ఈ సమస్యకు కారణమేంటి?

28-01-2019:డాక్టర్‌! నా వయసు 30 ఏళ్లు. నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. అంగస్తంభన సమస్య తలెత్తితే వైద్యులను కలిసి, వారానికి ఒకటి చొప్పున టెస్టోస్టీరాన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నాను. సమస్య కొంతవరకూ పరిష్కారమైనా, వీర్యకణాల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు కొత్తగా తలెత్తిన ఈ సమస్యను ఎలా చక్కదిద్దాలి?
- ఓ సోదరుడు, జంగారెడ్డిగూడెం.
 
పిల్లల కోసం ప్రయత్నించే పురుషులు టెస్టోస్టీరాన్‌ ఇంజెక్షన్లు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల వీర్యవృద్ధికి అవసరమైన ఎస్‌.ఎస్‌.హెచ్‌, ఎఫ్‌.ఎస్‌.హెచ్‌ హార్మోన్లు పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదల కావు. ఫలితంగా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. అయితే ఈ హార్మోన్లను ఇంజెక్షన్లు, లేదా మాత్రల ద్వారా తిరిగి సరిచేస్తే పరిస్థితి సర్దుకుంటుంది. ఇందుకోసం అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రతించి అవసరమైన పరీక్షలు చేయించుకుని నిర్ధారించుకోవాలి. అలాగే అంగస్తంభన సమస్యకు అసలు కారణాన్ని కనిపెట్టి, దాన్ని సరిదిద్దాలి. అంతేగానీ, టెస్టోస్టీరాన్‌ ఇంజెక్షన్లను వారానికి ఒకటి చొప్పున విచక్షణారహితంగా వాడడం ఆరోగ్యకరం కాదు. వైద్యులు ఎంతో అవసరమైతేనే నెలకొక ఇంజెక్షను సూచిస్తారు. మీ విషయంలో వీర్యకణాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం క్లిష్టమేమీ కాదు. వైద్యులు సూచించిన హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకుంటే, 6 నెలల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. కాబట్టి పిల్లలు కలగరేమోననే భయం వీడండి.

డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,

ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)