ్ళు కావాలి అనుకుంటే కలిసి ఉంటారు, వద్దు అనుకుంటే విడిపోతారు. పిల్లలు ఉంటే... స్టేట్‌ చూసుకుంటుంది. కమ్యూనిస్ట్‌, సోషలిస్ట్‌ సొసైటీలో అలాంటి వ్యవస్థ సాధ్యమే. జర్మనీ, కెనడా లాంటి దేశాల్లో పెళ్ళిళ్ళు చాలా తక్కువ. ఎక్కువమంది సహజీవనం చేస్తున్నారు. స్త్రీ ‘పెళ్ళి’తో పడుంటుంది. పడుండటం కంటే విడిపోవటం నయం. పెళ్ళి అనేది పితృస్వామ్య వ్యవస్థ. అందుకే అసలు పెళ్ళి అనే వ్యవ్వస్థే లేకుండా పోవాలి అనుకుంటాను.
 
ప్రేమించి, పెళ్ళి చేసుకోండి... సగం సమస్యలు ఉండవ్‌!
‘మగవాడు అనగానే ఆడదానితో.. మొదటిసారి అయినా సరే రతి జరపాలి; అమ్మాయి అనగానే.. సిగ్గుపడి, భయపడాలి’ అని నూరిపోసింది మన పితృస్వామ్య సమాజం. ఫలితం.. మగవాళ్ళలో పెర్ఫార్మన్స్‌ యాంగ్జయిటీ, ఆడవాళ్ళలో వాజినైస్మస్‌ (రతి పట్ల భయం). కాస్త ఎడ్యుకేషన్‌, కౌన్సెలింగ్‌, భార్యాభర్తల మధ్య కో ఆపరేషన్‌ ఉంటే ఈ సమస్యల్ని తీర్చవచ్చు. అసలు ఇలాటి భయాలు లేకుండా పొవాలి అంటే.. పిల్లలకు లైంగిక విజ్ఞానం అందించండి. అందరూ కులం, మతం ప్రసక్తి లేకుండా ప్రేమించి, పెళ్ళిళ్ళు చేసుకోండి. సగం పైన సెక్స్‌ సమస్యలు తగ్గిపోతాయి.
 
లైంగిక సంబంధం అనేది నెగ్లిజబుల్‌
స్త్రీకి స్వేచ్ఛ ఉండాలి. సాధికారత ఉండాలి. సాధికారత అంటే ఏంటి? పొదుపు సంఘాలు పెట్టుకోవడం కాదు. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా.. సాధికారత కావాలి. వీటన్నిటి కంటే ముందు.. తన శరీరం మీద తనకి అధికారం కావాలి. అదీ సంపూర్ణ సాధికారత అంటే! నేను అక్కడే సక్సెస్‌ అనేది చూస్తాను. స్త్రీలు లిబరేట్‌ అవ్వాలి. ఒక స్త్రీ.. కట్నాలు తీసుకోవటం, ప్రేమ వివాహాలకి అడ్డుపడటం, ఇతర స్త్రీల స్వేచ్ఛను హరించాలని చూడటం లాంటి పనులు చేసి, మిగిలిన స్త్రీలను అణచకూడదు. ఇలాంటి పనుల వల్లే ‘ఆడదానికి ఆడదే శత్రువు’ అనే పురుష సమాజపు మాట గెలుస్తోంది. నా దృష్టిలో స్త్రీ, పురుషుల లైంగిక సంబంధం అనేది నెగ్లిజబుల్‌. స్త్రీ, పురుషులిద్దరూ హాయిగా జీవించాలి. ప్రేమ బంధం కలిగి ఉండాలి. అదెప్పుడు సాధ్యం అంటే.. ఇద్దరూ సమానమైన స్వేచ్ఛను అనుభవించినప్పుడు! స్త్రీకి సాధికారత ఉన్నప్పుడు!!
 
నాస్తిక కేంద్రం అందరి ఆస్తి!
మేము నడుపుతున్న నాస్తిక కేంద్రానికి ఇప్పుడు నేను ఛైర్మన్‌. దాదాపు ఎనభై ఆరువేల యూనిట్ల రక్తం రక్తదానం ద్వారా సేకరించగలిగాం. ‘స్వేచ్చ ఐ బ్యాంక్‌’ ద్వారా తొమ్మిదివందల మందికి కళ్ళు ఇప్పించగలిగాం. పోలియో కరెక్టివ్‌ సర్జరీలు, హెచ్‌.ఐ.వి. అవగాహన క్యాంపులు ఎన్నో చేశాను. ప్రజల్లో ఉన్న జ్యోతిష్యం, వాస్తు, బాణామతి లాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు నేను కాకుండా ఈ నాస్తిక కేంద్రానికి ఎవ్వరైనా ఛైర్మన్‌ కావొచ్చు. ఇది శాస్త్రీయంగా ఆలోచించేవారి అందరి ఆస్తి.
 
పొద్దున లేచాక క్లినిక్‌కి వస్తాను. ‘డబ్బులు లేక సమరం గారి దగ్గర చూపించుకోలేకపోయాను’ అనే మాట నా హాస్పిటల్లో వినడానికి వీలు లేదు. ఈ రోజుకీ చాలా తక్కువ ఖర్చుకే వైద్యం, ఆపరేషన్లు చేస్తాను. నా జీవితంలో బద్ధకించడం కానీ, టైం వేస్ట్‌ చేయటం కానీ అసలు ఉండవు. సెలవు, అలసిపోవడం అనేవి ఉండవు. ఆదివారం కూడా నాస్తిక కేంద్రం పనులు చూస్తాను. విపరీతంగా పుస్తకాలు చదువుతాను. భగవద్గీత, మహాభారతం, రామాయణం, బైబిల్‌, ఖురాన్‌ సహా... చాలా మతగ్రంథాలు చదివాను. నేను అందరికి చెప్పేది ఒక్కటే.. ఏదైనా సరే సైంటిఫిక్‌గా ఆలోచించండి. సైన్స్‌ మాత్రమే సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇదే నేను నమ్మేది, చెప్పేది.
 
సమాజానికి చిన్న షాక్‌ ట్రీట్మెంట్‌ కోసమే రాశాను. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘క్లినిక్‌’ అనే నవల అప్పట్లో దుమారం లేపింది. ఆ నవలలో ఫ్యాంటసీలు ఊహించుకునే పాత్ర ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఆ పాత్రను చంపొద్దని నాకెన్ని ఉత్తరాలు వచ్చాయో!
 
స్త్రీ పురుషులిద్దరిలోనూ ఉండే పెద్ద సమస్య ఒకటే... స్త్రీలో ఎరౌజల్‌ ఉండటం లేదు అని! ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుండి సెక్స్‌ తప్పు, మగవాళ్ళతో మాట్లాడకు, రజస్వల అయితే ఇక స్వేచ్ఛగా ఉండకూడదు అని బ్రెయిన్‌ వాష్‌ చేసి, చేసి పెంచాక.. స్త్రీలో ఎరౌజల్‌ ఎలా ఉంటుంది? స్పందన లేకుండా అయిపోయారు. ఇప్పటికీ యాభై శాతం స్త్రీలకి ‘కోరిక’ అంటే తెలీదు.
 
మనం చిన్న పిల్లలకి ‘ఇది కాలు’, ఇది తల’ అంటూ శరీరంలోని ఒక్కో భాగాన్నీ పరిచయం చేస్తాం. కానీ మన జననాంగాలని మాత్రం పరిచయం చేయం. ఎందుకు? ప్రతి తల్లి తండ్రి ఈ ప్రశ్న వేసుకోవాలి. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంటే కేవలం పునరుత్పత్తి, రతి కాదు. మన శరీరంలో భాగాల గురించి, వాటిలో జరిగే మార్పుల గురించి చెప్పి తీరాలి.
 
ఇంటర్వ్యూ: చైతన్య పింగళి