కాపురం చేయడానికి నువ్వు మనిషివైతేగా..

21-01-2018:‘దిగజారి పోయావ్‌. వేశ్యల దగ్గరికి కూడా వెళ్తున్నావ్‌. ఛీఛీ... నీ గురించి మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది’ ‘అవును వెళ్లాను. ఎందుకెళ్లాను? నీ కారణంగానే వెళ్లాను. కలసి కాపురం చేయడానికి నువ్వో మనిషివైతేగా! నీకు స్పందనల్లేవు. కోరికల్లేవు. భర్తను సంతోషపెట్టాలన్న ఆలోచన లేదు. విడాకులివ్వడానికి మనసు ఒప్పకే, నా పద్ధతిలో నేను శారీరక అవసరాలు తీర్చుకుంటున్నాను. ఇంతకంటే వివరంగా చెప్పాలా?’

- నా ముందే వాదులాడుకుంటున్నారు ఆ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. పెళ్లయి మూడేళ్లు కూడా కాలేదు.

 
ఆమెకు లైంగిక కోరికలు లేవని అతడి ఫిర్యాదు. అతనో సెక్స్‌ మృగమని ఆమె ఆరోపణ. ఏది నిజమో తేల్చుకుందామని నా దగ్గరికి వచ్చారు. నేను మౌనంగా వింటున్నాను. ఆ మాటల్లోని ముఖ్య పదాల్ని విశ్లేషించుకుంటున్నాను.

సాధారణంగా... తీవ్ర అనారోగ్యాలు, హార్మోన్ల అసమతౌల్యం, ఔషధాల ప్రభావం, మాదకద్రవ్యాల బానిసత్వం, శీఘ్రస్ఖలనం తదితర కారణాల వల్ల జీవిత భాగస్వామి పట్ల లైంగిక కోల్పోయే ఆస్కారం ఉంది. కానీ, ఇక్కడ మాత్రం... ఇద్దరి మధ్యా ‘సెక్సువల్‌ కమ్యూనికేషన్‌’ ఘొరంగా దెబ్బతింది. కాపురాలు కూలడానికి ఇదో ప్రధాన కారణం. ఒకరి లైంగిక అవసరాల మీద మరొకరికి బొత్తిగా అవగాహన లేదు. అతడికేం కావాలో ఆమెకు తెలియదు. తనకుతానుగా అడగదు. ఆమె ఏం కోరుకుంటోందో అతడికి తెలియదు. చొరవగా తెలుసుకోడు. దీంతో, ఒకరిపట్ల ఒకరిలో లైంగిక అసంతృప్తి మొదలవుతుంది. ఆ ఎడమొహం, పెడమొహం... పడకగది నుంచి గుండెగదికి విస్తరిస్తుంది. ఆలూమగల బంధానికి.. విశ్వాసం, గౌరవం, ప్రేమ, సాన్నిహిత్యం. - ఈ నాలుగూ నాలుగు స్తంభాలు అయితే, ‘కమ్యూనికేషన్‌’ పునాది. బాగా చదువుకున్న కుటుంబాల్లో కూడా... భార్యాభర్తలు స్వేచ్ఛగా లైంగిక అవసరాల గురించి మాట్లాడుకునే వాతావరణం ఎక్కడుంది? ఆ ఐదు నిమిషాలు కూడా ఏదో తప్పు చేస్తున్నంత తడబాటు. ఎవరో వెనక నుంచి చూస్తున్నంత తత్తరపాటు. మాట లేదు. పలుకులేదు. వెచ్చని స్పర్శలేదు. నఖశిఖ పరామర్శ లేదు.

పళ్లెం నిండా రకరకాల రుచుల్ని వడ్డించుకుని... నమలాల్సిన వాటిని నములుతూ, చప్పరించాల్సినవాటిని చప్పరిస్తూ, నాలుకతో జుర్రుకోవాల్సిన వాటిని జుర్రుకుంటూ, పంటితో పనిపట్టాల్సినవాటిని పని పడుతూ... షడ్రసోపేతమైన భోజనం ముగిస్తాం. తీపి, కారం, పులుపు... ప్రతి రుచితో సంభాషిస్తాం, ప్రతి మెతుకునూ ఆస్వాదిస్తాం. గబగబా నాలుగు ముద్దలు నోట్లో కుక్కేసుకున్నా కడుపునిండుతుంది. తేన్పు వస్తుంది. కానీ, అందులో సంతృప్తి ఉండదు. ఓ భౌతిక అవసరం తీరిపోతుందంతే. పడకటింటి అనుభూతికీ ఈ పోలిక వర్తిస్తుంది.

      సెక్స్‌ గురించి మాట్లాడకూడదు, సెక్స్‌ గురించి ఆలోచించకూడదు, సెక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వకూడదు... బాల్యం నుంచీ కొన్ని భావాల్ని బలవంతంగా మన మీద రుద్దేస్తారు. మనమూ యథాతథంగా ఆమోదించేస్తాం. ఆ వెలితి, వెంటాడుతూ వెంటాడుతూ... ఏదో ఒకరోజు జీవిత భాగస్వామితో మన లైంగిక బంధాల్నీ బలి తీసుకుంటుంది. సెక్స్‌ కూడా సంభాషణ లాంటిదే. మనం పలకరిస్తే, ఎదుటివారూ పలకరిస్తారు. మనం మనసు విప్పితే, ఎదుటివారూ విప్పే ప్రయత్నం చేస్తారు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం. భర్త ముడుచుకుపోతే, భార్య మరింత ముడుచుకుపోతుంది. అతను మదగజంలా రెచ్చిపోతే, ఆమె ఆడపులిలా ఊగిపోతుంది. ఆ సామీప్యంలో ఒకరి ఇష్టాల్ని మరొకరు అర్థం చేసుకుంటారు. ఒకరి అయిష్టాల్ని మరొకరు గ్రహించుకుంటారు. ఇదంతా, ‘సెక్సువల్‌ కమ్యూనికేషన్‌’లో భాగమే.
 
          వర్బల్‌ కమ్యూనికేషన్‌లో.... మాటకున్న విలువ అపారమైంది. ప్రతి పదం పూలగుత్తే. ప్రతి వాక్యం వలపు బాణమే. నాన్‌వర్బల్‌ కమ్యూనికేషన్‌ అంటే... వెచ్చని స్పర్శ, మెత్తని చూపు... వగైరా వగైరా. ఇదంతా ఆ దంపతులకు చెప్పాను. ‘నీకు కాఫీలో చక్కెర తక్కువుంటేనే ఇష్టమని తెలిసినంత మాత్రానో, నీకు ఆవపెట్టిన కూరే నచ్చుతుందని కనిపెట్టినంత మాత్రానో... నీ లైంగిక అభిరుచులు కూడా ఆమెకి పూర్తిగా తెలిసినట్టు కాదు’ - అబ్బాయితో చెబుతుంటే, అమ్మాయి శ్రద్ధగా వింటోంది.
 
          ‘మీకు పవన్‌ కల్యాణ్‌ సినిమా ఫస్ట్‌డే, ఫస్ట్‌షోకు వెళ్లడమంటే ఇష్టమనో, మీకు ముదురు వంకాయరంగు చీరలంటే ప్రాణమనో తెలిసినంత మాత్రాన.... మీ లైంగిక అవసరాలు అతడికి అర్థమై ఉంటాయని భ్రమపడటానికి వీల్లేదు’ - అమ్మాయికి వివరిస్తున్నప్పుడు అబ్బాయి తనకూ చెబుతున్నట్టు తలూపుతున్నాడు.
 
           ఆలూమగల మధ్య లైంగిక విషయాలకు సంబంధించిన అపోహల్నీ అనుమానాల్నీ దూరం చేయడానికి ఓ ప్రత్యేక వైద్య విధానం ఉంది. దాని పేరు సెక్స్‌ కౌన్సెలింగ్‌. ఈ పద్ధతి... లైంగిక సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్నవారినైనా, ఇబ్బంది పెడుతున్నవారినైనా సమానంగానే చూస్తుంది. సమస్యనే అసలు శత్రువుగా పరిగణిస్తుంది.
‘చివరగా ఒక మాట. కిస్‌ - ఫార్ములాను మరచిపోవద్దు...’ వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు ఇద్దరినీ ఉద్దేశించి చెప్పాను.
అబ్బే... నేనేం చుంబనానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కాదు. ఇదో రిలేషన్‌ షిప్‌ సూత్రం. కీప్‌ ఇట్‌ సింపుల్‌ అండ్‌ స్ర్టెయిట్‌ - కిస్‌!
సెక్సువల్‌ కమ్యూనికేషన్‌... ఎంత సూటిగా, ఎంత స్పష్టంగా ఉంటే అంత మంచిది!
డాక్టర్‌ డి.నారాయణరెడ్డి
కన్సల్టెంట్‌, సెక్సువల్‌ మెడిసిన్‌
డేగ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై.
www.degainstitute.com