అబ్బాయిలోనూ లోపం ఉండొచ్చు!

ఆంధ్రజ్యోతి, 16-07-2018: పిల్లలు పుట్టలేదా? లోపం అమ్మాయిదా? అబ్బాయిదా? అమ్మాయికి పరీక్షలు చేయించారు... సరే! మరి అబ్బాయికి చేయించారా? లోపం అమ్మాయిలోనే కాదు, అబ్బాయిలోనూ ఉండొచ్చు!
 
గర్భం దాల్చడానికి భార్యాభర్తలిద్దరూ సమ బాధ్యులే! గర్భం దాల్చకపోతే అన్ని వేళ్లూ భార్యనే చూపిస్తాయి. కానీ నిజానికి పిల్లలు కలగకపోవడానికి భార్యతోపాటు భర్త కూడా కారణమే! ‘పురుషాంగం గట్టిపడి, స్ఖలనమవుతోంది కదా? నాలో లోపమేముంటుంది?’ అనుకుంటే పొరపాటు. అంతర్గతంగా ఎన్నో లోపాలుండవచ్చు. గర్భం దాల్చకుండా అడ్డుపడే అంశాలు వీర్యకణాల్లో, వీర్యనాళాల్లో, వృషణాల్లోనూ ఉండొచ్చు. కొన్ని ఇబ్బందులు స్పష్టంగా కనిపించవచ్చు. మరికొన్ని నిశ్శబ్దంగా సమస్యను జటిలం చేస్తూ ఉండొచ్చు. ఇంతకీ పురుషులను ఎప్పుడు అనుమానించాలంటే?
 
పెళ్లయ్యాక ఎటువంటి గర్భనిరోధక పద్ధతులూ పాటించకుండా సంవత్సరంపాటు భార్యాభర్తలు కలిసినా గర్భధారణ జరగకపోతే కచ్చితంగా వంధ్యత్వాన్ని అనుమానించవచ్చు. ఎటువంటి వ్యాధులూ లేని వంద జంటలు, సురక్షిత పద్ధతులు పాటించకుండా నెల రోజులపాటు ‘ఫర్టైల్‌ పీరియడ్‌’లో (నెలసరి ఆగిన 10వ రోజు నుంచి 18వ రోజు వరకు) కలిస్తే, గర్భం దాల్చే అవకాశాలు 5%నుంచి 10% ఉంటాయి. ఇలాకాకుండా 100% కచ్చితత్వం తెలుసుకోవాలనుకుంటే సంవత్సరంపాటు ఆగాల్సిందే! అప్పటికీ గర్భధారణ జరగకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించాలి. పిల్లలు పుట్టకపోవడానికి సమస్య ఎవరిలో ఉందో తెలుసుకోవడానికి దంపతులిద్దరూ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ వంశంలో ఎవరికైనా వంధత్వ సమస్య ఉంటే పెళ్లయిన వెంటనే వైద్యుల్ని కలవాలి. ఇలా పురుష వంధ్యత్వానికి కారణాలు బోలెడన్ని! అవేంటంటే....

జెనిటల్‌ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌: దీనివల్ల కొంతమందికి వృషణాల్లో నొప్పి ఉంటుంది. ఇంకొందరికి ఉండకపోవచ్చు కూడా! అందుకే ఈ రకమైన ఇన్‌ఫెక్షన్లను ‘సైలెంట్‌ ఇన్‌ఫెక్షన్స్‌’ అంటారు. ఇవి ‘సెమెన్‌ ఎనాలసిస్‌’ చేసినప్పుడు మాత్రమే బయట పడతాయి.

జీవనశైలి సమస్యలు: ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేయడం, ఆహారం, నిద్ర వేళలు సక్రమంగా పాటించకపోవడం లాంటి జీవనశైలి కూడా వంధ్యత్వానికి దారి తీయొచ్చు.

వేరికోసిల్‌: కాళ్లలో వచ్చే వెరికోజ్‌ వెయిన్స్‌ లాంటిదే ఈ సమస్య. కాకపోతే వృషణాల్లోని రక్తనాళాల్లో రక్తం ప్రవహించకుండా నిలిచిపోతుంది. ఇది కూడా నిశ్శబ్ద సమస్యే! ఎవరికి వారు తెలుసుకోవడం కష్టం.

వీర్యకణాల సమస్యలు: వీర్యకణాల రూపం సక్రమంగా ఉంటేనే అండంలోకి చొచ్చుకుపోగలవు. వాటి తల, మధ్య భాగం, తోక... వీటిలో ఏ ఒక్కటిలో లోపం ఉన్నా అండం ఫలదీకరణ కష్టమే!

స్ఖలన సమస్య: కొందరికి వీర్యనాళంలో సమస్య ఉండొచ్చు. ఇలాంటి వాళ్లు స్ఖలించలేరు. స్ఖలనమే జరగకపోతే గర్భధారణ ఎలా సాధ్యపడుతుంది?

హార్మోన్లలో హెచ్చుతగ్గులు: మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్‌.ఎస్‌.హెచ్‌ హార్మోన్‌ వృషణాలను ప్రేరేపించినప్పుడే వీర్య ఉత్పత్తి జరుగుతుంది. ఈ హోర్మోన్‌ స్రావం తక్కువగా ఉంటే వీర్యం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ శరీరంలో ఈ హార్మోన్‌ స్థాయులు ఎక్కువగా ఉంటే దానర్థం ఈ హార్మోన్‌ను వృషణాలు సరిగా ఉపయోగించుకోకపోవడమే! అలాగే టెస్టోస్ట్టెరాన్‌ హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండాలి. ప్రొలాక్టిన్‌ ఎక్కువగా ఉన్నా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గుతుంది.

వంశపారంపర్యం: వంధ్యత్వం వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. మేనరికం ద్వారా పుట్టిన పిల్లల్లో ఈ సమస్య సర్వసాధారణం. అలాగే మేనమామ, పెద్దనాన్న... ఇలా దగ్గరి రక్తసంబంధీకుల్లో వంధత్వం ఉన్నా తర్వాతి తరానికి సంక్రమిస్తుంది.

జన్యుపరమైన సమస్యలు: జన్యుపరమైన లోపాల వల్ల వంధత్వం పుట్టుకతోనే సంక్రమించవచ్చు.

సర్జరీలు: బాల్యంలో వృషణాలు, పొత్తికడుపు ప్రదేశంలో సర్జరీలు జరిగినా వంధ్యత్వాన్ని అనుమానించవచ్చు.

వ్యాధులు: కేన్సర్‌కు గురయిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులున్నవాళ్లు, స్టెరాయిడ్‌ చికిత్సలు తీసుకున్నవాళ్లను కూడా వంధ్యత్వం వేధించవచ్చు.

ప్రమాదాలు: కొందరికి రోడ్డు ప్రమాదాల వల్ల వీర్యనాళానికి గాయమై, మూసుకుపోవచ్చు. వెన్నుముకకు దెబ్బ తగిలితే ఎజాక్యులేటరీ సిస్టమ్‌ దెబ్బతింటుంది.

మంచానికే పరిమితమయ్యే రోగులు: వీరిలో వృషణాల్లోనే వీర్యం మిగిలిపోతూ, ఇన్‌ఫెక్షన్లకు దారి తీయొచ్చు.

ధూమపానం, మద్యపానం: ధూమపానం వల్ల వీర్యకణ నాణ్యత, వీర్య ఉత్పత్తుల మీద నేరుగా ప్రభావం పడుతుంది. దాంతో వీర్యం దెబ్బతింటుంది. మద్యపానం వల్ల హార్మోన్లలో అవకతవకలు జరిగి వంధత్వం వస్తుంది. చికిత్సలో భాగంగా తీసుకునే మందుల ప్రభావం కూడా మద్యపానం వల్ల తగ్గుతుంది. కాబట్టి వంధ్యత్వానికి మందులు వాడుతూ ఉంటే మద్యపానానికి దూరంగా ఉండాలి.

బిగుతైన లోదుస్తులు: వీటి వల్ల కటి ప్రదేశంలో వేడి పెరిగి, ఆ కారణంగా వీర్యనష్టం జరగవచ్చు.

ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లు: ల్యాప్‌ టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే అలవాటు మానుకోవాలి. అలాగే సెల్‌ ఫోన్‌ను ప్యాంటు ముందు జేబులో ఉంచుకోవడం వల్ల రేడియేషన్‌ ఫలితంగా వంధ్యత్వం రావొచ్చు.

పరీక్షల్లో తేలిపోతుంది
సెమెన్‌ ఎనాలసిస్‌: ఇది ప్రథమ పరీక్ష. దీన్లోనే వీర్యం నాణ్యత, వీర్యకణాల రూపంలో సమస్యలు తెలిసిపోతాయి.
హార్మోన్‌ టెస్ట్‌: ఈ పరీక్షతో టెస్టోస్టెరాన్‌, ఎఫ్‌.ఎస్‌.హెచ్‌, ప్రొలాక్టిన్‌ హార్మోన్ల లెక్కలు తేలిపోతాయి.
టెస్టిస్‌ స్కానింగ్‌: వృషణాల్లో వెరికోసిల్‌ ఉన్నా, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు ఉన్నా తెలుసుకోవచ్చు.
మార్ఫాలజీ: వీర్యకణాల సంఖ్య, వాటి కదలికలు, ఆకారం గురించిన వివరాలు ఈ పరీక్షతో తెలుసుకోవచ్చు.

చికిత్సలివే!

సమర్థమైన చికిత్సతో 75% మంది రోగుల్లో వంధ్యత్వాన్ని పూర్తిగా నివారించవచ్చు. మిగతా 30% రోగుల్లో జన్యుపరమైన సమస్యలుంటాయి కాబట్టి వాటిని సరి చేయడం కుదరదు. వీర్యం తయారైనా బయటకి రావడానికి అడ్డంకులుంటే, లేదా వీర్యమే తయారవకుండా ఉంటే, వీర్య కణాల్లోనే లోపాలుంటే... సమస్యనుబట్టి చికిత్స చేయొచ్చు. జెనిటల్‌ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్లుంటే వాటిని నోటి మాత్రలతో తగ్గించవచ్చు. వేరికోసిల్‌, వీర్యనాళంలో సమస్యలుండి స్ఖలన సమస్యలుంటే సర్జరీతో సరిదిద్దవచ్చు. హోర్మోన్ల హెచ్చుతగ్గులు, ఇన్‌ఫెక్షన్లను మందులతో నయం చేయవచ్చు. ఓపెన్‌ సర్జరీ, లాప్రోస్కోపిక్‌ సర్జరీలకు కాలం చెల్లింది. ఇప్పుడు ‘మైక్రో సర్జరీ’తో రోగిని ఒక్కరోజులోనే ఇంటికి పంపించే సౌలభ్యం ఉంది. ఈ సర్జరీ చవకైనది, సురక్షితమైనది, ప్రభావవంతమైనది.
 
అంతవరకూ ఓపిక పట్టాలి!
ఒక వీర్యకణం తయారీకి 60 నుంచి 70 రోజుల సమయం పడుతుంది. పుట్టి మహిళ శరీరంలోకి స్రవించిన వీర్యకణం దేహంలో 5 రోజులపాటు బ్రతికే ఉంటుంది. కాబట్టి వంధత్వానికి చేసే చికిత్స ఫలించి వల్ల గర్భం దాల్చడానికి కనీసం రెండున్నర నెలల నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. చికిత్స మొదలు పెట్టేశాం కదా! ఫలితం 10 నుంచి 15 రోజుల్లో వస్తుందని ఊహించుకోవడం కరెక్టు కాదు. కొంతకాలంపాటు మందులు వాడేసి, ఆ మందులు నిష్ప్రయోజనమని నిర్ధారణకొచ్చి వదిలేయడం కూడా సరి కాదు. చికిత్సతో సమస్య సరిదిద్దినా, వీర్యకణం తయారవడానికి ఇంతకాలం పడుతుంది కాబట్టి గర్భధారణకు అంతకాలం పాటు మందులు వాడుతూ ఓపికగా వేచి ఉండాలి.
 
వీర్యకణాల లెక్కలివే!
వీర్య కణాల సంఖ్య, వాటి కదలికల గురించి సర్వత్రా ఎన్నో అనుమానాలున్నాయి. అయితే, 2010లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ఆధారంగానే సమస్య తీవ్రతను లెక్కించుకోవాలి. ఇంతకుముందు వీర్యకణాల సంఖ్య 60 మిలియన్లు ఉంటేనే గర్భధారణ సాధ్యం అనే పద్ధతి అనుసరించేవారు. కానీ ఇప్పుడు ఇంతకంటే తక్కువ సంఖ్యలో ఉన్నా ఎటువంటి ఇబ్బందీ లేకుండా పిల్లల్ని కనొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటంటే...

ఒక మిల్లీ లీటరు వీర్యంలో...

15 మిలియన్ల వీర్య కణాలుంటే చాలు.
వీర్యకణాల కదలికలు కనీసం 32% ఉండాలి.
బ్రతికి ఉన్న వీర్యకణాల సంఖ్య - 58
వీర్యకణాల నిర్మాణం - 4% 
 
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌