సర్జరీతో సర్దుకుంటుందా?

03-12-2018, ప్రశ్న: డాక్టర్‌! నాకు స్పెర్మ్‌ కౌంట్‌ జీరో ఉంది. బయాప్సీ చేస్తే వీర్య ఉత్పత్తి సక్రమంగానే ఉందనీ, బ్లాకేజీ తొలగించడం కోసం సర్జరీ చేయాలనీ అంటున్నారు. సర్జరీతో పరిస్థితి చక్కబడుతుందా?
- ఓ సోదరుడు, అరకు.
 
వైద్యులు మీకు సూచించిన సర్జరీ ‘అబ్‌స్ట్రక్టివ్‌ ఓజోస్పర్మియా’! వీర్యం ఉత్పత్తి ఉవుతున్నా, విడుదలలో అడ్డంకులు ఉన్నప్పుడు ఈ సర్జరీ అవసరమవుతుంది. అయితే భార్య పునరుత్పత్తి వ్యవస్థలో లోపాలు ఉన్నా, వయసు 30 దాటినా, పెళ్లయి పదేళ్లు దాటినా ఈ సర్జరీ చేయించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సర్జరీతో మీకు ఉన్న సమస్య తొలగిపోవచ్చు. కానీ భార్యలో లోపాలుంటే మీరు సర్జరీ చేయించుకోవడం నిరుపయోగమే! అలాగే భార్య వయసు 30 దాటితే అండాల నాణ్యత తరుగుతూ ఉంటుంది. దాంతో గర్భం దాల్చే అవకాశాలూ సన్నగిల్లుతాయి.
 
పెళ్లయి పదేళ్లు దాటినా వయసు పైబడడం మూలంగా దంపతులిద్దరికీ పిల్లల్ని కనే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు సర్జరీ చేయించుకోవడం కంటే ఐవిఎఫ్‌ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం మేలు. ఒకవేళ ఇటీవలే పెళ్లయినా, భార్య పునరుత్పత్తి వ్యవస్థలో ఎటువంటి సమస్యలు లేకపోయినా, వయసు 20 నుంచి 25 మధ్య ఉన్నా ఈ సర్జరీ చేయించుకోవచ్చు. అంటే...సమస్య పురుషుడిలోనే ఉండి, వయసు కూడా తక్కువగా ఉండి, ఇటీవలే పెళ్లయితే సర్జరీతో పిల్లల్ని కనే అవకాశాలు పెరుగుతాయి. ఈ మైక్రో సర్జరీ సక్సెస్‌ రేటు 60 నుంచి 70%. కాబట్టి పైన చెప్పిన అంశాల ఆధారంగా సర్జరీ అవసరాన్ని గమనించగలరు.
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)