పదహారేళ్ల ‘కలలు’!

పాపం! ఆ కుర్రాడు భయపడిపోయాడు. ఇండియా మ్యాప్‌ వేసినట్టు అండర్‌ వేర్‌ మీద మరకలు. ఒకరోజు, రెండ్రోజులు కాదు. వారం నుంచీ ఇదే వరస. గాఢనిద్రలో... ఏవేవో కలలు! మళ్లీ మళ్లీ రావాలనిపించే కలలు!

ఓ క్షణం తీయని విద్యుదాఘాతం! 
అంతలోనే... కరిగిపోయిన కలకు గుర్తుగా, సిరంజితో పిచికారీ చేసినట్టు కాస్తంత తడి. 
ఇదంతా, ఎవరితో చెప్పుకోవాలి? స్నేహితులతో పంచుకోడానికి జంకు. అమ్మకు చెప్పడానికి బిడియం. తండ్రితో మాట్లాడాలంటే భయం. ఆ ఆలోచనలతో చదువు వెనకబడిపోయింది. పాఠాలు తలకెక్క లేదు. వారాంతపు పరీక్షలో అత్తెసరు మార్కులు వెక్కిరించాయి.
ప్రిన్సిపల్‌ నుంచి నాన్నకు ఫోన్‌ వెళ్లిపోయింది. 
‘పదో తరగతిలో స్టేట్‌ టాపర్‌. ఇంటర్‌ ఫస్టియర్‌లో బ్యాచ్‌ టాపర్‌. 
ఇప్పుడు... సున్నా! సిగ్గుగా ఉంది. పరువు తీస్తున్నావ్‌?’ - నాన్న దోషిని చేసి మాట్లాడుతుంటే దుఃఖం పొంగుకొచ్చింది. ఏడుపుతో పాటు నిజమూ బయటికొచ్చింది. 
చెప్పేశాడు. అంతా చెప్పేశాడు.
చెప్పేసి, గుండెలోని బరువంతా దించేసుకున్నాడు. మరుక్షణం నుంచీ, ఆమేరకు తండ్రి గుండెల్లో బరువు పెరిగిపోయింది. ఆయనా కౌమారాన్ని ఈది వచ్చినవాడే. కానీ, కొడుకు విషయానికి వచ్చేసరికి.... అదో తీవ్ర సమస్యలా అనిపించింది. నా దగ్గరికి తీసుకొచ్చాడు. తండ్రీకొడుకుల్ని కూర్చోబెట్టి, కౌమారంలో వచ్చే శారీరక మార్పుల గురించి వివరించాను. 
స్వప్నస్ఖలనాలు యవ్వనారంభంలో మొదలవుతాయి. టెస్టోస్టెరాన్‌ హార్మోను ఉత్పత్తి మొదలైన ఏడాది తర్వాత... అబ్బాయిల్లో లైంగిక, పునరుత్పత్తి వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఆడపిల్లల్లోని రుతుస్రావంతో అబ్బాయిల స్వప్నస్ఖలనాన్ని పోల్చవచ్చు. బాలిక ఫలానా వయసులోనే పుష్పవతి అవుతుందని చెప్పలేం. వాతావరణ పరిస్థితుల మీదా, శరీర స్వభావం మీదా అదంతా ఆధారపడి ఉంటుంది. స్వప్న స్ఖలనాలూ అంతే. ఓ ఏడాది అటూ ఇటుగా... పదమూడేళ్ల వయసులో మొదలవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 
స్వప్నస్ఖలనం ఓ ఆరోగ్యకర పరిణామం. 
అయితే ఒక షరతు. పట్టుమని పదేళ్లు కూడా లేకుండానే స్వప్నస్ఖలనాలు ప్రారంభం అయితే మాత్రం.. అది కచ్చితంగా హార్మోన్ల సమస్యే. దీన్ని వైద్య పరిభాషలో ‘ప్రికాషియస్‌ ప్యూబర్టీ’ అంటారు. కౌమార ఆరంభంలో స్వప్న స్ఖలనాలు మహా ఉద్ధృతంగా ఉంటాయి. క్రమక్రమంగా... తగ్గుతాయి. ఆ వయసులో ప్రతి బాలుడూ అనుభవించే స్థితే ఇది. లైంగిక విషయాల్ని ప్రస్తావించడమే మహాపాపం అనుకునే కుటుంబాల్లోని... కౌమార బాలలు ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకాక బెంబేలెత్తిపోతుంటారు. అపరాధభావంతో కుంగిపోతుంటారు. 
ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. బాల్యం నుంచి యవ్వనం దిశగా... బాలుడి పరిణామక్రమంలో ఇదంతా భాగమని గ్రహిస్తున్నారు. పూర్వం స్వప్నస్ఖలనాన్ని మహా పాపంగా పరిగణించేవారు. ఆ తప్పుకు శిక్షగా రోజంతా ఉపవాసం ఉండాలంటూ శిక్ష విధించేవారు.
మూడు దశాబ్దాల క్రితం దాకా... వైద్యుల్లోనూ అవగాహన తక్కువే. వారంలో ఒకసారికి మించి స్వప్నస్ఖలనం జరిగితే కనుక... దాన్నో రుగ్మతగా తీర్మానించేవారు. 
నిజానికి, మగవాడి శరీరం... కౌమారం నుంచీ వీర్యాన్ని నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఏదో ఓ రూపంలో అదంతా బయటికి పోవాల్సిందే. లైంగిక చర్య, హస్తప్రయోగం... ఈ రెండు మార్గాలూ అందుబాటులో లేకపోతే, స్వప్నంలో స్ఖలిస్తుందంతే! ఓ స్థాయిని మించాక... శరీరానికి వీర్యాన్ని నిల్వ ఉంచడం సాధ్యం కాదు. బకెట్‌ నిండిపోయాక... నీళ్లు పారినట్టే, వీర్యమూ ఒలికిపోతుంది.
నా వివరణ విన్నాక... తండ్రీకొడుకుల మొహాల్లో ఆందోళన తగ్గింది. మనశ్శాంతిగా వీడ్కోలు తీసుకున్నారు. 
ఆ కుర్రాడి భుజం మీద చేయి వేసి చెప్పాను...
‘గుడ్‌ నైట్‌’!