ప్లాస్టిక్‌తో ప్రమాదమా?

08-04-2019: డాక్టర్‌! నేను గత నాలుగేళ్లుగా ప్లాస్టిక్‌ పరిశ్రమలో పని చేస్తున్నాను. పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. అయినా పిల్లలు కలగలేదు. వైద్యులను కలిస్తే టెసోస్ట్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి జరగడం లేదనీ, ఇది జన్యుపరమైన సమస్య అనీ, అందువల్లే పిల్లలు కలగడం లేదనీ అన్నారు. ఇందుకు ప్లాస్టిక్‌ పరిశ్రమలో పని చేయడమే కారణమా?

- ఓ సోదరుడు, హైదరాబాద్‌.
 
 
రసాయనాలు, ప్లాస్టిక్‌, మందులు, బీడీ పరిశ్రమల్లో పని చేసే వారు కొన్ని విషపూరిత రసాయనాల ప్రభావానికి గురవుతూ ఉంటారు. బిస్ఫినాల్‌, పారాబెన్‌ మొదలైన ప్రమాదకర రసాయనాలు క్రమేపీ శరీరంలోకి చేరుకుని అంతర్గత హార్మోన్‌ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. ఫలితంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో పిల్లలు కలగరు. మహిళల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయి పెరిగిపోయి అపరిపక్వ అండాలు విడుదలవుతూ ఉంటాయి. మీ విషయంలో పిల్లలు కలగకపోవడానికి ప్లాస్టిక్‌ పరిశ్రమలో పని చేయడమే కారణం కావచ్చు. ప్లాస్టిక్‌ తయారీలో బిస్ఫినాల్‌ అనే రసాయనం వాడతారు. దీనికి దగ్గరగా పని చేసినా, వాయువులు పీల్చినా ఆ ప్రభావం, మూడు తరాల వరకూ కొనసాగుతుంది. కాబట్టి ఈ పరిశ్రమల్లో పని చేసే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్‌ వస్తువుల వాడకం కూడా ప్రమాదమే! చవక రకం ప్లాస్టిక్‌ గ్లాసులు, కప్పులు, కవర్లు అన్నిట్లో ఈ రసాయనం ఉంటుంది. వీటిలో వేడి పదార్థాలు నింపడం ద్వారా ఆ రసాయనం కరిగి వాటిలోకి చేరుతుంది. కాబట్టి కర్రీ పాయింట్లలో ప్లాస్టిక్‌ కవర్లలో కూరలు కట్టించుకోవడం, వేడి టీ కవర్లలో నింపించుకోవడం లాంటివి కూడా చేయకూడదు. మీ విషయంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని పెంచే వీలుందేమో గమనించాలి. యాంటీ ఆక్సిడెంట్లతో పరిస్థితిని కొంతమేరకు సరిదిద్దే వీలుంది.
 
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)