లైంగిక అనాసక్తి ఎందుకు?

19-06-2018: డాక్టర్‌! నా వయసు 35, మా ఆవిడ వయస్సు 29. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మాకు ఐదేళ్ల కొడుకున్నాడు. మాది ఉమ్మడి కుటుంబం. నాకేమో వారానికోసారైనా సెక్స్‌లో పాల్గొనాలని ఉంటుంది. కానీ మా ఆవిడ నెలకోసారి కూడా ఒప్పుకోదు. ఆ సమయంలో కదలకుండా పడుకోవడం తప్పించి తనేమీ చొరవ తీసుకోదు. పైగా సెక్స్‌ చేస్తున్న సమయంలో బాబు గురించి ఆలోచిస్తూ, ‘వాడికి చలి వేస్తుందేమో? ఏసి ఆపి రానా?’ అంటూ మాట్లాడుతుంది. ఆమె ప్రవర్తనతో నాకు విసుగొస్తోంది. సెక్స్‌లో ఆమెకంత అనాసక్తి ఎందుకు? లోపం ఎక్కడుంది?

 
- ఓ సోదరుడు, హైదరాబాద్‌
మీ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోగలను. అయితే తక్కువ లైంగికాసక్తి ఉన్న వాళ్లు ఆ ఆసక్తి ఎక్కువగా ఉన్న భాగస్వాములతో సఖ్యంగా ఉండలేరు. కాబట్టి వాళ్లకి సెక్స్‌ పట్ల ఆసక్తి, దాన్లో ఆనందం అందించగలిగే పద్ధతులను అనుసరించాలి. అవేంటంటే....
 
టేక్‌ చార్జ్‌: మీ పట్ల మీ భార్యకు ఇష్టం, ఆసక్తి పెరిగేలా ప్రవర్తించండి. మరీ ముఖ్యంగా మీ మీద లైంగికార్షణ పెరిగేలా సరదాగా జోకులు వేస్తూ, వీలున్నప్పుడల్లా చొరవ తీసుకుని ముద్దులతో, కౌగిలింతలతో మురిపిస్తూ ఉండాలి.
 
భార్యతో మాట్లాడండి: లైంగిక జీవితం మీద అనాసక్తత ఏర్పడడానికి కారణాన్ని అడిగి తెలుసుకోండి. ఆ కారణం పరిష్కరించగలిగేదైతే తప్పక పరిష్కరిస్తానని హామీ ఇవ్వండి. అప్పుడామె నోరు విప్పి చెబుతుంది. ఆమె ఏం చెప్పినా... ‘ఇలాంటివి ఇంతకుముందు విని ఉన్నాను. ‘ఇది నువ్వనుకునేంత పెద్ద సమస్య కాదు అనో, మనసుకు ఎక్కించుకోకు’ అనో అనునయించండి.
 
వీలు కుదుర్చుకోండి: ఉమ్మడి కుటుంబంలో ఏకాంత సమయం చిక్కడం కొంత కష్టమే! అయినా మీ స్నేహితులు లేదా బంధువులను పిలిచి, వాళ్లతో బాబుని షికారుకు పంపి, ఏకాంత సమయాన్ని చేజిక్కించుకోండి. లైంగిక అనాసక్తికి కారణంఏం చెప్పినా... కోపగించుకోకుండా, సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టండి.
 
సెక్సాలజిస్ట్‌ని కలవండి: దంపతులిద్దరూ సెక్సాలజిస్ట్‌ని కలవండి. ఒకవేళ మీ భార్య మీతో రావడానికి ఇష్టపడకపోతే మీరొక్కరే వెళ్లి సమస్యను వివరించండి.
ఏదేమైనా ఎక్కువ సమయం వృథా చేయకుండా వీలైనంత త్వరగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీ ఇద్దరి మధ్యా దూరం పెరిగి ఆ ప్రభావం మీ అనుబంధాన్ని, ఆరోగ్యాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌, email: mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)