పడకగదిలో...‘పెగ్గు’ వైద్యమా?

‘మామా మంచి సెక్సాలజిస్టు ఎవరైనా ఉన్నారా?’
‘సమస్య ఏమిటి?’
‘ఏం చెప్పమంటావ్‌ మామా! అంతా బాగానే ఉంటుంది. గోల్‌ చేయడమే ఆలస్యమని అనుకుంటాను. అంతలోనే, హఠాత్తుగా మెత్తబడిపోతాను. తను చికాకుపడుతోంది’
‘అంగస్తంభన సమస్య అన్నమాట. ఇంగ్లిష్‌లో అయితే... ఎరక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌. ఎన్నాళ్ల నుంచీ’
‘ఓ ఆర్నెల్లు అవుతోంది’
‘ఎప్పుడూ చెప్పలేదే! ఓపని చెయ్‌..’
- ఇలా సాగుతోంది ఆ మిత్రుల సంభాషణ.
ప్రతి బ్యాచులో ఓ ‘సెక్స్‌ గురు’ ఉంటాడు. వాత్స్యాయన కామసూత్రాల్ని నమిలి మింగేసినట్టు పోజు కొడుతుంటాడు. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ పేరు ఊతపదంలా వాడేస్తుంటాడు. సెక్సాలజిస్టులకే సెక్సాలజిస్టునంటూ ఉపన్యాసాలు ఊదరగొడుతుంటాడు. అడగడమే ఆలస్యం, అడక్కపోయినా... ఉచిత సలహాలు గుప్పించేస్తుంటాడు. అంతా మిడిమిడి జ్ఞానమే.
అలాంటి సంభాషణల్లో ఇదీ ఒకటి.
‘....ఏ సెక్సాలజిస్టు దగ్గరికీ వెళ్లాల్సిన పన్లేదు. చికిత్స కోసం వేలకువేలు ఖర్చుపెట్టాల్సిన అవసరమే లేదు. ఒకటే మందు... విస్కీ’
‘వి...స్కీ‘
‘అవునోయ్‌. బెడ్‌రూమ్‌లోకి వెళ్లేముందు ఒకట్రెండు పెగ్గులు వేసుకో. తేడా నీకే అర్థం అవుతుంది. మన జూనియర్‌ శ్యామ్‌గాడికి కూడా సేమ్‌ ప్రాబ్లమ్‌. విస్కీతో సాల్వ్‌ అయిపోయింది. వాడి ఫ్రిజ్‌లో ఎప్పుడూ రెండు ఫుల్‌బాటిల్స్‌ ఉంటాయ్‌’ 
ఆ రోజు రాత్రి...
రెండంటే రెండు పెగ్గులే తాగాలని మొదలుపెట్టి, సగం సీసా ఖాళీ చేశాడా యువకుడు. తూలుతూ పడకగదిలోకి వెళ్లాడు. అంతకు ముందు... బండి తొందరగానే స్టార్టయ్యేది. కొంతదూరం వెళ్లాక ఆగిపోయేది. ఇప్పుడు... ఎంత కిక్కు కొట్టినా... కదలికే లేదు. అసలుకే మోసం.. అంటే ఇదే! 
మద్యం మనసులో కోరికను పెంచుతుందేమో కానీ, శరీరంలో సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. సామర్థ్యం లేని కోరిక... కత్తి లేని యుద్ధం లాంటిది. నిరుపయోగం. మద్యం మహా ప్రమాదకరం. దీర్ఘకాలంలో లైంగిక సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. నేరుగా మెదడు మీద పనిచేస్తాయి మత్తు పదార్థాలు. ఫలితంగా, కేంద్ర నాడీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. మన మీద మనకు నియంత్రణ ఉండదు. ఏ సమయంలో ఎలా స్పందించాలనే స్ప్పహ తగ్గిపోతుంది. దీంతో జీవితభాగస్వామికి ఇబ్బంది కలగవచ్చు. ఇవన్నీ శృంగారానికి శత్రువులే. లైంగిక సామర్థ్యం సాకుతో అలవాటు చేసుకున్నది కాస్తా... తీవ్ర వ్యసనంగా మారుతుంది. సీసా ఎత్తనిదే మంచం ఎక్కలేని పరిస్థితి వస్తుంది. 
మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. పురుషత్వ హార్మోను టెస్టోస్టెరాన్‌ను నియంత్రించేది కాలేయమే. అక్కడ ‘మెటబాలైజేషన్‌’ ప్రక్రియ సరిగా జరగకపోతే.... టెస్టోస్టెరాన్‌ నిల్వలు నిండుకుంటాయి. ఫలితంగా పురుషాంగానికి రక్తప్రసరణ తగ్గిపోతుంది. అంగస్తంభన సమస్యలు మొదలవుతాయి. మహానగరాల్లో పబ్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. అమ్మాయిలు కూడా మద్యం మత్తులో ఊగిపోతున్నారు. ఇదేమంత ఆరోగ్యకరమైన పరిణామం కాదు. 
ఆడ అయినా, మగ అయినా... లైంగిక సమస్యలు ఉంటే... బార్‌ ఫ్రెండ్‌ను కాదు కలవాల్సింది... నిపుణుడైన సెక్సాలజిస్టును! అంగస్తంభన సమస్య ఉత్పన్నం అయినప్పుడు ఆ విషయాన్ని చర్చించాల్సింది ‘లవ్‌ గురు’తో కాదు, జీవిత భాగస్వామితో! అలాంటి సమయంలో ఆమె పరిపూర్ణ సహకారం చాలా అవసరం. అసలు ఆటకు ముందు ‘ఫోర్‌ ప్లే’కు ఇంకాస్త ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. 
వలపు మత్తు ముందు....
  మద్యం మత్తు దిగదుడుపే!
కాబట్టి, మందుబాబులూ మద్యం మత్తు వదిలించుకోండి. మీ నిర్ణయం తెలిస్తే జీవిత భాగస్వామి సంతోషిస్తుంది, ఇంకాస్త.... సంతోషపెడుతుంది.
గ్లాసుల గలగలలు లేకుండానే... 
  ఛీర్స్‌ చెప్పుకోవచ్చు.
రెండు పెదాలతో, రెండు శరీరాలతో!