లైంగిక ఆకర్షణ అవసరమా?

 

ఆంధ్రజ్యోతి, 27-03-2018: 

ప్రశ్న: దంపతుల మధ్య అనుబంధం కలకాలం నిలిచి ఉండటానికి, ఆనందకరమైన దాంపత్య జీవితానికి లైంగిక ఆకర్షణ అవసరమా? ఆ ఆకర్షణ కాలంతోపాటు తగ్గటం సహజం. అలాంటప్పుడు దంపతులను కలిపి ఉంచే అంశం ఏది?

జవాబు: లైంగిక క్రీడలో ప్రధాన పాత్ర పోషించే అంశాలు.... దాపరికం లేకుండా మెలగడం, ఒకరి ఉనికిని మరొకరు ఆనందంగా ఆస్వాదించడం. ఇలాంటి మానసిక స్థితిలో లైంగిక క్రీడలో పాల్గొనడం వల్ల ఇద్దరి మధ్యా చక్కని అనుబంధం ఏర్పడుతుంది. సెక్స్‌ అనేది ఒత్తిడిని తొలగించి, సాంత్వన కలిగించాలిగానీ, ఒత్తిడిని పెంచి... ఆందోళన కలిగించకూడదు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే కాలంతోపాటు అన్యోన్యత దెబ్బతిని, అనుబంధం నాణ్యత తరిగిపోతుంది. నిజానికి ఒత్తిడి సమయాల్లో చక్కని సెక్స్‌ ఎంతో సాంత్వన కలిగించి, ఉపశమనాన్ని అందిస్తుందని అన్యోన్యంగా మెలిగే జంటలెంతమందో చెబుతూ ఉంటారు. సెక్స్‌ ఆయుష్షునూ పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.
 
అంతేకాదు... మానసిక ప్రశాంతతను పెంచి, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి తాత్కాలికమైన ఆకర్షణ దశను దాటి, శాశ్వతంగా దంపతులను కలిపి ఉంచే అన్యోన్యత, అనురాగాలను ఏర్పరుచుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. అహాలు పక్కన పెట్టాలి. కలిసి నూరేళ్లూ నడవాలనే విషయాన్ని మనసులో ఇంకించుకోవాలి. ఒకరి ఇష్టానిష్టాలకు మరొకరు విలువనిస్తూ, అభిప్రాయాలను గౌరవిస్తూ మెలిగినంత కాలం లైంగిక ఆకర్షణ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆసక్తి, ఆకర్షణ తగ్గినట్టు అనిపిస్తే, ఇద్దరూ కలిసి విహార యాత్రలకు వెళ్లడం, కలిసి ఏకాంత సమయాన్ని ఆస్వాదించడం చేయాలి.
 
-డా షర్మిలా మజుందార్‌,
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌,
Email :mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)