మలినాలే వ్యాధి మూలం

08-08-2017: పుట్టినప్పుడు ఏ శిశువైనా స్ఫటికంలా, కడిగిన ముత్యంలాగే ఉంటాడు. ఎప్పుడో అరుదుగా తప్ప పుట్టుకతోనే జబ్బులు ఉండడం జరగదు. అయితే అంత టి నిర్మలమైన శరీరాల్లో రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్కటిగా హానికారకాలేవో పోగవుతాయి.

 
జాగ్రత్తపడకపోతే శరీరాలు ఒక దశలో రోగాల పుట్టలైపోతాయి. దీనికంతా మధ్యలో వచ్చి చేరే మలినాలే కారణం. ఈ మలినాల్లో కొన్ని వాతావణ కాలష్యాల్లోంచి వచ్చి చేరితే, మరికొన్ని అతడు తీసుకునే ఆహార పానీయాల తాలూకు వ్యర్థాల్లోంచి వచ్చి చేరతాయి.
వాస్తవానికి శరీరంలో ప్రకృతి సహజంగానే మలినాలను తొలగించే ఒక బలమైన వ్యవస్థ ఉంది. అయితే, వివిధ కారణాల చేత ఒక్కోసారి ఈ వ్యవస్థ శరీరంలోని మలినాలను పూర్తి స్థాయిలో బయటికి పంపించలేకపోవచ్చు. అలాంటి స్థితిలోనే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. అందుకు దారితీసే తీవ్రమైన కారణాల విషయం అలా ఉంచితే అతి సాధారణ కారణాలు కూడా శరీరాన్ని విషతుల్యంగా మారుస్తాయి. ఉదాహరణకు శరీరానికి అవసరమైన పోషకాల పరిమాణం తగ్గినా, ఉండవలసిన దానికన్నా పెరిగినా అవి విషతుల్యంగా మారతాయి. ఈ విషపదార్థాలన్నీ ప్రాణాంతకం కాకపోవచ్చు. కానీ, జీవ క్రియలకు ఎంతో కొంత అవరోధంగా మారతాయి. శరీరాన్ని ఆ మేరకు రోగగ్రస్ధంగా మారుస్తాయి.
 
స్థాయీ భేధాలు
ఆయుర్వేదం ప్రకారం అనారోగ్యానికి మూలాలు రెండు రకాలు. ఒకటి దోష స్థాయి, రెండవది వ్యాధి స్థాయి. సాధారణంగా దోషస్థాయిలో ఏ వ్యత్యాసాలూ బయటికి కనపడవు. అవి వ్యాధి రూపం ధరించిన పిదపే దాని లక్షణాలు కనిపిస్తాయి. అయితే, శరీరంలోని అపసవ్యతలను దోష స్థాయిలోనే కనిపెట్టే విధానం ఆయుర్వేదంలో ఉంది. ఈ శాస్త్రం ప్రకారం వాతం, పిత్తం, కఫం అంటూ దోషాలు మూడు రకాలు. ఈ మూడూ మానసిక స్థాయిలోనూ, శారీరక స్థాయిలోనూ ఉంటాయి. నిజానికి వాత, పిత్త, కఫాలు శరీర చలనశక్తికి తోడ్పడేవే. ఇవి కూడా ధాతువులే! అందుకే ఇవి శరీర నిర్మాణానికీ, దాని పనితనానికీ తోడ్పడతాయి. కాకపోతే వీటిది చంచల ప్రవృత్తి. మనం తీసుకునే ఆహారం, మన చర్యలు, ఆలోచనలను బట్టి ఇవి పూటపూటకూ మారుతూ ఉంటాయి. వీటిలో వచ్చే మార్పులూ, హెచ్చుతగ్గులే శరీరం వ్యాధిగ్ర స్థం కావడానికి కారణమవుతాయి. అందుకే వీటిని దోషాలుగా గుర్తిస్తారు. ఏమైనా శరీరంలో పేరుకుపోయే అనవసర అంశాలు, వ్యర్థపదార్థాలే ఈ దోషాలకు ప్రధాన కారణం.
 
ఆమం... రోగాల హోమం
మనం తీసుకునే ఆహార పదార్థాలు సంపూర్ణంగా జీర్ణం కానప్పుడు శరీరంలో వ్యాధికారకమైన ‘ఆమం’ పుడుతుంది. దీన్నే ‘ఆమవాతం’ అని కూడా అంటారు. దీనివల్ల శరీరానికి హాని చేసే పలురకాల ఆమదోషాలు తలెత్తుతాయి. పైగా ఆహార పదార్థాలు సగం-సగంగా జీర్ణమైనప్పుడు వాటిల్లోని ఉపయుక్త అంశాలు, వ్యర్థ అంశాలు పూర్తి స్థాయిలో విడిపోవు. రెండూ కలగలిసిపోయి శరీరాన్ని విషతుల్యం చేస్తాయి. పైగా, జీర్ణం కాని ఆహార పదార్థాలు శక్తిగానూ మారలేవు. పూర్తిగా విసర్జించ నూబడవు. ఇలా విసర్జితం కానివన్నీ శరీరంలో దీర్ఘకాలికంగా ఉండిపోతే, పలు రకాల వ్యాధులు మొదలవుతాయి. దీనికి తోడు ఆమానికి శరీరంలోని శ్రోతసుస్సుల్ని మూసివేసే లక్షణం ఉంది. ఈ క్రమంలో రక్తనాళాలు, సిరలు, దమనులే కాకుండా కణానికీ కణానికీ మధ్య ఉండే అతి సూక్ష్మ దారులు కూడా మూసుకుపోతాయి. దీనివ ల్ల జీవక్రియలు కుంటుపడటంతో పాటు, జీవశక్తి అడుగంటిపోతుంది.
 
విషకారకాలు:
నిర్ణీతకాలంలో మలం విడుదల కాకుండా శరీరంలోనే ఉండిపోతే శరీరం కలుషితమైపోతుంది. అన్నిటికన్నా మించి రక్తం మలినమవుతుంది. వ్యర్థపదార్థాలు నిలిచిపోతే అవి శరీరం లోని చలన శక్తికి అడ్డుపడుతూ ఉంటాయి. శరీరంలో వివిధ దశల్లో దేహక్రియలు నిరంతరం సాగుతూ ఉంటాయి. విషపదార్థాలు ఏ ఒక్క దశను ఆటంకపరిచినా మిగతా దశల మీద కూడా ఆ దుష్ప్రభావం పడుతుంది.
 
మిశ్రమాలతోనూ సమస్యే
కొన్ని రకాల ఆహార పదార్థాల మధ్య పొంతన కుదరదు. అలాంటి పొంతన కుదరని వాటినే ‘విరుద్ధ ఆహార పదార్థాలు’ అంటారు. అలాంటి విరుద్ధ ఆహార పదార్థాలను కలిపి గానీ, వెనువెంటనే గానీ తీసుకోకూడదు. విరుద్ధ ఆహారాలు శరీరంలో దోషాలు నింపడమే కాదు. దోషాలను బయటికి వెళ్లిపోకుండా లోపలే బంధిస్తాయి. అవన్నీ చివరికి విషపదార్థాలుగా మారతాయి.
 

నిషిద్ధాహారాలు...

మాంసం లేదా చేపల్లో మినప పప్పుగానీ, పాలు గానీ, తేనెగానీ కలపకూడదు.
ఆకు కూరలు తిన్న తరువాత పాలు తాగకూడదు. కోడి మాంసం, పెరుగు కలిపి తీసుకోకూడదు. అతి స్వల్ప వ్యవధిలో కూడా తీసుకోకూడదు.
పాయసం, మద్యం, అన్నం కలిపి తీసుకోకూడదు.
తేనె, నెయ్యి, కొవ్వు పదార్థాలు, నీళ్లు, నూనె- వీటిలో ఏ రెండుగానీ, అన్నీ గానీ, సమాన నిష్పత్తిలో తీసుకోకూడదు. పైగా ఇవి తీసుకున్న వెంటనే నీరు తాగకూడదు.

పెరుగు, ముల్లంగి, ఎండుమాంసం, ఎండు చేపలు, పందిమాంసం, గొర్రె మాంసం, చేపలు రోజూ తీసుకోకూడదు. అలాగే మినపపప్పు కూడా అలా నిరంరంగా తీసుకోకూడదు.

విషానికి విరుగుడు
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాల వల్ల ఒక్కో ధాతువులో ఒక్కో రకం దోషం పెరుగుతుంది. ఈ స్థితిలో శరీరాన్ని విషతుల్యం చేసే ఆ కారణాలను తొలగించడమే నిజమైన చికిత్స అవుతుంది. అందుకు శరీరాన్ని శుద్ధి చేసే ‘శోధన చికిత్సలు’ చేయాలి. దీనికి ఐదు రకాల ప్రక్రియలతో ఉండే పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గం. అవసరాన్ని బట్టి పంచకర్మల్లోని ఐదు చికిత్సల్లో ఏదో ఒకటిగానీ, అన్నీగానీ చెయ్యాలి. వీటికి తోడు జలమర్దనం, స్నేహనం ( శరీరానికి నూనె పట్టించడం), స్వేదనం ( ఆవిరి స్నానం ) కూడా అవసరమే. వీటికి తోడు ప్రత్యేకమైన కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవలసి ఉంటుంది. శరీర స్థితిగతిని శరీర ధర్మాన్ని అనుసరించి ఇచ్చే ఈ ఆహార పదార్థాలతో శరీరంలో మూతబడిన శ్రోతస్సులన్నీ తెరుచుకుంటాయి. దాంతో శరీరమూ, మనస్సూ కొత్త శక్తినీ, కొత్త చైతన్యాన్నీ పుంజుకుంటాయి.
-డాక్టర్‌ డి. విఠల్‌ రావు,
రిటైర్‌ ప్రొఫెసర్‌, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌