ఆ వ్యాధిని అడ్డుకోలేమా?

24-09-2018:డాక్టర్‌! సుఖ వ్యాధుల నుంచి కండోమ్స్‌ పూర్తి రక్షణ కల్పించగలుగుతాయా? మరీ ముఖ్యంగా సిఫిలిస్‌ లాంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- ఓ సోదరుడు, నిమ్మకూరు
 
సుఖవ్యాధుల్లో అత్యంత తీవ్రమైన వ్యాధి ‘సిఫిలిస్‌’! స్త్రీ, పురుషులిద్దరిలో సిఫిలిస్‌ బ్యాక్టీరియా మర్మాంగాలు, నోరు, పెదవులు, మలద్వారాలను ఇన్‌ఫెక్ట్‌ చేస్తుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తితో లైంగికంగా కలవడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. గర్భిణికి ఈ వ్యాధి ఉంటే బిడ్డకూ సోకుతుంది. ప్రారంభంలో నొప్పి లేని, చిన్న పుండులా ఏర్పడుతుంది. దీని చుట్టుపక్కల ప్రాంతాల్లోని లింఫ్‌ గ్రంథుల వాపు కూడా కనిపిస్తుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, చర్మం మీద దురద లేని దద్దుర్లు చేతులు, పాదాల మీద మొదలవుతాయి. ఈ వ్యాధి లక్షణాలు అందరిలోనూ కనిపించకపోవచ్చు. సంవత్సరాలకొద్దీ శరీరంలో సిఫిలిస్‌ బ్యాక్టీరియా దాక్కుని ఉండి దీర్ఘకాలం రకరకాల రుగ్మతలతో ఇబ్బంది పెడుతుంది. సిఫిలి్‌సలో భాగంగా తలెత్తే పుండ్లు హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ తేలికగా సోకడానికి దోహదపడతాయి. సిఫిలి్‌సతో ఉన్న మరో ప్రధాన సమస్య ఇది. సిఫిలిస్‌ సోకిన మహిళలు గర్భం దాల్చితే బిడ్డకు పలు రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇక ఈ వ్యాధి సోకకుండా కండోమ్స్‌ కొంతవరకూ ఉపయోగపడే మాట నిజమే! అయినా పాలీయురేథేన్‌ కండోమ్స్‌ సైతం ఈ వ్యాధిని సమూలంగా అడ్డుకోలేవు. కాబట్టి పెళ్లికి ముందు అపరిచితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ప్రమాదకరం. ఒకవేళ సిఫిలిస్‌ వ్యాధి సోకిందని అనుమానంగా ఉంటే వెంటనే సెక్సాలజి్‌స్టని సంప్రతించి చికిత్స తీసుకోండి.
 
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email: mili77@gmail.com