పిల్లలు కావాలనుకుంటున్నాం..

మాకు పెళ్లయి మూడు సంవత్సరాలైంది. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణ పాటించాం. ఇకపై పిల్లలు కావాలనుకుంటున్నాం. గర్భధారణకు ముందే ఆహారంలో  ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా?

- శ్రీశారద, విశాఖపట్నం
గర్భధారణకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసాహారం, గుడ్లు... శాకాహారులైతే పాలు, పెరుగు, పనీర్‌, వివిధరకాల పప్పుధాన్యాలను రోజూ తప్పనిసరిగా తినాలి. వైద్య పరీక్షలు చేయించుకుని, విటమిన్ల లోపం ఉన్నట్టయితే, వైద్యుల సలహా మేరకు మందులను వాడాలి. ఫోలిక్‌ ఆసిడ్‌ అధికంగా లభించే ఆకుకూరలు రోజూ తీసుకోవాలి. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్‌ ఉండే చేప, అవిసె గింజలు, ఆక్రోట్‌ గింజలను తినాలి. కనీసం రెండు లేదా మూడుసార్లు పళ్లు తీసుకోవాలి. విటమిన్‌-డి లోపం రాకుండా ఉండడానికి రోజూ ఓ పదిహేను నిమిషాలు నీరెండలో నడక అలవాటు చేసుకోవాలి. సమయానికి తినడం, నిద్రపోవడం తప్పనిసరి. ఆహారం విషయంలో జాగ్రత్తలే కాకుండా... రోజూ ఏదో ఓ వ్యాయామం చేయాలి. నడక, పరుగు, యోగ, ఈత వంటివి ప్రయత్నించవచ్చు.