ముచ్చటైన శృంగారానికి...మూడు సూత్రాలు!

‘మరీ పాత చింతకాయ పచ్చడిలా తయారైపోయావ్‌. ఓ ముద్దూలేదు ముచ్చటా లేదు. ఆ సినిమాలో హీరోయిన్‌ను చూడు హీరోను ఎలా రెచ్చగొడుతోందో. నువ్వూ ఉన్నావ్‌? జీవితం ఏ రసమూ లేకుండా నీరసంగా సాగిపోతోంది. ప్చ్‌... ఏం చేస్తాం. దేనికైనా రాసిపెట్టి ఉండాలే మొద్దు మొహమా’ భర్త ఎన్నిసార్లు ఎత్తిపొడిచాడో, ఎన్నిమాటలన్నాడో!

‘అబ్బో! దొరగారేదో సిక్స్‌ప్యాక్‌ సల్మాన్‌ఖాన్‌ అయినట్టు. హడావిడి ఎక్కువ. విషయం తక్కువ. అచ్చంగా మన క్రికెటర్ల బాపతే. బ్యాటింగ్‌కు వెళ్లినంత సేపు పట్టదు... అవుట్‌ అయిపోడానికి. ఆడలేక మద్దెల ఓడన్నట్టుంది వ్యవహారం’ 

నోటిదాకా వస్తుంది కానీ, అంతలోనే తమాయించు కుంటుంది భార్య.
చాలా పడకగదుల్లో వినిపించే మాటలే, కనిపించే దృశ్యాలే. 
ఇంతకీ ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఆవిడని వేలెత్తి చూపాలా? అతడిని నిలదీయాలా? 
లైంగిక ఉద్దీపనకు సంబంధించినంత వరకూ... పురుషుడు కరెంటు బల్బులాంటివాడు. స్ర్తీ ఇనుప కడ్డీ లాంటిది. స్విచ్చు వేయగానే బల్బు వెలిగిపోతుంది. అంతే వేగంగా చల్లబడుతుంది కూడా. అదే, ఇనుప కడ్డీ వేడెక్కడానికి కొంత సమయం కావాలి. చల్లారడానికి కూడా అంతే సమయం కావాలి. ఆలూమగల లైంగిక స్పందనలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. ఈ ప్రకృతి సూత్రాన్ని దంపతులు అర్థం చేసుకోగలిగితే సగం సమస్యలు ఉండవు. 
తమలో కరెంటు ప్రవహించగానే సరిపోదనీ, తాము బ్యాటింగ్‌కు సిద్ధమైనంత మాత్రాన ఆట మొదలైనట్టు కాదనీ... చాలామంది పురుషులు గ్రహించరు. బౌలర్‌ మానసిక సంసిద్ధత కూడా ముఖ్యమేగా! జీవితభాగస్వామి పరిమితుల్ని అర్థం చేసుకోవాలి. ఆమెకు తగినట్టు తమను తాము మార్చుకోవాలి. తదనుగుణంగా పడకగది యుద్ధ వ్యూహాన్ని రచించుకోవాలి. 
శృంగారాన్ని మూడు దశలుగా విభజించుకోవాలి.
ఫోర్‌ప్లే.
ప్లే.
ఆఫ్టర్‌ ప్లే.
ఫోర్‌ప్లే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. పడకమీద సాగించే ఆలింగన చుంబనాదులే ఫోర్‌ప్లే అని భావిస్తారు చాలామంది. కాదుకాదు. పడకగదిలోకి వెళ్లడానికి చాలా ముందే ఫోర్‌ప్లే ప్రారంభించవచ్చు. ఆమాటకొస్తే, ఓ రోజు ముందో ఓ వారం ముందో కూడా మొదలుపెట్టవచ్చు.. కమ్మని మాటలతో, చిలిపి కవ్వింపులతో, చిన్నాపెద్దా కానుకలతో! 
‘మనిద్దరం కలసి వలపు చిలికి ఎన్నాళ్లయిందో’ అంటూ ఏ వేటూరి పాటలానో మనసులోని మాట వ్యక్తం చేయవచ్చు. ఇద్దరికీ మాత్రమే అర్థమయ్యే సంకేతాలతో శృంగార రాయబారం నడపవచ్చు. ప్రణయ వేడుకల్లో చిలకరించుకునే ప్రత్యేకమైన అత్తరు సీసాను బహుమతిగా ఇవ్వవచ్చు. దీనివల్ల ఆమెలో వలపు భావన విత్తుగా మొలకెత్తుతుంది. అది మొక్కయి మొగ్గలు తొడుగుతుంది. సరిగ్గా సంయోగ సమయానికి పూవై విచ్చుకుంటుంది. 
పురుషుడికి అంత సమయం అక్కర్లేదు. అతను సెక్స్‌కు తయారు కావడానికి ముప్పై సెకెన్లు సరిపోతాయి. టీవీలో ఏ దెయ్యాల సినిమా చూస్తూనో... రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్లిపోగలడు. ఆమెకు మూడ్‌ ముఖ్యం. పరిసరాలు ప్రధానం. మనసును ట్యూన్‌ చేసుకోవడం అవసరం. కానీ, ఆ విషయం అతడితో చెప్పడానికి స్ర్తీ సహజమైన బిడియం అడ్డొస్తుంది. ఫలితంగా, తన నిరసననూ అసంతృప్తినీ ఇంకో రూపంలో బయటపెడుతుంది. ఇలాంటి సందర్భాల్లో పరస్పర అవగాహనను మించిన పరిష్కారం ఉండదు. 
అతను చేయాల్సిందల్లా ఒకటే... పడకగది ప్రణయానికి ముందే, పాత ఊసులతో మురిపించాలి. ‘నువ్వు నా ప్రాణం. నేను నీ విధేయుడిని, ఆరాధకుడిని, సంరక్షకుడి’ అన్న భావన కలిగించాలి. మహిళ కూడా బిడియాన్ని వదులుకోవాలి. తన లైంగిక అవసరాల గురించి స్వేచ్ఛగా చర్చించాలి. ఏం కావాలో చెప్పకపోతే, అతడికెలా తెలుస్తుంది. ఎలా అందిస్తాడు? 
ఇంట్లో ఉన్నప్పుడు, ఎలాంటి దుస్తులు ధరించినా ఫర్వాలేదు... అన్న ఆలోచన తప్పు. లోదుస్తులు అయినా సరే, అతడికి నచ్చే రంగులూ ఊరించే డిజైన్లూ ఎంపిక చేసుకోవాలి. అప్పుడే ఆలూమగల శృంగార భావనలు కలుసుకుంటాయి. భావప్రాప్తి ద్వారాలు తెరుచుకుంటాయి.