ముద్దంటే చేదా...

‘మా ఆవిడకు నేనంటే ఇష్టం లేదు. నన్ను దగ్గరికి రానివ్వదు. తనతో నాకెలాంటి సుఖమూ లేదు. కనీసం ముద్దుపెట్టుకోనివ్వదు’
ఆ యువకుడి ఫిర్యాదును సావధానంగా విన్నాను. 
‘మీ అభిప్రాయం ఏమిటి?’ అన్నట్టుగా ఆమె వైపు చూశాను.
ముందు మాట్లాడలేదు. ఆతర్వాత నోరు విప్పింది.
‘తనకి ముద్దు పెట్టుకోవడం కూడా తెలియదు డాక్టర్‌. నోట్లోంచి మహా దుర్వాసన. ఆయన ముద్దుల్ని భరించడమంటే డ్రైనేజీలో స్నానం చేసినట్టే’... తీవ్ర స్వరంలో జవాబు ఇచ్చింది.
ఆమె మాటలకు ఆ కుర్రాడు మరింత చిన్నబుచ్చుకున్నాడు.
నిజమే, ఎవరూ పుట్టుకతోనే చుంబన విద్యలో ఆరితేరిపోరు. ‘ఎలా ముద్దు పెట్టుకోవాలి?’ అన్న పాఠం ఏ యూనివర్సిటీలోనూ బోధించరు. ఎవరికివారు ఆ ఒడుపులు తెలుసుకోవాల్సిందే. పడకగదిని ప్రయోగశాలగా మార్చుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ముద్దూముచ్చట్లే ఆలూమగల ప్రేమ వ్యక్తీకరణ మార్గాలు. శృంగార ద్వారానికి చుంబనమే తాళం చెవి. మన్మథ సామ్రాజ్యం వైపుగా... ఒక్కో ముద్దు ఒక్కో అడుగు. ముద్దులు కూడా చప్పట్ల లాంటివే. రెండు చేతులూ కలిసినట్టు... రెండు పెదాలూ పెనవేసుకోవాలి. 
‘నువ్వంటే ప్రాణం’, ‘నువ్వే నా సర్వస్వం’, ‘నీతోనే జీవితం’
ఇన్ని మాటలు ఎందుకు?
మల్లెలు, గులాబీలు, మందారాలు...
ఇన్ని పూలు ఎందుకు?
రవ్వల నెక్లెస్‌, వడ్డాణం, వజ్రపుటుంగరం....
ఇన్ని బహుమతులు ఎందుకు?
ముత్యమంత ముద్దు చాలు. అంతకు మించిన ప్రేమ కానుక లేదు. దాన్ని మించిన ప్రేమ వ్యక్తీకరణ మార్గం లేదు.
ముద్దు... రెండు పెదాల్నే కాదు, రెండు మనసుల్నీ దగ్గర చేస్తుంది. ప్రేమించుకునే రోజుల్లో, ఓ చిన్న ముద్దు కోసం ప్రేమికుడు పెద్ద తపస్సే చేస్తాడు. ప్రేయసి కరుణించిందా ప్రపంచాన్ని గెలిచినంత సంబరం! పెళ్లయిన కొత్తలో పెద్దల కళ్లుగప్పి ముద్దుల పెళ్లాన్ని ముద్దు పెట్టుకోడానికి కొత్త పెళ్లికొడుకు ఎన్ని తిప్పలు పడతాడో! దొంగచాటు ముద్దులు భలే రుచి.
బాధ్యతలు పెరిగేకొద్దీ, కాలం గడిచేకొద్దీ శృంగార జీవితం మొద్దుబారి పోతుంది. ఆలింగనచుంబనాలు అటకెక్కుతాయి. నిజానికి, ముద్దును మించిన శృంగార ఉద్దీపన మార్గం లేదు. భోజనానికి ముందు సూప్‌ తాగడం పాశ్చాత్య సంప్రదాయం. దీనివల్ల ఆకలి పెరుగుతుందని అంటారు. ఆమాటకొస్తే శృంగారానికి ముద్దూ... సూప్‌ లాంటిదే. వలపు ఆకలిని రగిలిస్తుంది. సంభోగం తర్వాత... మళ్లీ అంతటి ఆనందాన్నిచ్చే శృంగార చర్య ముద్దేనంటారు సెక్సాలజీ పరిశోధకులు. ఓ రచయిత అయితే, ఇంకాస్త ముందుకెళ్లి... రెండు శరీరాల కలయిక కంటే రెండు పెదాల కలయికే అద్భుతమంటూ... ముద్దుకు ‘పెదాల రతి’ అనే రొమాంటిక్‌ పేరు పెట్టాడు. ఆ ప్రణయ సాగర మథనంలో పుట్టుకొచ్చేదే అధరామృతం. తాళ్లపాక అన్నమాచార్యులు దీనికో అచ్చ తెలుగు మాట కనిపెట్టారు... మోవి తేనె! 
ముద్దును ఓ కళగా గుర్తించిందీ చుంబనానికి శాస్త్ర ప్రతిపత్తిని తీసుకొచ్చిందీ భారతీయులే. కామసూత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించాడు వాత్స్యాయనుడు. ఆ ఆచార్యుడు ముద్దుల్లోని రకాల్ని వివరించాడు. ముద్దుని ఓ ఆటలానూ ఆడుకోవచ్చంటూ రకరకాల ముద్దులాటల్ని పరిచయం చేశాడు. మనిషిని బట్టి మనస్తత్వాలూ, మనస్తత్వాన్ని బట్టి ముద్దులూ మారుతుంటాయని విశ్లేషించాడు.
ముద్దులోని మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దంతాల్ని శుభ్రంగా తోముకోవాలి. పడకమీదికి వెళ్లే సమయంలో దంతధావనం తప్పనిసరి. శృంగారానికి కాస్త ముందు... ధూమపానం, గుట్కా మొదలైన వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆ వ్యసనాల్ని పూర్తిగా వదిలేస్తే ఇంకా మంచిది. ముద్దుల్లో ముంచెత్తడమే కాదు, భాగస్వామికి కూడా ముద్దుపెట్టుకునే అవకాశం ఇవ్వాలి. బిడియాన్ని తొలగించాలి. ముద్దు వైపుగా ప్రోత్సహించాలి, రెచ్చగొట్టాలి. 
ముద్దు కూడా ఓ భాషే... మౌనభాష! మనసు పెట్టి వింటే... అందులోనూ బోలెడంత అర్థం స్ఫురిస్తుంది. ఆ పెదాల కదలిక మీద పట్టు సాధించారా... 
పడకగదే ఓపెద్ద వాత్స్యాయన గ్రంథం అవుతుందిక!