ఊబకాయంతో అడ్డంకి?

22-01-2018 ప్రశ్న:మా వారు పెళ్లయ్యాక బాగా లావయ్యారు. బరువు పెరిగిన తర్వాత లైంగిక వాంఛలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. ఎందుకని అడిగితే...తన రూపం తనకే నచ్చట్లేదనీ, అధిక బరువు కారణంగానే తనకు ఆసక్తి సన్నగిల్లిందని అంటున్నారు. ఎప్పుడూ నిరాశగా, నిరాసక్తంగా కనిపిస్తున్నారు. ఆయన సమస్యకు పరిష్కారం సూచించగలరా?

రమ్య, బోధన్‌
జవాబు: మీవారు ఓ చిత్రమైన చట్రంలో చిక్కుకున్నారు. తన రూపం మీద ఏర్పడిన అనిష్టాన్ని పోగొట్టుకుని, కంఫర్ట్‌గా ఫీలవటం కోసం ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. డిప్రెషన్‌లో ఇదొక కోణం. దీని వల్లే ఆయన బరువు పెరగటం, లైంగికాసక్తి కోల్పోవటం జరిగింది. అయితే ఈ చట్రాన్ని ఛేదించే వీలుంది. ఇందుకోసం రూపం మీద ఆయనకు ఏర్పడిన అనిష్టాన్ని పోగొట్టాలి. దీన్లో మీ వంతు సహాయం అందించాలి. ఇద్దరూ కలిసి వాకింగ్‌కి వెళ్లాలి. లేదా ఈత, జాగింగ్‌, ఆటలు లాంటి శారీరక శ్రమతో కూడుకున్న వ్యాయామాల్లో పాల్గొనాలి. చక్కెర, నూనెలు ఉండే పదార్థాలు కొనటం మానేయాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో ఫ్రిజ్‌ నింపేయాలి. ఎప్పుడు నిరాశగా అనిపించినా ఫోన్‌ లేదా ఈమెయిల్‌ ద్వారా మీతో మాటలు కలపమని ఆయన్ని అడగండి. ఇలా చేయకపోతే ఆయన మళ్లీ తన ఆనందాన్ని ఆహారంలో వెతుక్కుంటారు. ఇక సెక్స్‌ విషయానికొస్తే పెనట్రేటివ్‌ సెక్స్‌కు బదులుగా ఫోర్‌ప్లేతో కూడా మీరు సంతోషంగా ఉండగలరని చెప్పి, ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకుని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కలిగి ఉండటం లైంగిక జీవితంలో అత్యవసరం. ఇలా కొంతకాలంపాటు జీవనశైలిని మార్చుకోగలిగితే క్రమంగా మీవారిలో మార్పొస్తుంది. చలాకీగా, సంతోషంగా ఉంటే కచ్చితంగా తిరిగి ఆయనలో లైంగిక వాంఛలు పెరుగుతాయి. ఒకవేళ అంత చేసినా ఆయన అప్పటికీ డిప్రెషన్‌తో బాధపడుతూ ఉంటే సెక్సాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
డా షర్మిలా మజుందార్‌
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌
అండ్‌ సైకో అనలిస్ట్‌