‘గుండె’నిండా సందేహాలే!

అతను అయస్కాంతమైతే...

ఆమె ఇనుప రజం.
ఆమె తీపి బెల్లమైతే..
అతను గండు ఈగ.
ఆమె రతీదేవి అయితే...
అతను మన్మథుడు.
ఒకర్ని వదిలి ఒకరు ఉండలేరు. ఎక్కడికెళ్లినా, ఎన్ని పనులున్నా చీకటి పడేసరికి గూటికి చేరుకోవాల్సిందే. ఒకరి కౌగిలిలో ఒకరు 
ఒదిగిపోవాల్సిందే. 
ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. వల్లమాలిన వ్యామోహం. 
అతను కంటిచూపుతో సంకేతం పంపుతాడు. ఆమె పెదవి విరుపుతో జవాబిస్తుంది. అతను నిశ్శబ్దంగా మన్మథబాణం వేస్తాడు. ఆమె వెచ్చని నిట్టూర్పుతో ఆ మెత్తటి గాయానికి ఉక్కిరిబిక్కిరైపోతుంది. ప్రతిరాత్రీ వసంతరాత్రే. ప్రతిగాలీ పైరగాలే. 
ఇదంతా గతం.
ఐదారు నెలల నాటి సంగతి. 
ప్రస్తుతం, ఆ ఇద్దరి పడకల మధ్యా ఓ విభజన రేఖ మొలిచింది. ఆ బంధం చుట్టూ సందేహాల మబ్బులు కమ్ముకున్నాయి. 
ఎందుకంటే...
సరిగ్గా నలభైరెండో పుట్టినరోజు నాడు అతను గుండెపోటుకు గురయ్యాడు. బైపాస్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. నిజమే, చిన్న వయసే. ఒత్తిడితో కూడిన వృత్తి జీవితం అతడి గుండెకు గాయం చేసింది. శస్త్ర చికిత్స తర్వాత... సెక్స్‌ పూర్తిగా బంద్‌. ఒకటిరెండు సార్లు దగ్గరికెళ్లే ప్రయత్నం చేశాడు. ‘నో. నో అంటే నో’ అని చెప్పేసిందామె. అది అయిష్టం కాదు. భయం. సెక్స్‌లో గుండె మీద భారం పడుతుందంటారు. ఆ కారణంగా మళ్లీ గుండెపోటు వస్తుందేమో అన్న అనుమానం. ఆ భార్యాభర్తలు తమ మనసులోని భయాన్ని కార్డియాలజిస్టుకు ఎప్పుడూ చెప్పలేదు. ఆయనా ప్రత్యేకించి ఇది చేయమనలేదు, ఇది వద్దనీ అనలేదు. 
ఆకలేసినప్పుడు అన్నమూ, దాహమేసినప్పుడు మంచినీళ్లూ ఎలాగో... కోరిక కలిగినప్పుడు సెక్స్‌ కూడా అంతే సహజం. ఆలూమగల బంధంలో అదో ప్రధాన అధ్యాయం కూడా. కోరికల్ని బలవంతంగా అణిచేసుకోడాన్ని మించిన ఒత్తిడేం ఉంటుంది?
నిజమే, హృద్రోగంతో బాధపడుతున్నవారు సంభోగ సమయంలో కుప్పకూలిన సంఘటనలు ఉన్నాయి. కానీ, అవి 0.1 శాతం కంటే కూడా తక్కువ. ఆ మరణాలు కూడా నైతికమైన శృంగారానికి సంబంధించినవి కాదు. పొట్టనిండా తినేసి, సీసాలకొద్దీ మద్యం తాగేసి, ఏ అక్రమ భాగస్వామినో దొంగచాటుగా కలుసుకున్నప్పుడు ఉత్పన్నమయ్యే అదనపు ఒత్తిడివల్ల సంభవించినవే. 
ఆరోగ్యపరమైన సంక్షోభ సమయాల్లో లైంగిక వాంఛలు కొంతమేర మరుగున పడిపోవడం సాధారణమే. పని ఒత్తిడికి, ఆఫీసు వ్యవహారాలకూ దూరంగా... ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మళ్లీ పురివిప్పడమూ అంతే సహజం. ఇలాంటి సందర్భాల్లో, ఎవరి మనసుల్లో అయినా ఒక ప్రశ్న తలెత్తుతుంది.
‘గుండెపోటు తర్వాత, లైంగిక జీవితానికి ఎంత విరామం ఇవ్వాలి?’
ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగే వ్యక్తి ఒక్కరే. ఆ హృద్రోగికి చికిత్స అందిస్తున్న కార్డియాలజిస్టు.
చాలా సందర్భాల్లో, రోగులు సెక్స్‌తో ముడిపడిన ప్రశ్నలు అడగడానికి మొహమాట పడతారు. వైద్యులు కూడా తమంతట తాము ఆ ప్రస్తావన తీసుకురారు. అంతమాత్రాన, ఆ చర్చ నిషిద్ధమని భావించడానికి వీల్లేదు. ఆహార, వ్యాయామాల గురించి మాట్లాడుకున్నంత స్వేచ్ఛగానే... సెక్స్‌ గురించీ వైద్యుడితో మాట్లాడవచ్చు. మనసులోని సందేహాలు తీర్చుకోవచ్చు. 
ఆయాసపడకుండా రెండు అంతస్తుల మెట్లు ఎక్కగలుగుతున్నారంటే... లైంగిక జీవితాన్ని పునరుద్ధరించుకోడానికి ఇదే తగిన సమయం. కాకపోతే, డాక్టరుగార్ని సంప్రదించాకే ఏదైనా!
శస్త్రచికిత్స తర్వాత... లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించుకోడానికి పడకగదిని ఓ కొలమానంగా భావించకూడదు. శక్తికి మించి ప్రయత్నించ కూడదు. పనితీరు విషయంలో ఒత్తిడికి గురికాకూడదు. లైంగిక జీవితాన్ని నైతిక భాగస్వామికే పరిమితం చేయాలి. మళ్లీ మునుపటి సత్తువ వచ్చేసిందన్న ఆనందంలో... ఆహార, వ్యాయామాల్ని అశ్రద్ధ చేయకూడదు.
పడకగదిలోకి వెళ్లేముందు... గుప్పెడు గుండె సాక్షిగా 
చేసుకోవాల్సిన తీర్మానాలివి.