ఎప్పుడు బయటపడతాయి?

10-09-2018: డాక్టర్‌! నా వయసు 25. తెలిసిన వ్యక్తితో శారీరకంగా కలిశాను. కానీ కలిసినప్పుటి నుంచి అతని నుంచి ఏదైనా సుఖ వ్యాధులు సోకాయేమోనని కంగారుగా ఉంది. అసలు లైంగిక వ్యాధులు సంక్రమిస్తే, వాటి తాలూకు లక్షణాలు ఎంత కాలంలోగా బయల్పడతాయి?
- ఓ సోదరి, శ్రీశైలం.
సోకిన వ్యాధి మీద లక్షణాలు బయల్పడే సమయం ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాధుల్లో లైంగికంగా కలిసిన కొన్ని రోజులు లేదా వారాల్లో బయల్పడితే, మరికొన్ని వ్యాధుల్లో లక్షణాలు బయట పడడానికి కొన్ని నెలలు, సంవత్సరాల కాలం పట్టవచ్చు. ఉదాహరణకు ‘క్లమీడియా’ వ్యాధిలో 1 నుంచి 3 వారాల్లో వెజైనల్‌ డిశ్చార్జ్‌, మూత్ర విసర్జన సమయంలో నొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
 
‘జెనైటల్‌ హెర్పిస్’లో 4 నుంచి 7 రోజుల్లోనే మర్మావయాల దగ్గర కురుపులు తలెత్తుతాయి. యోని నుంచి ఆకుపచ్చని, పసుపుపచ్చని స్రావం కనిపించే ‘గనేరియా’ లక్షణాలు 10 రోజుల్లోనే బయట పడతాయి. ‘సిఫిలిస్‌’ లక్షణాలు 2 నుంచి 3 వారాల్లో, ‘ట్రైకోమోనియాసిస్‌’ లక్షణాలు 4 వారాల్లో కనిపిస్తాయి. అయితే లక్షణాలు కనిపించే సమయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొందరిలో వ్యాధి పూర్తిగా ముదిరేవరకూ లక్షణాలు కనిపించకపోవచ్చు. పైగా లైంగిక వ్యాధుల్లో ఎక్కువ శాతం మొండిగా ఉంటాయి. దీర్ఘకాల చికిత్స అవసరమవుతుంది. కాబట్టి తెలియని వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం శ్రేయస్కరం కాదు.
 
                                                                                                                                   
-డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email: mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)