ఎలా పరీక్షించాలి?

26-03-2019:డాక్టర్‌! మాకు ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరి వయసుల్లో పదేళ్ల వ్యత్యాసం ఉంది. పెద్ద బాబుకు పెళ్లయింది. అయితే పరీక్షల్లో సెమెన్‌ కౌంట్‌ తక్కువగా ఉందనీ, ఆ సమస్య జన్యుపరంగా సంక్రమించిందనీ వైద్యులు చెప్పారు. మా చిన్నబ్బాయికి ఇప్పుడు 15 ఏళ్లు. వాడికి కూడా ఈ సమస్య ఉందేమోనని అనుమానంగా ఉంది. వైద్యులను సంప్రతిస్తే వీర్య పరీక్ష చేయించమని అన్నారు. ఇంత చిన్న వయసులో ఆ పరీక్ష గురించి బాబుకు వివరించాలంటే ఇబ్బందిగా ఉంది. నన్ను ఏం చేయమంటారు? 

- ఓ సోదరుడు, సత్తెనపల్లి

 
జన్యుపరమైన సమస్య ఒక పిల్లవాడికి సంక్రమిస్తే, మిగతా మగ పిల్లలందరికీ సంక్రమించాలని లేదు. అలాగని కొట్టిపారేయడం కూడా సరి కాదు. అయితే ఇప్పుడే వీర్య పరీక్ష చేయిస్తే, పిల్లవాడు ఆత్మన్యూనతకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఫలితం ప్రతికూలంగా వస్తే ఆ ప్రభావం బాబు మీద దీర్ఘకాలం ఉండిపోతుంది. కాబట్టి ప్రస్తుతానికి హార్మోన్‌ పరీక్ష చేయించి, ఫలితం ద్వారా వీర్య ఉత్పత్తి గురించి తెలుసుకోండి. పెళ్లీడు వయసుకు వచ్చిన తర్వాత, పెళ్లికి ముందు ‘ప్రీ మారిటల్‌ ఫర్టిలిటీ చెక్‌’ అనే పరీక్ష చేయిస్తే సరిపోతుంది. ఈ పరీక్ష మీ పెద్ద అబ్బాయికి కూడా పెళ్లికి ముందే చేయించి ఉండవలసింది. ఈ పరీక్షతో వీర్య ఉత్పత్తి ఉన్నదీ లేనిదీ, వీర్య కణాల కదలికలు మొదలైన వివరాలన్నీ తెలుస్తాయి. ఫలితాన్నిబట్టి చికిత్స ఇస్తే సమస్య పరిష్కారమవుతుంది.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)