అక్కడ నాళాలు ఉబ్బితే...

16-10-2018: డాక్టర్‌! వృషణాల మీద రక్తనాళాలు ఉబ్బినట్టు తయారయ్యాయి. వైద్యులకు చూపిస్తే వేరికోసిల్‌ సర్జరీ చేయాలని అంటున్నారు. ఈ సర్జరీ చేయించుకోక తప్పదా? ప్రత్యామ్నాయ చికిత్సలు లేవా? అసలు సర్జరీ ఎవరికి అవసరం?
- ఓ సోదరుడు, వరంగల్‌
 
కాళ్లలో సిరలు ఉబ్బడాన్ని వేరికోజ్‌ వెయిన్స్‌ అని ఎలా అంటారో వృషణాల్లో సిరలు ఉబ్బడాన్ని ‘వేరికోసిల్‌’ అంటారు. ఈ సమస్య మొదట ఎడమవైపు వృషణంలోనే మొదలవుతుంది. ఎడమ వైపు వృషణానికి సంబంధించిన సిర ఎడమ మూత్రపిండంతో కలవడం వల్ల ఆ శిర మీద ఒత్తిడి పెరిగి, సమస్య ఆ వైపున మొదట కనిపిస్తుంది. అయితే వేరికోసిల్‌ ఉన్నంతమాత్రాన ప్రతి ఒక్కరికీ సర్జరీ చేయవలసిన అవసరం లేదు.

సర్జరీ ఎప్పుడంటే?

వృషణం పరిమాణం తగ్గుతున్నా...
వేరికోసిల్‌ కారణంగా వంధ్యత్వం ఉన్నా...
వృషణాల్లో నొప్పి ఉన్నా...
టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ స్రావం తగ్గినా...
మందులు వాడినా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ పెరగకపోవడం..
రెండు వృషణాలు గ్రేడ్‌ 2 దశకు చేరుకున్నా...
ఒక వృషణం గ్రేడ్‌ 3 దశకు చేరుకున్నా....
 స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడం
స్పెర్మ్‌ కౌంట్‌ బాగున్నా శుక్ర కణాల డిఎన్‌ఎ డ్యామేజ్‌ అవడం (డిఎ్‌ఫఐ పెరగడం)

వేరికోసిల్‌ గ్రేడింగ్‌

వేరికోసిల్‌ గ్రేడ్‌ 1లో లక్షణాలు అంతగా కనిపించకపోవచ్చు. గ్రేడ్‌ 2లో ఉబ్బిన సిరలు కనిపిస్తాయి. గ్రేడ్‌ 3లో, రోగి నిలబడినప్పుడు ఉబ్బిన శిరలు స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా గ్రేడ్‌ 2 లేదా గ్రేడ్‌ 3 ప్రారంభంలో సమస్యను గుర్తించిన వెంటనే వైద్యులను కలవడం మంచిది. వేరికోసిల్‌ కారణంగా నొప్పి ఉండవచ్చు, ఉండకపోవచ్చు.
 
సర్జరీలో రకాలు
ఓపెన్‌ సర్జరీ, లాప్రోస్కోపీ, మైక్రో సర్జరీ, ఎంబలైజేషన్‌.... ఈ నాలుగు పద్ధతుల్లో, మొదటి రెండు పద్ధతుల్లో దుష్ప్రభావాలు ఎక్కువ. కాబట్టి మైక్రో సర్జరీ లేదా ఎంబలైజేషన్‌ పద్ధతులనే వైద్యులు ఎంచుకుంటున్నారు. ఈ రెండిట్లో మైక్రో సర్జరీ సురక్షితమైనది. మైక్రో సర్జరీ ఉదయం చేస్తే సాయంత్రానికి డిశ్చార్జ్‌ అయిపోవచ్చు. రెండు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి అన్ని పనులూ చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత 3 నెలల్లో స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది. అలాగే టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ స్రావం కూడా యఽథాస్థితికి చేరుకుంటుంది.
 
వరుస అబార్షన్లవుతుంటే....
కొందరు మహిళలకు వరుసగా మూడో నెలలోనే అబార్షన్లు అవుతూ ఉంటాయి. ఇందుకు కారణం శుక్రకణం డిఎన్‌ఎ డ్యామేజ్‌ అయి ఉండడం. ఈ సమస్యకూ వేరికోసిల్‌కు సంబంధం ఉంది. కాబట్టి మూడు నెలలకు మించి గర్భం నిలవకుండా వరుసగా అబార్షన్లు జరుగుతూ ఉంటే, భర్త కచ్చితంగా వైద్యులను కలిసి వేరికోసిల్‌ ఉందేమో పరీక్ష చేయించుకోవాలి. డిఎన్‌ఎ పరీక్షలో డిఎఫ్‌ఐ పెరిగి, అసహజ స్థితి ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది.
డాక్టర్‌ రాహుల్‌రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)