మేల్‌ మెనోపాజ్‌ అనేది ఉందా?

18-09-2018: డాక్టర్‌! మహిళలకులాగే పురుషులు కూడా మెనోపాజ్‌కు గురవుతారా? ఇప్పుడు నా వయసు 55. ఈ దశను స్వయంగా గుర్తించేదెలా?
- ఓ సోదరుడు, బీబీ నగర్‌.
 
మహిళలకులాగే పురుషులు కూడా మెనోపాజ్‌కు గురవుతారు. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్రావం తగ్గడం మూలంగా పురుషుల్లో వచ్చే ఈ మెనోపాజ్‌ను ‘ఆండ్రోపాజ్‌’ అంటారు. 55 అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లు మాత్రమే ఆండ్రోపాజ్‌కు గురవుతారు. అలసట, మతిమరుపు, కండరాల నొప్పులు, లైంగికాసక్తి లోపించడం, ఆకలి మందగించడం... మొదలైనవన్నీ ఆండ్రోపాజ్‌ లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే ఆండ్రాలజిస్టీని కలిసి టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది.
 
ఈ ఇంజెక్షన్లు మోతాదునుబట్టి నెలకొకసారి లేదంటే మూడు నెలలకి ఒకసారి తీసుకోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా టెస్టోస్టిరాన్‌ జెల్‌ కూడా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ చర్మం మీద అప్లై చేసుకుని వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేయకుండా మహిళలను, పిల్లలను అదే చేతులతో తాకితే ఆ హార్మోన్‌ వాళ్ల శరీరంలోకి చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందీ కలిగించని ఇంజెక్షన్లనే ఆశ్రయించడం మేలు. అయితే టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్‌ తీసుకునే ముందు రక్తంలో హిమోగ్లోబిన్‌ పరిమాణాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఆండ్రోపాజ్‌కు గురయినట్టు అనుమానంగా ఉంటే వెంటనే ఆండ్రాలజి్‌స్టని కలిసి హార్మోన్‌ ట్రీట్మెంట్‌ తీసుకోండి.
 
-డాక్టర్‌ రాహుల్‌రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.