ఈ సమయంలో సన్నిహితంగా మెలిగేదెలా?

11-02-2019: డాక్టర్‌! నేనిప్పుడు 6 నెలల గర్భవతిని. ఆయనతో శారీరకంగా కలవాలనే ఆలోచనలు తగ్గాయి. దాంతో మా ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుందేమోనని భయంగా ఉంది. ఈ విషయాన్ని ఆయనతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నన్ను ఏం చేయమంటారు? 

- ఓ సోదరి, టంగుటూరు

నెలలు పెరుగుతున్నకొద్దీ కొందరు గర్భిణుల్లో ఇలాంటి మార్పులు సహజమే! నిజానికి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలూ లేనప్పుడు, తొమ్మిదో నెల వరకూ వైద్యులు సూచించిన భంగిమల్లో లైంగికంగా కలవవచ్చు. పొత్తికడుపు మీద ఒత్తిడి పడకుండా ఉండే సురక్షితమైన భంగిమలు అనుసరించి, ప్రసవ సమయం వరకూ లైంగికానందాన్ని పొందే వీలుంది. అయితే మీ విషయంలో కోరికలు తగ్గాయి కాబట్టి ఆయన కోసం అయిష్టంగా సెక్స్‌లో పాల్గొనవలసిన అవసరం లేదు. నిజానికి భార్యాభర్తల బంధం బలంగా ఉండడానికి గర్భంతో ఉన్నప్పుడు కూడా లైంగికంగా కలిసి తీరాలనే నియమాలేమీ లేవు. ఏకాంత సమయాన్ని ఆయనతో సన్నిహితంగా మెలగడానికి కేటాయించండి. సన్నిహితంగా మెలిగేటప్పుడు, కచ్చితంగా సెక్స్‌లో పాల్గొనవలసిన అవసరం లేదు. ప్రేమాప్యాయతలను మరెన్నో మార్గాల్లో ప్రదర్శించవచ్చు. గర్భం దాల్చడానికి దారితీసిన మా ప్రేమాప్యాయతలను కలిసి గుర్తు చేసుకోవడం, మీ ఇద్దరి మధ్య కొనసాగిన సాన్నిహిత్యం నెమరువేసుకోవడం లాంటి పనుల ద్వారా మీ బంధాన్ని అంతే దృఢంగా నిలిపి ఉంచవచ్చు.
 
-డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ సెక్సాలజిస్ట్‌, ఏవిస్‌ హాస్పిటల్‌,
mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)
doctorsharmila.in