దీన్ని సమస్య అనుకోవాలా?

26-02-2019: డాక్టర్‌! నాకు పెళ్లయింది. నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగం చేస్తున్నాను. గత కొంతకాలంగా ఒక చిత్రమైన సమస్య మొదలైంది. కొన్ని రోజులు అంగస్తంభనలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇంకొన్ని రోజులు సమస్య ఉంటోంది. దాంతో అసలు నాకు సమస్య ఉందా? లేదా? అని మధన పడుతున్నాను. నేను ఎదుర్కొంటున్న ఈ స్థితిని ఎలా భావించాలి?
మీకు స్తంభనలు ఉంటున్నాయి కాబట్టి భయపడవలసిన పని లేదు. రాత్రి వేళ ఉద్యోగాలు చేసేవారిలో బయలాజికల్‌ క్లాక్‌ అదుపు తప్పుతుంది. దాంతో పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయిలు గతి తప్పుతాయి. ఫలితంగానే మీకు అంగస్తంభన సమస్య తలెత్తుతోంది. తగ్గిన ఈ హార్మోన్‌ దానంతట అదే సమమైనప్పుడు, ఆ కొద్ది రోజులు మీకు అంగస్తంభనలు సక్రమంగా ఉంటున్నాయి. అయితే ఎప్పుడైతే సమస్య కనిపిస్తుందో, దాని గురించి మధన పడుతూ ఉంటారు కాబట్టి, ఆ తర్వాత కొద్ది రోజుల వరకూ సమస్య అలాగే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ, మీ అనుమానం తీరాలంటే వైద్యులను కలిసి టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ పరీక్ష చేయించుకోండి. హార్మోన్‌ పరిమాణంలో స్వల్ప తగ్గుదల ఉన్నంత మాత్రాన మందులు వాడవలసిన అవసరం ఉండదు. క్రమంతప్పక వ్యాయామం చేస్తే ఈ హార్మోన్‌ సమమవుతుంది. కాబట్టి నిర్భయంగా ఉండండి.