అడ్డుపడే సమస్యను దూరం చేసేదెలా?

ఆంధ్రజ్యోతి, 10-07-2018: డాక్టర్‌! నాకు పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పి.సి.ఒ) ఉంది. దీని వల్ల లైంగికాసక్తి తగ్గుతుందా? ఈ సమస్యకు శాశ్వత చికిత్స లేదా?

- ఓ సోదరి, హైదరాబాద్‌
 
జవాబు: పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ కారణంగా లైంగికాసక్తి పరోక్షంగా తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే పి.సి.ఓకు చికిత్స చేస్తూనే లైంగికాసక్తిని కూడా సరిదిద్దే చిట్కాలు కొన్నింటిని పాటించాలి. అవేంటంటే....
వ్యాయామం: క్రమం తప్పక వ్యాయామం చేస్తే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ మీద ప్రభావం పడి, ఒంట్లోని కొవ్వు కరుగుతుంది. ఇలా బరువు తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, తద్వారా లైంగికాసక్తీ వృద్ధి చెందుతుంది.
ఒత్తిడి తగ్గించాలి: సాంత్వన పొందే పద్ధతులు పాటిస్తే మానసిక ఒత్తిడి తొలగి, లైంగిక క్రీడ మీద ఆసక్తి మేలుకుంటుంది.
మద్యం తగ్గించాలి: అధిక మద్యపానం లైంగిక వాంఛలను కుంటుపరిచి, సెక్స్‌కు దూరం చేస్తుంది. కాబట్టి మద్యపానం కూడదు.
ధూమపానం: ధూమపానం రక్తనాళాలు, మరీ ముఖ్యంగా జననావయవాల దగ్గరుండే సూక్ష్మ రక్తనాళాలను ఇరుకుగా మారుస్తుంది. ఫలితంగా సమయానికి రక్త ప్రసరణ కరవై లైంగిక క్రీడ క్లిష్టమవుతుంది. లైంగిక స్పందనలూ కలగవు.
సమతులాహారం: పోషకభరిత సమతులాహారం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌... ఈ రెండూ పి.సి.ఒతో లింక్‌ ఉండే లైంగిక సమస్యలను సమర్థంగా తొలగిస్తాయి. కాబట్టి పొట్టు తీయని ధాన్యాలు, పీచు పదార్థం, మొక్కల నుంచి అందే ప్రొటీన్‌లను పుష్కలంగా తీసుకోవాలి.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌
mili77@gmail.com(కన్సల్టేషన్‌ కోసం)