నేను పెళ్లి చేసుకోవచ్చా?

25-12-2018: డాక్టర్‌! నా వయసు 24 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. అయితే నాకు తరచుగా శీఘ్రస్ఖలన సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యకు మందులు వాడినప్పుడు ఫలితం కనిపించినా, మందులు ఆపిన వెంటనే తిరగబెడుతోంది. ఈ పరిస్థితిలో పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది. నన్ను ఏం చేయమంటారు?
(ఓ సోదరుడు, నిడదవోలు)
 
శీఘ్ర స్ఖలన సమస్యకు ప్రధానంగా 3 కారణాలుంటాయి. హార్మోన్‌ సమస్య, ఇన్‌ఫెక్షన్లు, మానసికమైన కారణాలు శీఘ్రస్ఖలనానికి దారి తీస్తాయి. మందులు వాడినప్పుడు సమస్య తొలగిపోయింది అన్నారు కాబట్టి మీది తీవ్రమైన సమస్య అయు ఉండకపోవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా సమస్య తలెత్తే అవకాశాలనూ కొట్టి పారేయలేం. అయితే ఈ సమస్యకు చికిత్స పెళ్లికాని వారికంటే పెళ్లయిన వారికే తేలిక. పెళ్లయిన వ్యక్తులకైతే తరచుగా సెక్స్‌లో పాల్గొనే వీలుంటుంది. కాబట్టి మందులు వాడి, ఫలితాన్ని కనిపెట్టవచ్చు. కానీ మీ విషయంలో అలా కాదు. ఎంతో అరుదుగా మాత్రమే సెక్స్‌లో పాల్గొనే వీలుంటుంది కాబట్టి, ఎక్సయిమెంట్‌ కారణంగా శీఘ్ర స్ఖలనం జరుగుతూ కూడా ఉండవచ్చు. ఇలాంటి మానసిక కారణాన్ని కూడా మందులతో, కౌన్సెలింగ్‌తో సరిదిద్దవచ్చు. అయితే మీ విషయంలో మందులు వాడినప్పుడు సమస్య తొలగిపోయింది అన్నారు కాబట్టి బహుశా మీది మానసిక సమస్య కావచ్చు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోండి. కావాలంటే పెళ్లికి ముందు వైద్యులను కలిసి ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు లేవని నిర్ధారించుకోండి.
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,  ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)