‘కాల్పనిక’ శృంగారం!

ప్రవాస దంపతులు నా ముందు కూర్చున్నారు.
అతడికి ఆమె అంటే ఇష్టం. ఆమెకు అతడంటే ప్రాణం. లైంగిక జీవితం సాఫీగా సాగుతోంది. ఇతరత్రా సమస్యలూ లేవు. ఒక్క విషయం మాత్రం, ఆమెను స్థిమితంగా ఉండనీయడం లేదు. 
నిజమే, అతను మంచి భర్తే. ప్రేమగా ఏలుకుంటాడు. ఏకాంతంలో ఏకాంతకూ దక్కని అనుభూతులు పంచుతాడు. వరుస భావప్రాప్తులతో వలపు అభిషేకాలు చేస్తాడు. అలాంటి మొగుడు దొరకడం అదృష్టమే.
కానీ... కానీ...
ముద్దుపెట్టుకునేది తన పెదాల్నే. ఊహించుకునే అధరాలేమో ఇంకొకరివి. తపనతో తడిమేది తన తనువునే. తలపుల్లో  ఇంకెవరి ఎత్తుపల్లాలో. ఒక్కమాటలో చెప్పాలంటే... ‘భౌతికంగా’ మాత్రమే తను లైంగిక భాగస్వామి. ‘మానసికంగా’ ఆ స్థానంలో ఎవరో, మరెవరో!
కొన్నిసార్లు...
అందాల సినిమా తార కావచ్చు.
కొన్నిసార్లు...
టీవీ సీరియల్‌లో హీరోయిన్‌ కావచ్చు.
కొన్నిసార్లు...
కొత్తగా ఉద్యోగంలో చేరిన కొలీగ్‌ కావచ్చు.
కొన్నిసార్లు...
పోర్న్‌ వీడియోలో నాయికా కావచ్చు. 
‘చెప్పండి డాక్టర్‌? ఇంతకు మించిన నరకం ఉంటుందా? మీరే ఏదో ఓ పరిష్కారం సూచించాలి. లేకపోతే, విడాకులు తప్పించి నాకు మరో మార్గం లేదు’... కన్నీళ్లపర్యంతం అవుతోంది ఆమె. 
లైంగిక కల్పనలు అసహజమేం కాదు. అసాధారణమూ కాదు. మనిషి మనస్తత్వంలో అదంతా ఓ భాగమే. ఆ ధోరణి ప్రవాస దంపతుల పడకగదికి మాత్రమే పరిమితం కాలేదు. బ్రెట్‌ ఖర్‌ అనే బ్రిటిష్‌ సైకోథెరపిస్ట్‌ సెక్సువల్‌ ఫాంటసీస్‌ మీద లోతైన పరిశోధన చేశారు. ‘ఊహ మనిషి జీవితంలో ఓ భాగం. నిద్రాణమైన కోరికలే కల్పనలుగా మారతాయి. మనం కోరుకున్నవన్నీ అందుకోలేం. ఇష్టపడినవన్నీ దక్కించుకోలేం. నిజ జీవితంలో పొందలేని వాటిని, కాల్పనిక ప్రపంచంలో అంది పుచ్చుకుంటాం. కల్పనకు పరిమితుల్లేవుగా! ఆ ఊహాత్మక ప్రపంచంలో కథా రచయితవి నీవే, దర్శకుడివి నీవే, కథా నాయకుడివి కూడా నీవే. వయసుతో పాటు లైంగికతా పెరుగుతుంది. లైంగికతతో పాటూ లైంగిక కల్పనలూ పెరుగుతాయి. జీవితచక్రంలో ఇదో భాగం’ అంటారాయన. 
‘సెక్స్‌ ఇన్‌ అమెరికా’ అధ్యయనం ప్రకారం... యాభైనాలుగు శాతం మంది పురుషులూ, పందొమ్మిది శాతం మంది స్ర్తీలూ లైంగిక కల్పనలతోనే సంతృప్తిని పొందుతుంటారు. యూనివర్సిటీ ఆఫ్‌ వెర్మంట్‌కు చెందిన సైకాలజీ ప్రొఫెసర్‌ హరోల్డ్‌ ల్యుటెన్‌బర్గ్‌ సర్వే ప్రకారమైతే... దాదాపు ఎనభై అయిదుశాతం దంపతులు శృంగార సమయంలో మనసులో ఇంకెవరి రూపాన్నో ఊహించుకుంటారు. 
సెక్సువల్‌ ఫాంటసీస్‌ నైతికమా, అనైతికమా అన్న చర్చ పక్కన పెడితే, మిగతావారితో పోలిస్తే శృంగారంలో కాల్పనికతను జోడించుకునే వారిలోనే లైంగిక సంతృప్తి ఎక్కువనీ, వారిలో లైంగిక సమస్యలు నామమాత్రమనీ ల్యుటెన్‌ బర్గ్‌ చెబుతారు. 
ఆడ, మగ... ఒక్కొక్కరి కాల్పనిక జగత్తు ఒక్కోలా ఉంటుంది. ఆ సమయంలో మనసు తెర మీద మెరిసి మాయమైపోయే పాత్రలూ వేరువేరుగానే ఉంటాయి. మహిళ తనకు బాగా తెలిసిన వ్యక్తుల్నే ఊహల్లోకి ఆహ్వానిస్తుంది. అతను మాత్రం... బొత్తిగా పరిచయం లేని సినిమాతారల్నీ ఫ్యాషన్‌ మోడళ్లనీ కాల్పనిక శృంగార నాయికలుగా ఎంచుకుంటాడు. 
ఆధునిక వైద్యులు వలపు కల్పనల్ని లైంగిక చికిత్సలో ఓ భాగంగా ఉపయోగించుకుంటున్నారు. లైంగిక నిరాసక్తతను పారదోలడంలో కల్పనలు తిరుగులేని ఔషధంగా ఉపయోగపడతాయి. పడకగది అనుభూతులు పాతబడిపోకుండా... కొత్తకొత్త తలపులతో ఉద్రేకపరుస్తాయి. లైంగిక ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తాయి. కానీ, ఈ ప్రయోజనాలకు ఓ పరిమితీ ఉంది. శృంగార జీవితమంతా కల్పనల చుట్టే తిరగడమూ ఏమంత మంచి పరిణామం కాదు. ఆ ఉత్ర్పేరకం కరువైతే, శరీరం స్పందించడం ఆపేస్తుంది. ఏ కారణంచేతో... కల్పనలు ఆగిపోతే, శృంగారానికి ముగింపు పలకాల్సిందే. కల్పనలు హద్దులు దాటనన్ని రోజులూ, బుర్రలో నేరస్వభావం తొంగి చూడనంత కాలమూ... కాల్పనిక శృంగారం హానికరమేం కాదు. ఇలాంటి విషయాల్లో మనకు మనమే సెన్సార్‌బోర్డు. ఎక్కడ కత్తెర వేయాలో తెలిస్తే చాలు. 
ప్రవాస దంపతులకూ అది అర్థమైనట్టుంది. చిరునవ్వుతో వీడ్కోలు తీసుకున్నారు.