ఎనిమిదో నెలలో శ‌ృంగారం.. సరైనదేనా?

డాక్టర్‌! నా భార్య ఎనిమిదో నెల గర్భవతి. ఆమెకి ఇంతకు ముందులాగా సెక్స్‌ మీద ఆసక్తి ఉండట్లేదు. పుట్టింటికి వెళ్తానని అంటోంది. లైంగిక జీవితం మీద ఆసక్తి తగ్గడం వల్లే వెళ్లిపోతానని అంటోందా? అసలు ఈ సమయంలో మేము లైంగికంగా కలవొచ్చా? ముఖ రతి చేయవచ్చా?
- ఓ సోదరుడు, కాకినాడ
 
గర్భంతో ఉన్న మహిళలు కొందరికి బరువు పెరిగిన శరీరం వల్ల అసౌకర్యంగా ఉండి, లైంగిక ఆసక్తి సన్నగిల్లవచ్చు. గర్భం దాల్చడం వల్ల శరీరంలో హెచ్చుతగ్గులకు లోనయ్యే హార్మోన్ల వల్ల కూడా కోరికలు తగ్గవచ్చు. అలాగని అందరికీ ఇలాగే ఉండాలని లేదు. కొందరికి గర్భిణిగా ఉన్న సమయంలో కోరికలు పెరగవచ్చు కూడా! అయితే అంతకుముందు చురుగ్గా ఉండి, ఇప్పుడు ఇష్టపడడం లేదంటే ఆసక్తి తగ్గిందనే భావించాలి. ఇక ఈ సమయంలో సెక్స్‌ గురించి చెప్పాలంటే, ఆమెకు సర్వికల్‌ వీక్‌నెస్‌, లో లైయింగ్‌ ప్లాసెంటా, రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం, పొత్తికడుపులో నొప్పి లాంటి సమస్యలు మునుపు లేకుంటే, తొమ్మిదో నెల వరకూ సెక్స్‌లో పాల్గొనవచ్చు. అయితే ఈ సమస్యలు లేవని వైద్యుల సహాయంతో నిర్ధారణ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా భార్య సెక్స్‌కు సుముఖత చూపుతుందో లేదో తెలుసుకోవాలి. గర్భవతులకు సెక్స్‌ పట్ల ఎన్నో అనుమానాలు, భయాలు ఉంటాయి. తనలో పెరుగుతున్న బిడ్డకు తను చేసే ఏ పని వల్లా ఎలాంటి హాని జరగకూడదని భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల మనసు గ్రహించి మెలగడం ముఖ్యం. ఈ సమయంలో ముఖ రతి చేయవచ్చు. శరీరం సహకరించనప్పుడు ముఖ రతిని ఎంచుకోవడమే మేలు. అయితే ఆ సమయంలో, ఆమె యోనిలోకి గాలి ఊదడం సరి కాదు. ఇలా చేస్తే గాలి బుడగ వల్ల రక్తనాళం మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. ‘ఎయిర్‌ ఎంబాలిజమ్‌’ అనే ఈ సమస్య వల్ల తల్లితోపాటు బిడ్డకూ హాని జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email: mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)