ఆసక్తి ఎందుకు లోపించింది?

28-01-2019: డాక్టర్‌! నా భార్యకు సాధారణ ప్రసవమై రెండు నెలలైంది. ప్రసవం తర్వాత నుంచి ఆమెలో లైంగిక కోరికలు సన్నగిల్లాయి. ఇందుకు కారణం ఏమై ఉంటుంది? ప్రసవం తర్వాత మహిళల్లో లైంగికాసక్తి తగ్గడం సహజమేనా?
- ఓ సోదరుడు, ఖమ్మం.
 
ప్రసవం తర్వాత కొంతకాలంపాటు మహిళల్లో లైంగికాసక్తి తగ్గడం అత్యంత సహజం. ప్రసవం తదనంతరం మహిళల శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. అప్పటిదాకా ఒళ్లు పచ్చిగా ఉండి లైంగిక కోరికలు కలగవు. అలాగే మహిళల్లో గర్భంతో వచ్చిన శరీర మార్పులు కొంత ఆందోళనకు లోను చేస్తాయి. అంతకుముందులా అందంగా లేననే భావన మొదలై, ఆ కారణంగా కొందరు మహిళలు భర్తను దూరంగా ఉంచుతారు. మరికొందరిలో సెక్స్‌లో పాల్గొంటే నొప్పి కలుగుతుందేమోననే భయం ఉంటుంది. మరి కొందరిలో తిరిగి గర్భం దాలుస్తామోననే భయమూ ఉంటుంది. ఈ కారణాల వల్ల కూడా సెక్స్‌కు దూరంగా ఉంటారు. వీటన్నిటికంటే కూడా ప్రసవం తర్వాత మహిళలకు లైంగికాసక్తి తగ్గడానికి ప్రధాన కారణం అలసటే! కొత్తగా చేకూరిన తల్లి బాధ్యతలు, బిడ్డ పెంపకంలో సహాయం లోపించడం, ఒత్తిడి మూలంగా సెక్స్‌ మీదకు మనసు పోదు.
 
అయితే ఈ పరిస్థితి క్రమేపీ సర్దుకుంటుంది. ఆలోగా సెక్స్‌ కోసం ఆమెను ఒత్తిడి చేయకూడదు. ఆమె ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తూ, బిడ్డ పెంపకంలో సహాయపడాలి. శరీరాకృతి పట్ల ఆమెలో నెలకొన్న అనుమానాలు తొలగిపోయేలా, ఆత్మవిశ్వాసం పెరిగేలా అనునయించాలి. పరిస్థితులు అనుకూలంగా మారి, ఒత్తిడి తొలిగితే పూర్వంలా వారిలో లైంగిక కోరికలు పెరుగుతాయి. అయితే సెక్స్‌లో పాల్గొనలేకపోవటం అనేది మీ ప్రధాన ఆందోళనైతే, అవగాహన, అనుమాన నివృత్తి కోసం సెక్సాలజిస్టును కలిసి తగిన సలహాలు పొందవచ్చు.
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌.
mili77@gmail.com
9676762665 (కన్సల్టేషన్‌ కోసం)