స్వయంతృప్తి మంచిదే!

11-06-2018: డాక్టర్‌! నా వయసు 25. పదమూడో ఏట నుంచీ స్వయంతృప్తి అలవాటు ఉంది. అయితే ఇలా చేయడం తప్పనీ, స్వయంతృప్తి పొందడం వల్ల పెళ్లయ్యాక సమస్యలు ఎదురవుతాయనీ నా స్నేహితురాళ్లు భయపెడుతున్నారు. ఇది ఎంతవరకూ నిజం? అసలు మహిళలు స్వయంతృప్తి పొందకూడదా?

- ఓ సోదరి, మైలవరం.
 
ప్రపంచవ్యాప్తంగా 62% మంది మహిళలు స్వయంతృప్తిని అనుసరిస్తూ ఉంటారు. స్వయంతృప్తి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ లేకపోగా, ఎలాంటి సుఖవ్యాధులూ దరి చేరకుండా ఉంటాయి. పైగా స్వయంతృప్తి వల్ల గర్భం దాల్చే వీలూ ఉండదు. స్వయంతృప్తి వల్ల శరీరంలో ఫీల్‌గుడ్‌ ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తొలగి, కండరాలు సాంత్వన పొందుతాయి. నెలసరి నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి మహిళలు స్వయంతృప్తి పొందడం అన్ని విధాలుగా సురక్షితం. ఇటీవలే జరిపిన ఒక అధ్యయనంలో స్వయంతృప్తి వల్ల ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’ తగ్గుతుందనీ, గుండెకు తగిన వ్యాయామం కూడా అందుతుందనీ వెల్లడైంది.
 
మహిళలు తమ శరీరాల్ని స్వయంగా శోధించుకుని, తమకు అనుకూలమైన పద్ధతిలో స్వయంతృప్తి పొందడం హర్షణీయమే! భాగస్వామి లేనివాళ్లతోపాటు, పెళ్లైన మహిళలూ స్వయంతృప్తి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ఇందుకు కారణం, ఆ చర్య కొన్ని సందర్భాల్లో లైంగిక క్రీడకు మించిన ఆనందాన్ని అందించడమే! స్వయంతృప్తి అనుసరించడం ద్వారా, క్లైమాక్స్‌ చేరుకోవడం కోసం విభిన్నమైన స్పర్శలు, ఒత్తిడులను తమకు తాముగా మహిళలు తెలుసుకోగలుగుతారు.
 
ఇలా తెలుసుకోవడం మహిళలతోపాటు, పురుషులకూ అవసరమే! దంపతులు లైంగిక జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనుకుంటే, స్వయంతృప్తిలో మహిళలు పొందే అలౌకిక ఆనందానికి కారణాల్ని పురుషులు గ్రహించి, అనుసరించాలి. అయితే సమాజంలో మహిళల స్వయంతృప్తి గురించి ఎన్నో అభ్యంతరాలు, అపోహలు ఉన్నాయి. వీటిని పారదోలి, మహిళలు నిర్భయంగా స్వయంతృప్తిని అనుసరించవచ్చు.
 
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌,
email:mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)