లైంగిక శక్తికి ఆసరాగా...

25-06-2018: అన్నింటినీ కలిపి శారీరక ఆరోగ్యం అనే ఒకే ఒక్క మాటతో దాటేసినా, లైంగిక ఆరోగ్యం గురించి మాత్రం ఎవరైనా ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిందే! ఎందుకంటే ప్రేమ, పెళ్లి, మైధునం, సంతానం ఈ నాలుగూ అవినాభావ సంబంధమైనవి. ఎంత కొత్త వాహనమైనా, ఇంధనం లేనిదే అది నడవదుగా! సరియైన పోషకాలేవీ అందకపోతే, లైంగిక వ్యవస్థ కూడా కుంటుపడటం ఖాయం. అయితే కొంత కాలంగా జరుగుతున్న పరిశోధనల్లో, కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాల్లోని విటమిన్లు, లవణాలు లైంగిక శక్తిని బాగా పెంపొదిస్తాయని తేలింది. లైంగిక వ్యవస్థ పోషణకు అవసరమైన ఆహార పదార్థాల్లో కొన్ని.....
 
జింక్‌ కోసం....
లైంగిక శక్తికి మూలమైన టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల ఉత్పత్తికి జింక్‌ చాలా అవసరం. ఇది వాంఛను ప్రేరేపితం చేయడంతో పాటు, స్త్రీ పురుషులు ఇరువురిలోనూ లైంగిక శక్తినీ, చైతన్యాన్నీ పెంచుతుంది. జింక్‌ లోపించిన పురుషులు లైంగికంగా అశక్తంగా మారిపోయే స్థితి ఏర్పడుతుంది. ఈ లోపం రాకుండా చేయడానికి పాలకూర, సెనగలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు పువ్వు గింజలను, ఓస్టర్‌ చేపలను తరుచూ ఆహారంగా తీసుకోవాలి.
 
ఒమేగా-3 కోసం...
ఇది వయసు పైబడే వేగాన్ని తగ్గిస్తుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. లైంగిక ప్రక్రియలో గుండె, మెదడు ఆరోగ్యం అత్యంత కీలకమనేది నిర్వివాదాంశం. మనసును చైతన్యవంతంగానూ, ఉద్వేగాలను నిలబెట్టడంలోనూ ఒమేగా-3 భూమిక చాలా కీలకమైనది. పైగా శరీరంలోని హార్మోన్లను సమస్థితిలో ఉంచడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పోషకాల కోసం అవిసె గింజలు, అవిసె నూనె, వాల్నట్లు, సోయాబీన్‌, ఆలివ్‌ నూనె, సాల్మోన్‌ చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.
 
బి. విటమిన్‌ కోసం...
జననాంగాలను ఆరోగ్యంగా ఉంచడంలో బి-విటమిన్‌ బాగా తోడ్పడుతుంది. శరీరంలో విడుదలయ్యే సెక్స్‌ హార్మోన్లను ఇవి అనుసంధానం చేస్తాయి. మెదడు పని తనాన్నీ, గ్రహణ శక్తిని పెంచడంలో విటమిన్‌- బి పాత్ర కీలకం. అయితే ఈ విటమిన్‌ లోపిప్తే, నీరసం, నిస్సత్తువా ఆవరిస్తాయి. ఈ స్థితి శృంగారపరంగా కూడా అశక్తంగా మారుస్తుంది. . ఈ లోపం రాకుండా చూసుకోవడానికి చిక్కుడు గింజలు, కాయదాన్యాలు, అరటిపండ్లు, గుడ్లు, జున్ను, మాంసం వంటి వాటిని ఆహారంలో భాగం చేయాలి.
 
కిడ్నీల శక్తికి....
కిడ్నీలు జీవశక్తికి మూలాధారాలు. ఇవి మనలోని శక్తి నిలువలను, వ్యాధినిరోధక శక్తినీ, లైంగిక సామర్థ్యాన్నీ నిలబెడతాయి. ఇందుకు దోహదం చేసే ఆహారపదార్థాల్లో చె ర్రీలు, క్రాన్‌బెర్రీలు, చిక్కుడు గింజలు, వేరు సెనగలు, ఓట్లు, వేరులో కాచే క్యారెట్‌, చిలకడ దుంప, బంగాళా దుంపలు, ముల్లంగి, ఉల్లి, వెల్లుల్లి ముఖ్యమైనవి. వీటిని అప్పుడప్పుడైనా తప్పనిసరిగా ఆహారంగా తీసుకోవాలి.
 
రక్తశుద్ధికి....
శరీరంలో కొవ్వుపదార్థాలు, మలినాలు పెరిగిపోయినప్పుడు రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. ఇది లైంగిక శక్తిని దెబ్బతీస్తుంది. అయితే, ఉల్లి, వెల్లుల్లి, పాలకూర, బీట్‌రూట్‌, ఆపిల్‌ పండ్ల వంటివి దీనికి విరుగుడుగా పనిచేయడ ంతో పాటు రక్తశుధ్ది కలిగించడం ద్వారా లైంగిక శక్తిని పెంచుతాయి. వీటితో పాటు మిరియాల కారం, ఆముదపు గింజలు, అవకాడో, సిట్రస్‌ పండ్లు, పుచ్చకాయ వంటివి తీసుకుంటే రక్తప్రసరణ మరింత సాఫీగా సాగి లైంగిక వ్యవస్థ ఉద్దీపన పొందుతుంది. .