అతడితో కాపురం ఎలా?

26-11-2018: నేను డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. చాలాకాలంగా మా ఇంటిపక్కనే ఉంటున్నవారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వాళ్లు తమ దగ్గరి బంధువుల్లో ఒక అబ్బాయి ఉన్నాడనీ, వాళ్లు బాగా ఆస్తిపరులని పెళ్లి సంబంధం తీసుకువచ్చారు. పెళ్లి చూపుల రోజున ఆ అబ్బాయినైతే చూశాను గానీ, ఏమీ మాట్లాడలేదు. రెండు మాసాల క్రితం నా పెళ్లయ్యింది. ఫస్ట్‌ నైట్‌ రోజున అతని అసలు రూపాన్ని తనే బయటపెట్టుకున్నాడు. ‘‘నాకు పురుషత్వం లేదు. ఆ విషయం బయటి సమాజానికి తెలిస్తే, అవమానిస్తారని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నీ లైంగిక జీవితాన్ని ఎవరితో పంచుకున్నా నాకు అభ్యంతరం లేదు. పిల్లల్ని కన్నా అడ్డు చెప్పను. కానీ నాకు విడాకులు మాత్రం ఇవ్వొద్దు’’ అంటూ ఆ రోజు రాత్రి చె ప్పేశాడు. అతడి మాటలు విని నేను అవాక్కయ్యాను. ఏమనాలో అర్థం కాక మౌనం వహించాను. మరుసటి రోజే మా నానమ్మకు ఆరోగ్యం బాగోలేదంటూ హఠాత్తుగా హైదరాబాద్‌కు వచ్చేశాను. విడాకులు తీసుకోవాలనుకుంటున్నా. ఆ ప్రొసీజర్‌ ఏమిటో చెప్పండి.
 - శ్రీలక్ష్మి, హైదరాబాద్‌
 
 
నిజాల్ని దాచిపెట్టి మోసపూరితంగా పెళ్లి చేసుకునే వాటిని ‘చెల్లకూడని వివాహాలు (వాయిడబుల్‌ మ్యారేజెస్‌)’ అంటారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో విడాకుల కోసం ఎక్కువ కాలం ఆగాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు ఇరువురూ సంయుక్తంగా సిద్ధమైన కేసుల్లో కూడా విడాకుల కోసం కనీసం 6 మాసాల దాకా ఆగాల్సి ఉంటుంది. అయితే నపుంసకత్వం వంటి కారణాలు ఉన్నప్పుడు మరుసటి రోజే విడాకుల కోసం వెళ్లే వెసులుబాటును చట్టం కల్పించింది. మీరు మీ జిల్లా ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహ చట్టంలోని 12వ సెక్షన్‌ ఆధారంగా విడాకుల కోసం కేసు వేయవచ్చు. తన నపుంసకత్వాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం అతడు చేసినట్లయితే, అతని లోపాన్ని వైద్య పరీక్ష లతో రుజువు చేయాల్సి ఉండేది. మీ విషయంలో అతడే స్వయంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ అవసరం లేదు. ఒకవేళ అతడు మాట మార్చి నాటకీయంగా వ్యవహరిస్తే అప్పుడు వైద్య పరీక్షలే మార్గమవుతాయి.
 
‘వాయిడబుల్‌ మ్యారేజెస్‌’ వివాహాల జాబితాలో నపుంసకత్వంతో పాటు, వైద్య చికి త్సలతో నయమయ్యే అవకాశమే లేని వ్యాధులన్నీ వస్తాయి. ఇలాంటి కేసుల్లో విడాకులు తీసుకోవడంతో పాటు, పెళ్లి సమయంలో ఇచ్చిన కానుకలు, లాంచనాలన్నీ తిరిగి తీసుకోవచ్చు. నష్టపరిహారం కూడా పొందవచ్చు. దీనికి తోడు చేసిన ద్రోహానికి చీటింగ్‌ కేసు వేస్తే అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడుతుంది.
 
 
 
- టి. ఎల్‌. నయన్‌కుమార్‌,
న్యాయవాది, హైదరాబాద్