పెదవుల మీద పుండ్లు ఎందుకు

19-11-2018: డాక్టర్‌! గత కొన్ని రోజులుగా నా పెదవుల మీద పుండ్లు ఏర్పడి, పైపూత మందులు వాడుతున్నా తగ్గడం లేదు. నాలుగు నెలల క్రితం సురక్షిత పద్ధతులు పాటించకుండా అపరిచిత వ్యక్తితో లైంగికంగా కలిశాను. ఈ పుండ్లు ఏదైనా సుఖ వ్యాధికి సూచనలా?
- ఓ సోదరి, మిర్యాలగూడ
 
పెదవుల మీద పుండ్లు హెర్పిస్‌ వ్యాధి లక్షణం. హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ సోకితే పెదవులు, ముఖం, ఛాతీ, వేళ్ల మీద పుండ్లు ఏర్పడతాయి. అలాగే జననావయవాల చుట్టూ నీటి బొబ్బలు కూడా తలెత్తుతాయి. ఈ వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే కళ్లు, మెదడు ఇన్‌ఫెక్షన్లకు లోనవుతాయి. హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌లలో రకాలు కూడా ఉన్నాయి. హెర్పిస్‌ సింప్లెక్స్‌ 1 అనే వైరస్‌ సోకితే, లక్షణాలు నడుము పై భాగంలో కనిపిస్తాయి. ఈ వైరస్‌ లైంగికంగా కలవకపోయినా, ముద్దులు పెట్టుకోవడం, వస్తువులను షేర్‌ కోసుకోవడం వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. హెర్పిస్‌ సింప్లెక్స్‌ 2 అనే వైరస్‌ లక్షణాలు నడుము కింది భాగంలో బయల్పడతాయి.
 
ఈ వైరస్‌ లైంగిక కలయిక ద్వారానే సంక్రమిస్తుంది. కాబట్టి హెర్పిస్‌ ఉన్న వ్యక్తితో ఏ రకంగా సన్నిహితంగా మెలిగినా ఏదో ఒక హెర్పిస్‌ రకం వైరస్‌ కచ్చితంగా సోకుతుంది. హెర్పిస్‌ వ్యాధిని యాంటీవైరస్‌ మందులతో తగ్గించవచ్చు. కానీ ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం సాధ్యం కాదు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రతించి వ్యాధి మరింత ముదిరిపోకుండా నియంత్రించుకోండి.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌.
mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)