ఇష్టం లేదంటోంది..!

27-02-2019:నా పెళ్లయి రెండున్నరేళ్లు అయ్యింది. నా భార్యకు నేను మీద చేయి వేస్తే చిరాకు. ప్రేమగా ఉండదు. ఏం చెప్పినా అరుస్తుంది. సరదాగా ఉందాం అంటే ‘అలా సినిమాల్లో ఉంటారు... బయట ఉండరు’ అంటుంది. పెళ్లి జరిగి ఇన్నాళ్లయినా ముద్దూ ముచ్చట లేదు. అదేమిటని అడిగితే ‘నాకు ఇష్టం ఉండవు ఆ పనులు’ అంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా వినకుండా గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. ఎన్ని రోజులైనా కనీసం ఫోన్‌ చెయ్యదు. వాళ్ల అమ్మవాళ్లు ఫోన్‌ చేసి ‘అమ్మాయి వచ్చింది... ఏదన్నా గొడవా?’ అని కూడా అడగరు. ఇలా నాలుగైదుసార్లు అయ్యింది. ఒకసారి సినిమాకి తీసుకువెళతాను అంటే వాళ్ల అమ్మవాళ్ల ఇంటికి వెళ్లి తర్వాత ఎప్పుడో సాయంత్రం వచ్చింది. నేను వద్దన్నా వెళ్లి రెండు రోజులదాకా రాదు. వచ్చాక దాని గురించి అడిగితే మళ్లీ వెళ్లింది కానీ ఇప్పటిదాకా రాలేదు. తాను గానీ వాళ్ల అమ్మవాళ్లు గానీ ఫోన్‌ చేయలేదు. నన్ను ఏం చేయమంటారు? -పవన్‌
 

చాలామంది అమ్మాయిలకు ఇటువంటి సమస్య ఉంటుంది. తల్లిదండ్రులతో చెప్పలేక పెళ్లి చేసుకుని వచ్చిన భర్తను బాధ పెడుతుంటారు. రెండున్నరేళ్లుగా భరిస్తున్నారంటే మీకు ఓపిక ఎక్కువే. అయితే ఇన్నాళ్లుగా ఎందుకు వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడలేదు? సమస్య ఇదీ అని చెప్తే వాళ్లన్నా స్పందించేవారేమో. పోనీ మీరన్నా ఆమెని వైద్య నిపుణులు లేదా కుటుంబ సలహా నిపుణులకు చూపిస్తే ఏదో ఒక పరిష్కారం దొరికేది. ఇటువంటి సమస్యలకు వైద్యరంగంలో చికిత్స ఉంది. ఆలస్యం చేయకుండా మీ అత్తమామల సాయం, సలహా తీసుకుని నిపుణులను సంప్రదించండి. అందుకు మీ భార్య సిద్ధపడకపోతే చట్టపరంగా విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకునే అవకాశం ఎలాగూ ఉంది.


కె.శోభ
ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌