అరవై... రిటైర్మెంట్‌ వయసు కాదు!

వయోధికులు...అన్న ముద్ర చాలు. జీవితమనే నాటకం చివరి అంకానికి వచ్చినట్టే. పడకగది పడుకోడానికి మాత్రమే పరిమితమైపోతుంది. ముద్దూముచ్చట్లు బంద్‌. ఇచ్చిపుచ్చుకున్నా, మహా అయితే అతడికి ఆమె మందులిస్తుంది. ఆమెకు అతడు ఏ అమృతాంజనమో రాస్తాడు. మనసు ముచ్చటపడుతున్నా... శరీరం ఉసిగొల్పుతున్నా... ముందుకెళ్లలేకా, వెనక్కి రాలేకా ఆరుపదుల వయసులో శృంగారపురి చౌరస్తాలో నిలబడి అయోమయంగా చూస్తుంటారా దంపతులు.

యూజ్‌ ఇట్‌ ఆర్‌ లూజ్‌ ఇట్‌...

కొన్ని అంతే! వాడినంత కాలమే చురుగ్గా ఉంటాయి. మూలనపడేశామా తుప్పు పట్టిపోతాయి. పనికి రాకుండా తయారైపోతాయి. లైంగిక వ్యవస్థ కూడా అలాంటిదే. అతడికైనా, ఆమెకైనా ఈ సూత్రమే వర్తిస్తుంది. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నంత మాత్రాన... సెక్స్‌ కోరికల్ని పాపంగానో, శాపంగానో భావించాల్సిన పన్లేదు. నిజానికి, మరింత ముదిమి మీద పడకుండా శృంగారం ఓ సౌందర్య చికిత్సలా పనిచేస్తుంది. చురుకైన సెక్స్‌ జీవనం...ముఖ్య లైంగిక అవయవాల్లో వయసుతోపాటూ వచ్చే అనారోగ్యకరమైన మార్పుల్ని నిరోధిస్తుంది. వ్యాయామం వల్ల కండరాలు బలపడినట్టు.. సెక్స్‌ కారణంగా లైంగిక వ్యవస్థ శక్తిమంతం అవుతుంది. మెనోపాజ్‌ తర్వాత కూడా, చురుకైన పడకగది జీవితాన్ని గడుపుతున్న మహిళల్లో, మిగతా వారితో పోలిస్తే యోని ద్వారం అంతగా కుంచించుకుపోదని అధ్యయనాల్లో వెల్లడైంది. అంటే... అరవై తర్వాత లైంగిక జీవితానికి పదవీ విరమణ ప్రకటిస్తే... ఆరోగ్యపరంగా నష్టపోయినట్టే. 
నిజమే... పాతికేళ్ల వయసులోని ఉత్సాహం నలభైలలో ఉండదు. నలభైల నాటి పటుత్వం అరవైలలో కనిపించదు. బడలిక పెరిగిపోతుంది. ఓపిక నశిస్తుంది. రాత్రి భోజనమో ఫలహారమో పూర్తికాగానే... నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ముద్దూ ముచ్చట్లు అటకెక్కిపోతాయి. ఏం ఫర్వాలేదు. హాయిగా నిద్రపోవచ్చు. కాకపోతే శృంగారాన్ని ఏ పగటిపూటకో షెడ్యూల్‌ చేసుకోవచ్చు. అంతా ఆఫీసులకూ కాలేజీలకూ వెళ్లిపోయి ఉంటారు కాబట్టి, ఇంట్లో బోలెడంత ఏకాంతం కూడా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే. ముద్దూముచ్చట్లు కావాలనుకుంటే.... మద్యం సీసాల్ని పక్కనపెట్టేయాలి. మద్యం లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందన్నది అపోహ మాత్రమే. ఆ మత్తు కాస్తా నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థ మీద పనిచేసి... పెద్దల్ని మొద్దునిద్దర్లోకి పంపుతుంది. ఆ దురలవాటు వల్ల దీర్ఘకాలంలో కాలేయ సమస్యలు రావచ్చు. 
ఒకప్పుడు అవలీలగా శతకాలు బాదిన సచిన్‌ కూడా... ఓ దశలో ఐదారు పరుగులకే అవుటయిపోయాడు. ప్రకృతి ఎవర్నీ ఉపేక్షించదు. ఎంతటివారైనా, వయసుతో పాటూ వచ్చే మార్పుల్ని గుర్తించాల్సిందే, హుందాగా స్వీకరించాల్సిందే. అంతేకానీ, మళ్లీ పాత రికార్డుల్ని బద్దలు కొట్టాలనో, సరికొత్త రికార్డుల్ని సృష్టించాలనో ఆరాటపడిపోకూడదు. గత వైభవాన్ని తలుచుకుంటూ ఆత్మన్యూనతకు గురికావడం కంటే... వర్తమానాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడమే ఉత్తమం.
లైంగిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే... మనసులోనే కుమిలిపోకుండా, జీవిత భాగస్వామి మీద సాకు వేయకుండా, సొంత వైద్యంతో ప్రాణాలమీదికి తెచ్చుకోకుండా... నేరుగా వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి సమస్యకూ ఏదో ఓ పరిష్కారం లభించి తీరుతుంది. ముఖ్యంగా, వయసుతో వచ్చే మార్పులు సెక్స్‌ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అందులోనూ మహిళల్లో యోని ద్వారం పొడిబారిపోతూ ఉంటుంది. దీనివల్ల కలయిక బాధాకరం అవుతుంది. ఈస్ర్టోజెన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. వైద్యుల సిఫార్సుతో అత్యాధునికమైన లూబ్రికెంట్స్‌నూ ఉపయోగించవచ్చు. వీటివల్ల కొన్నిరకాల ఇన్ఫెక్షన్లను కూడా నిరోధించవచ్చు. పురుషుల్లో వచ్చే స్తంభన సమస్యల్నీ, స్ఖలన లోపాల్నీ శక్తిమంతమైన మందులతో  అధిగమించవచ్చు. కొన్నిసార్లు, మానసికమైన ఇబ్బందులూ ఆటంకంగా మారతాయి. కౌన్సెలింగ్‌ ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. చిన్నచిన్న లైంగిక సమస్యలే.... తీవ్ర రుగ్మతలకు సంకేతాలు. భయంతోనో బిడియంతోనో విస్మరిస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. లైంగిక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడమంటే, మొత్తంగా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసినట్టే. ఆ వయసులో కలయిక ఆలూమగల మధ్య మానసిక సామీప్యాన్ని పెంచుతుంది. కుంగుబాటు లాంటి మనో రుగ్మతల్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. నీకు నేను, నాకు నువ్వు... అన్న బలమైన సంకేతాన్ని పంపుతుంది కూడా.