పదేపదే అవే ప్రశ్నలు

కిన్సే నివేదిక ప్రకారం... దాదాపు డెబ్భై అయిదుశాతం మగవారికి అంగప్రవేశం జరిగిన రెండు నిమిషాల్లో స్ఖలనం అయిపోతుంది. మాస్టర్స్‌ అండ్‌ జాన్సన్‌ అధ్యయనం ప్రకారం... సగటు మగవాడు భావప్రాప్తిని పొందడానికి నాలుగు నిమిషాలు పడుతుంది. 

యువ వైద్యుడిగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది మొదలు ఇప్పటిదాకా... కొన్ని వేలమంది రోగులకు చికిత్స చేసి ఉంటాను. మరికొన్ని వేలమంది ఆన్‌లైన్‌లోనో, పత్రికల ప్రశ్నోత్తరాల శీర్షిక ద్వారానో నన్ను సంప్రదించి ఉంటారు. ఇన్నేళ్లలో లైంగిక చికిత్సకు సంబంధించి ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. ఆధునిక పద్ధతులు అమలులోకి వచ్చాయి. ఔషధాలు కూడా మునుపటి కంటే శక్తిమంతం అయ్యాయి. కానీ ఒక్క విషయంలో  ఏమాత్రం మార్పులేదు... అదే, మనిషి అజ్ఞానం! ఇంకా... అవే సందేహాలు జనం బుర్రల్ని తొలిచేస్తున్నాయి. పదేపదే అవే ప్రశ్నలు అడుగుతున్నారు. సామాన్యులనే కాదు, ఉన్నత విద్యావంతుల్లోనూ కనిపిస్తోందీ లైంగిక నిరక్షరాస్యత! తరచూ రోగులు నన్ను అడిగే

కొన్ని ప్రాథమిక ప్రశ్నలు...

నా పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. జీవిత భాగస్వామిని సంతృప్తి పరచలేనేమో అన్న భయం నన్ను వెంటాడుతోంది. టెస్టోస్టెరాన్‌ మాత్రలు వాడితే... అంగం మరింత బలంగా తయారవుతుందని ఇంటర్నెట్‌లో చదివాను. నిజమేనా?

పురుషాంగ పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధమూ లేదు. సెక్స్‌లో భాగస్వామిని సంతృప్తిపరచడం ఒక కళ. ఆ కళలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ఆమె అవసరాల్నీ, భావనల్నీ గ్రహించి, తీర్చగలవాడే అసలైన ప్రేమికుడు. ముందుగా ఆమెను అర్థం చేసుకోండి. ఆ విషయంలో విజయం సాధించారంటే... సెక్స్‌లోనూ విజయం సాధించినట్టే. శరీరంలో టెస్టోస్టెరాన్‌ నిల్వలు తగ్గినప్పుడే... ఆ మాత్రలు తీసుకోవాలి. లేకపోతే, దుష్ఫలితాలు తప్పవు.

నా వయసు నలభై ఏడు. మధుమేహం ఉంది. చాలాకాలంగా అంగస్తంభన సమస్యలు ఎదుర్కొంటున్నాను. శీఘ్రస్ఖలనమూ బాధిస్తోంది. మీరే పరిష్కారం చెప్పాలి. 

ఎండోథీలియం డిస్‌ఫంక్షన్‌... మధుమేహ రోగుల్లో కనిపించే ఓ సమస్య. మధుమేహం కారణంగా... రక్తనాళాల్లోని లోపలి పొరలు దెబ్బతింటాయి. దీంతో రక్తప్రవాహ వేగం మందగిస్తుంది. పురుషాంగానికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బ తిన్నప్పుడు... ఆ వైపుగా రక్త ప్రవాహమూ తగ్గుతుంది. దీంతో, అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. అంతేకానీ, మధుమేహం ఉన్న అందరిలోనూ అంగస్తంభన లోపాలు ఉత్పన్నం కావు. నిపుణుల్ని సంప్రదిస్తే... చికిత్స ద్వారా, సెక్స్‌ థెరపీ ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తారు. 

గంటసేపైనా సెక్స్‌లో పాల్గొంటామని నా స్నేహితులు గర్వంగా చెబుతున్నారు. నాకేమో నిమిషాల్లోనే అంతా అయిపోతుంది. ఎంతసేపు పాల్గొంటే పడకగదిలో సక్సెస్‌ అయినట్టు?

ఆ సమయం మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒకే మనిషి లైంగిక సామర్థ్యం ఒక సమయంలో ఒకలా, మరో సమయంలో ఇంకోలా ఉండవచ్చు. కాబట్టి, మరొకరితో పోల్చుకుని చిన్నబుచ్చుకోవాల్సిన పన్లేదు. మీకు తృప్తిగా అనిపిస్తోందా, మీ జీవిత భాగస్వామిని సంతృప్తి పరుస్తున్నారా అన్నదే ముఖ్యం. గణాంకాల విషయానికొస్తే కిన్సే నివేదిక ప్రకారం... దాదాపు డెబ్భై అయిదుశాతం మగవారికి అంగప్రవేశం జరిగిన రెండు నిమిషాల్లో స్ఖలనం అయిపోతుంది. మాస్టర్స్‌ అండ్‌ జాన్సన్‌ అధ్యయనం ప్రకారం... సగటు మగవాడు భావప్రాప్తిని పొందడానికి నాలుగు నిమిషాలు పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... భాగస్వామిని సంతోషపెట్టడానికి ముందే మెత్తబడిపోతే దాన్ని శీఘ్రస్ఖలనంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి, నివేదికలతోనో, స్నేహితులతోనో పోల్చుకుని తికమకపడటం కంటే... మీ జీవితభాగస్వామి సంతృప్తిని కొలమానంగా నిర్ణయించుకోవడం ఉత్తమం. ఆ ప్రయత్నంలో వైఫల్యాలు ఉంటే ఆమె సహకారం తీసుకోండి. అవసరమైతే నిపుణులనూ సంప్రదించండి. 

నేను వారానికి రెండుసార్లే సెక్స్‌లో పాల్గొంటాను. లైంగిక ఆసక్తి సన్నగిల్లుతోందేమో అన్న భయం కలుగుతోంది. అంగస్తంభన సమస్య కూడా ఉన్నట్టు అనుమానం. తగిన సలహా ఇవ్వండి.

మీరు వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారంటే... లైంగిక ఆసక్తి ఉన్నట్టే. అంగస్తంభనా సరిగా ఉన్నట్టే. ఆ ప్రకారంగా మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు.  లేనిపోని భయాల్ని సృష్టించు కుంటున్నారు. ఆ వలయం లోంచి బయటికి రండి.

 

లైంగిక వ్యవస్థ అనేది శరీర వ్యవస్థలో ఓ భాగం. మన అలవాట్లు, అభిరుచులు, జీవనశైలి... లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యంలో ఎక్కడ ఏ కాస్త తేడా వచ్చినా ఆ దెబ్బ సెక్స్‌ సామర్థ్యం మీదా పడుతుంది. ఈ చిన్న విషయాన్ని చాలామంది అర్థం చేసుకోరు. ఆ అజ్ఞానంలోంచే అనేక అపోహలు పుట్టుకొస్తాయి. అందులో చాలావరకూ ప్రశ్నల రూపంలో నా ముందుకు వస్తుంటాయి.

నా భార్యకు నేనంటే చులకన. సెక్స్‌ కోసం తప్పించి, జీవిత భాగస్వామిగా తనను ప్రేమించడం లేదని ఆరోపిస్తోంది. నిజానికి నాకు అలాంటి ఆలోచనే లేదు. తనకెలా సర్దిచెప్పాలి?

శరీరంలోని టెస్టోస్టెరాన్‌ హార్మోను స్ర్తీపురుషుల్లో లైంగికత్వాన్ని నిర్ణయిస్తుంది. టెస్టోస్టెరాన్‌ పురుషపక్షపాతి. మగవారిలో ఆ హార్మోన్‌ ప్రవాహం పది నుంచి ఇరవై రెట్లు అధికం. ఆ అసమతౌల్యం కారణంగా జీవిత భాగస్వాముల మధ్య అపోహలు ఏర్పడతాయి. బంధాలకు బీటలు పడతాయి. సహజంగానే ఆమెది సున్నితమైన మనసు. అతను లైంగిక ఆకాంక్షను వ్యక్తం చేసే పద్ధతి మొరటుగా ఉన్నప్పుడు మనసు కాస్త నొచ్చుకుంటుంది. అందుకే మగవాడు తన కోరికను సున్నితంగా, రొమాంటిక్‌గా వ్యక్తం చేయాలి. సెక్స్‌ అనేది అవసరంలోంచి పుట్టుకురాకూడదు, ప్రేమలోంచి ఉప్పొంగాలి. మాటలతో, చేతలతో ఆమెలో కోరికలు పురివిప్పేలా చేయాలి. అదే సమ యంలో... ఆమె మూడ్‌నూ అర్థం చేసుకోవాలి.

నా వయసు ఇరవై ఎనిమిది. ఇటీవలే నాకు అబార్షన్‌ జరిగింది. అప్పటి నుంచీ  లైంగికంగా సంతృప్తిని పొందలేక పోతు న్నాను. ఎందుకిలా? దీనికి చికిత్స ఉందా? ఇలా చొరవ తీసుకోవడం సరైన పనేనా?

అబార్షన్‌ సమయంలో వజీనా దెబ్బ తినడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. మంచి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. మీ సమస్యకు తప్పక పరిష్కారం దొరుకు తుంది. సెక్స్‌ అనేది... ఓ ప్రేమ వ్యక్తీకరణ మార్గం. ఆ లోపాన్ని సరిచేసుకోవడంలో తప్పులేదు. లైంగికత విషయంలో సిగ్గూ బిడియం ప్రదర్శించే జీవి... సృష్టిలో మనిషి ఒక్కడే. మీ చొరవకు అభినందనలు.

నా వయసు యాభై. ఈమధ్య లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. మిత్రుల్ని సలహా అడిగితే... ఈ వయసులో అదంతా సహజమేనని అంటున్నారు. ఇక ఆశలు వదులుకోమని చెబుతున్నారు. నాలో మాత్రం కోరికలింకా చచ్చిపోలేదు.

లైంగిక సామర్థ్యం అనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. గుండె, రక్తం, గ్రంథులు, మెదడు... ఇలా అన్ని వ్యవస్థల సమన్వయంతో విడుదలయ్యే హార్మోన్లు లైంగికతను శక్తిమంతం చేస్తాయి. కోరికల్ని పుట్టిస్తాయి, అంగస్తంభన కలిగిస్తాయి, భావప్రాప్తిని ప్రసాదిస్తాయి. ఒకసారి సెక్స్‌లో పాల్గొంటే పదిహేను నిమిషాలు ట్రెడ్‌మిల్‌ మీద వ్యాయామం చేసినట్టే. మెదడు లాగానే లైంగిక వ్యవస్థ కూడా ఉపయోగించినకొద్దీ రాటుదేలుతుంది. వద్దనుకుంటే మొద్దుబారిపోతుంది. కాబట్టి, వయసుతో పోల్చుకుని వెనకడుగు వేయకండి. ఏవైనా సమస్యలుంటే... నిపుణుల్ని సంప్రదించండి. ఆధునిక వైద్యంలో లైంగిక లోపాలకు చక్కని చికిత్స ఉంది. మిడిమిడి జ్ఞానంతో మిత్రులిచ్చే సలహాల్ని పట్టించుకోకండి.

నాకు సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది. రాత్రి పడక మీదికి వెళ్లేముందు కూడా సిగరెట్‌ ముట్టిస్తాను. మా ఆవిడకు పొగ అంటేనే అసహ్యం. నేనేమో దమ్ము లాగకపోతే సెక్స్‌ చేయలేను. మీరే ఓ పరిష్కారం సూచించాలి.

సెక్స్‌, సిగరెట్‌... తూర్పుపడమర లాంటివి. ఈ రెండింటిలో ఏది కావాలో నిర్ణయించుకోండి. రెండూ పొందడం అసాఽధ్యం. ఎందుకంటే, సిగరెట్‌ లైంగిక వ్యవస్థ మీద చెడు ప్రభావం చూపుతుంది. నికోటిన్‌ రక్తప్రవాహ వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుంది. అంగస్తంభన జరగాలంటే... రక్తం అంగంవైపు ప్రవహించాలి. సిగరెట్‌ ఆ వేగానికి అడ్డుకట్టవేస్తుంది. గుండె పనితీరు ప్రమాదంలో ఉందనడానికి కూడా అంగస్తంభన సమస్యే ఓ సంకేతం. భర్త పొగతాగడం వల్ల... పరోక్షంగా భార్య కూడా తాగినట్టే. ధూమపాన పర్యవసానాల్ని ఆమె కూడా అనుభవించాల్సిందే. దీంతో తన లైంగిక ఆరోగ్యమూ ప్రమాదంలో పడుతుంది. రక్తప్రవాహ వేగం మందగించడంతో భావప్రాప్తి సమస్యలు వస్తాయి. యోనిలో లూబ్రికేషన్‌ తగ్గిపోతోంది. సెక్స్‌ బాధాకరం అవుతుంది. ఆ దుర్వాసన సెక్స్‌ పట్ల తనలో ఓరకమైన విముఖతను కలిగిస్తుంది. కాబట్టి, నికోటిన్‌ రాకాసిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. సిగరెట్‌ వెలిగించడం హీరోయిజం కాదు, మనకు మనమే దహన సంస్కారాలు నిర్వహించుకోవడం.  

 

...రానున్న వారాల్లో మరికొన్ని ప్రశ్నల్ని ప్రస్తావించుకుందాం.