కుటుంబ నియంత్రణ ఎలా?

 30-04-2018: డాక్టర్‌! నాకు కొత్తగా పెళ్లయింది. అయితే రెండేళ్లపాటు పిల్లలు వద్దనుకుంటున్నాం! ఇందుకోసం సురక్షితమైన కుటుంబ నియంత్రణ పద్ధతిని సూచిస్తారా?

ఒక సోదరి, కొత్తగూడెం
 
మీకు తగిన కుటుంబనియంత్రణ పద్ధతిని ఎంచుకునేందుకు వైద్యులను సంప్రదించి ఈ కింది విషయాలపై స్పష్టతకు రావాలి.
ఎంత వ్యవధిలో మీకు తల్లి కావాలనే ఉద్దేశం ఉంది?
ఒక్కో కుటుంబనియంత్రణ పద్ధతి సామర్ధ్యం ఎంత?
దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా?
మీరెంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటారు?
ఏ పద్ధతి మీ ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది?
ఎంతో సమర్థమైన కుటుంబనియంత్రణ పద్ధతులు కూడా ఒక్కోసారి ఫెయిలవుతూ ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చే అవకాశాలను సమర్థంగా అడ్డుకునే పద్ధతిని ఎంచుకోవాలి.
 
కుటుంబ నియంత్రణ పద్ధతులు
ఫిమేల్‌ అండ్‌ మేల్‌ స్టెరిలైజేషన్‌: సర్జరీ ద్వారా శాశ్వతంగా గర్భం రాకుండా చేయవచ్చు.
లాంగ్‌ యాక్టింగ్‌ రివర్సిబుల్‌ కాంట్రాసెప్టివ్స్‌: ఈ విధానంలో శరీరం లోపల అమర్చే పరికరం ద్వారా 3 నుంచి పదేళ్లపాటు గర్భం రాకుండా నియంత్రించవచ్చు. పిల్లలు కావాలనుకున్నప్పుడు ఆ పరికరాన్ని తీసేయొచ్చు. 
షార్ట్‌ యాక్టింగ్‌ హార్మోనల్‌ మెథడ్స్‌: మాత్రలు, మినీ పిల్స్‌, ప్యాచ్‌, షాట్‌, వెజైనల్‌ రింగ్‌ - వీటి ద్వారా గర్భధారణను అడ్డుకోవచ్చు. షాట్‌ను ప్రతి మూడు నెలలకూ తీసుకోవాలి. మాత్రలు, వెజైనల్‌ రింగ్‌ ప్రతి రోజూ వాడాలి. 
బ్యారియర్‌ మెథడ్స్‌: కండోమ్స్‌, డయాఫ్రమ్‌, స్పాంజ్‌, సర్వికల్‌ క్యాప్‌ - వీటిని లైంగికంగా కలిసే ప్రతిసారీ వాడాలి. 
న్యాచురల్‌ రిథమ్‌ మెథడ్స్‌: ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులూ పాటించకుండా అండాలు విడుదల కాని సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఈ రోజులను కచ్చితంగా గుర్తించడం కోసం ఓవ్యులేషన్‌ హోమ్‌ టెస్ట్‌ కిట్‌ లేదా ఫర్టిలిటీ మానిటర్‌లను ఉపయోగించాలి. అయితే, ఉజ్జాయింపు లెక్కలతో పాటించే ఈ విధానం ఫెయిలయ్యే అవకాశాలూ ఎక్కువే!
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌,
email: mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)